మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు జరంగే వార్నింగ్..
‘‘చర్చలకు మేం సిద్ధం. కానీ ముంబైని వీడం. అరెస్టు చేయాలని చూస్తే అది మీకే ప్రమాదం’’ - మరాఠా హక్కుల కార్యకర్త;
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేదాకా ముంబై వీడనని మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే (Jarange) స్పష్టం చేశారు. తమను OBCలుగా గుర్తించాలని ఆయన దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో చేపట్టిన నిరసన దీక్ష మంగళవారానికి (సెప్టెంబర్ 2) ఐదో రోజుకు చేరుకుంది.
నిరసనకారులపై కేసు..
ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముంబైలోని జుహు డిపోలో ఓ ప్రయాణికుడిపై దాడి చేసి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం తెలిసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే నిరసనకారులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో దాదాపు 10 మంది గుర్తు తెలియని నిరసనకారులపై కేసు నమోదు చేశారు. కాషాయ టోపీలు, స్కార్ఫ్‌లు ధరించిన నిరసనకారులు ప్రయాణికులతో గొడవ పడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియోలో వైరల్ అవుతోంది.
‘‘మేం చర్చలకు సిద్ధం..’’
"మేం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లు నెరవేరే వరకు మేం ఇక్కచి నుంచి కదలం. మమ్మల్ని అరెస్టు చేయాలని చూస్తే అది మీకే ప్రమాదం. హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం. 4 వేల నుంచి 5వేల మంది నిరసనకారులు మాత్రమే ఉన్నాం. న్యాయస్థానం మరాఠాలకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. మరాఠాలను కున్బీలుగా గుర్తించేలా ముఖ్యమంత్రి ఫడ్నవీస్(CM Devendra Fadnavis) జీవో జారీ చేయాలి.
జరంగేకు కోర్టు నోటీసులు..
29వ తేదీ నుంచి దీక్ష చేపడుతున్న జరంగేకు సంఘీభావం తెలిపేందుకు వేల సంఖ్యలో ఆజాద్ మైదానానికి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను గమనించిన బాంబే హైకోర్టు జోక్యం చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికి నగరంలోని అన్ని వీధులను ఖాళీ చేయాలని జరంగే మద్దతుదారులను కోరింది. ఈ మేరకు మనోజ్ జరంగే, నిరసనకారులకు మంగళవారం (సెప్టెంబర్ 2) ముంబై పోలీసులు కోర్టు నోటీసులు ఇచ్చారు.