ఏపీ ఎన్నికల్లో మిషన్‌ ఇంద్రధనస్సు

మ్యానిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్‌ బిజీ

Byline :  The Federal
Update: 2023-12-12 16:54 GMT
కాంగ్రెస్‌ పార్టీ నినాదం (ఫైల్‌ ఫొటో)

కాంగ్రెస్‌.. కర్నాటకలో గెలిచిన పార్టీ. తెలంగాణలో అధికారాన్ని తెచ్చుకున్న పార్టీ. ఆంధ్రాలో అడుగంటిన పారీ. ఇప్పుడీ పార్టీకి కొత్త జవసత్వాలు ఇవ్వడానికి మహామహులు కుస్తీ పడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు ఆంధ్రనాట పార్టీ జెండాను మోస్తున్న రుద్రరాజు ఒకనాటి వ్యూహకర్త జేడీ శీలం వరకు ఎందరెందరో ఊపిరి పోయాలని చూస్తున్నారు. ‘ఏపీలో పార్టీ పునర్జీవనానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. పాత గాయాలను మాన్పేలా ప్రయత్నిస్తాం. ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం.’ అంటున్నారు జేడీ శీలం. ఈ జేడీ శీలం ఎవరో కాదు, శ్రీపెరంబదూర్‌లో ఎటీటీఈ ఘాతుకానికి బలైన రాజీవ్‌ గాంధీకి అనుంగు అనుచరుడు, మాజీ ఐఏఎస్‌ అధికారి, ఓనాటి పార్లమెంట్‌ సభ్యులు. ఆరణాల ఆంధ్రుడు. ఈయనను ఫెడరల్‌ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చెప్పిన మాట కాస్తంత ఆశ్చర్యం కలిగిస్తున్నా కాంగ్రెస్‌ పార్టీ పతాకం ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లో ఎగిరేలా ఆశలు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలోనూ వేళ్లూనుకోడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంద్ర ధనస్సు మాదిరిగా ఏడు పథకాలను ప్రకటించేందుకు కుస్తీ పడుతున్నది.

మిషన్‌ ఇంద్ర ధనస్సు
కర్నాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఐదు వాగ్దానాలలో గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి (మహిళలకు ఉచిత రవాణా) పథకాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాలు ఉన్నాయి. వీటికి ధీటుగా అమరావతి ఏకైక రాజధాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వంటి కార్యక్రమాల మేళవింపులో ‘మిషన్‌ ఇంధ్ర దనస్సు’ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పెట్టబోతోంది.
ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులను తట్టి లేపాలనే ఆలోచన కూడా కాంగ్రెస్‌ అధిష్టానం చేస్తున్నది. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆకాంక్షల అమలు ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ సర్వ శక్తులు వడ్డనుంది. ఇందులో భాగమే షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచన కూడా.
Tags:    

Similar News