‘విధులకు హాజరుకావొద్దు...

ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టల వ్యవహారంతో ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం;

Update: 2025-03-24 08:41 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ(Justice Yashwant Varma)ను విధుల నుంచి దూరంగా ఉంచారు. తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగింది?

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో మార్చి 14వ తేదీన అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బందికి స్టోర్ రూంలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ నేపథ్యంలో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా.. అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయను ఆదేశించింది. ఆయన శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు(Supreme Court) సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించారు. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనరు నుంచి తీసుకున్న ఫొటోలు, వీడియోను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

మరోవైపు యశ్వంత్‌ వర్మ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు చీఫ్ 3 రాష్ట్రాల హైకోర్టు జడ్జీలతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శీల్‌ నాగు, హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌ సభ్యులుగా ఉంటారు.

వర్మ ఏమంటున్నారు?

కాలిపోయిన నోట్లతో తనకు ఎలాంటి సంబంధంలేదని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ చెబుతున్నారు. అసలు స్టోర్‌రూమ్‌లో నగదు ఉందన్న విషయం నాకుగాని, మా కుటుంబ సభ్యులకుగాని తెలియదని పేర్కొన్నారు.

Tags:    

Similar News