‘ఎయిర్ పోర్టులో బాంబులున్నాయి. కాసేపట్లో పేలుబోతున్నాయి...’

ఒకే రోజు విమానాశ్రయాలు, హాస్పిటళ్లకు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిల్లో ఇంకా ఏం రాసి ఉంది? బాంబు డిస్పోజబుల్ స్వ్యాడ్ చెప్పిందేమిటి?

Update: 2024-06-19 05:30 GMT

వారణాసి, చెన్నై, పాట్నా, జైపూర్‌ సహా 41 విమానాశ్రయాలకు, హాస్పిటళ్లకు, కాలేజీలకు మంగళవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు విస్రృత తనిఖీలు నిర్వహించాక బాంబు బెదిరింపు ఉత్తిదేనని తేల్చారు.

exhumedyou888@gmail.com నుండి మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో ఈ మెయిల్స్ అందడంతో విమానాశ్రయ టెర్మినల్స్‌ వద్ద భద్రత పెంచారు.

జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఉన్నారు. వారణాసి విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా బలగాలు అణువణువూ గాలించాయి. అయితే వారికి ఏమీ లభించలేదు.

ఆ గ్రూపుపైనే అనుమానం..

"KNR"అనే ఆన్‌లైన్ గ్రూప్ ఈ బూటకపు బెదిరింపు ఈ మెయిల్స్ పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే బృందం మే 1న ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని పలు పాఠశాలలకు ఇదే తరహా మెయిల్స్ ను పంపిందని వారు చెబుతున్నారు.

అన్నింటిలో ఒకే సందేశం..

విమానాశ్రయాలకు వచ్చిన ఈ మెయిల్స్ అన్నింటిలో ఒకే సందేశం ఉంది. “హలో, విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు ఉంచారు. త్వరలో బాంబులు పేలుబోతున్నాయి. మీరంతా చనిపోతారు.” అని ఉంది.

ఆలస్యంగా బయల్దేరిన దుబాయ్ ఫ్లైట్..

చెన్నై విమానాశ్రయంలో 286 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్లాల్సిన విమానం బాంబు బెదిరిపు కారణంగా ఆలస్యంగా బయలుదేరింది. విమానాన్ని అంతకుముందు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడు పదార్థాలేమీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే విమానం టేకాఫ్ తీసుకుంది.

చెన్నై నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇదే తరహ బాంబు బెదిరింపు వచ్చింది. అయితే అది సురక్షితంగా ల్యాండ్ అయింది. న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌కు సైతం బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలిసింది.

బూటకపు బెదిరింపులు రావడంతో నాగ్‌పూర్, పాట్నా విమానాశ్రయాలలో భద్రత బలగాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి.

అట్టుడికిన ముంబై..

ముంబైలోని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), ప్రముఖ ఆసుపత్రులు, కాలేజీలు సహా 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసు బలగాలు అనుమానాస్పదంగా కనిపించిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామని, అయితే పేలుడు పదార్థాలేమి కనిపించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.

కోల్‌కతాలోనూ...

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని SSKM హాస్పిటల్, రవీంద్రభారతి విశ్వవిద్యాలయ అధికారులకు మంగళవారం బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు అందాయి. శోధించిన పోలీసులు వాటిని బూటకపు మెయిల్స్‌గా పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ సభ్యులతో కూడిన బృందాలను రెండు ప్రాంతాలకు పంపించామని, అయితే సోదాలు ఏమీ లభించలేదని ఒక అధికారి తెలిపారు. కోల్‌కతా సైబర్ విభాగం పోలీసులు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.

“అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు భయపడాల్సిన పని లేదు ”అని ఆయన చెప్పారు.

Tags:    

Similar News