S.I.R ఎందుకు నిర్వహించారో చెప్పిన AICC చీఫ్ ఖర్గే

‘‘స్వాతంత్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడం రాజ్యాంగ, లౌకిక గణతంత్ర స్ఫూర్తిని ఉల్లంఘించడమే’’ - కాంగ్రెస్ నేత జైరాం రమేష్;

Update: 2025-08-15 11:29 GMT
Click the Play button to listen to article

ఓటరు జాబితా సవరణ (SIR) ముసుగులో ప్రతిపక్ష ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) శుక్రవారం (ఆగస్టు 15) ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. ఓటరు జాబితా నుంచి ఎవరిని, ఏ ప్రాతిపదికన తొలగిస్తున్నారో ఈసీ బయటకు చెప్పడం లేదని, బతికి ఉన్న ఓటర్లను సైతం చనిపోయినట్లు చూపుతున్నారని ఆరోపించారు. తొలగించిన ఓటర్ల జాబితా ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. దీన్ని బట్టి ఎన్నికల సంఘం నిష్పాక్షికతను అంచనా వేయవచ్చని అన్నారు.


SIRపై విమర్శలు..

EC ప్రచురించిన బీహార్‌ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించడంపై కేంద్రంలోని అధికార పార్టీ అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఖర్చే అన్నారు. తొలగించిన ఓటర్ల జాబితాను బహిరంగపర్చాలని ECని ఆదేశించినందుకు సుప్రీంకోర్టుకు ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు.

"SIR వల్ల ఎవరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తోంది. లోక్‌సభ స్థానాలు గెలుపొందడానికి ఎలా ఓట్ల దొంగతానానికి పాల్పడ్డారో రాహుల్ జీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అధికారంలో కొనసాగడానికి అధికార ఎన్డీఏ ఎంతటి అనైతికతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉంది,’’ అని ఏఐసీసీ చీఫ్ ఆరోపించారు.


‘రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు’

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించడం రాజ్యాంగ, లౌకిక గణతంత్ర స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. వచ్చే నెలలో 75వ వసంతంలోకి అడుగిడుతున్న ఆర్‌ఎస్ఎస్‌ను సంతోషపెట్టడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని ఆయన Xలో పోస్టు చేశారు. 

Tags:    

Similar News