మోదీకి లేఖ రాసిన ఖర్గే, రాహుల్.. అందులో ఏం కోరారు?
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంపై ప్రధాని గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేసిన ప్రతిపక్ష నేతలు..;
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని రాజ్యసభ, లోక్‌సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi) బుధవారం (జూలై 16) ప్రధాని మోదీ(Narendra Modi)కి లేఖ రాశారు. ఇందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చట్టం తీసుకురావాలని వారు లేఖలో కోరారు. గతంలో కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చిన సందర్భాలను లేఖలో గుర్తుచేస్తూ.. ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
హామీని గుర్తుచేసిన నేతలు..
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంపై గతంలో ఇచ్చిన హామీలను ఖర్గే, రాహుల్ ప్రధానికి గుర్తు చేశారు. రాష్ట్ర హోదాకు కట్టుబడి ఉన్నామని మే 19, 2024న భువనేశ్వర్‌లో ఓ ఇంటర్వ్యూలో మోదీ చెప్పడాన్ని, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టుకు కూడా చెప్పిన విన్నవించిన విషయాన్ని వారు లేఖలో పేర్కొన్నారు. చివరగా కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద చేర్చేందుకు చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.