ఆర్జేడీ, కాంగ్రెస్ బంధానికి మోదీ కొత్త నిర్వచనం..
ముజాఫ్పర్‌పూర్ ఎన్నికల ప్రచార సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్..
ప్రధాని మోదీ(PM Modi) మహాఘట్బంధన్(Mahagathbandhan) కూటమిపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్ (Bihar) రాష్ట్రం ముజాఫ్పర్‌పూర్‌లో గురువారం (అక్టోబర్ 30) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ‘ఛత్ మహాపర్వ్’ చుట్టూ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
‘ఈ అవమానాన్ని బీహార్ తల్లులు భరిస్తారా? ’
‘‘ఛత్ పూజకు మోదీ యమునా నదీలో స్నానానికి రావాలనుకున్నారు. అయితే పూర్తిగా కలుషితమైన నీటిలో స్నానం ఆచరించడానికి బదులుగా ఆయన కోసం శుద్ధ జలాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్న విషయం బయటకు పొక్కడంతో మోదీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.’’ అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల ముజఫ్ఫర్‌పుర్ బహిరంగసభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇచ్చారు.
‘‘ఛత్ పూజ సందర్భంగా నీళ్లు కూడా తాగకుండా దీర్ఘ ఉపవాసం ఆచారించే మహిళలను కాంగ్రెస్, ఆర్జేడీ అవమానిస్తున్నాయి. ఛత్ మైయ్యాకు జరిగిన ఈ అవమానాన్ని బీహార్ తల్లులు, సోదరీమణులు సహిస్తారా?’’ అని మోదీ ప్రశ్నించారు.
మహాఘట్బంధన్ విభేదాల గురించి ప్రస్తావిస్తూ ..‘‘ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలది నూనె-నీటి లాంటి బంధం. ఆ రెండూ ఎప్పటికీ కలవవు. బీహార్‌లో ఓట్ల కోసం వారు కలిసి చేస్తున్న ర్యాలీలన్నీ బూటకమే’’ అని ఎద్దేవా చేశారు.
ఇంకా ఏమన్నారంటే..
"... ఎక్కడైతే ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress) ద్వేషాన్ని వ్యాపింపజేస్తాయో.. అక్కడ సామరస్యం కనిపించదు. ఎక్కడైతే ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల దుష్పరిపాలన ఉంటుందో.. అక్కడ అభివృద్ధి జాడ కనిపించదు. ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ సామాజిక న్యాయం జరగదు. పేదల హక్కులు దోచేశారు. కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. అలాంటి వ్యక్తులు, అలాంటి కుటుంబాలు బీహార్‌కు ఎప్పటికీ మంచి చేయలేరు" అని తీవ్రంగా విమర్శించారు. బీహార్ రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందన్నారు.
ఛత్ పూజకు యునెస్కో గుర్తింపు దక్కేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు ఛత్‌పై పోటీని నిర్వహిస్తుందని ప్రధాని ప్రకటించారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.