అసలు నిమిషా ప్రియకు మరణశిక్ష రద్దయ్యిందా?
బాధిత కుటుంబసభ్యులు నిమిషాకు క్షమాభిక్ష పెట్టారా? ఆ విషయం వారు కోర్టుకు తెలిపారా? భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏమంటోంది?;
యెమెన్(Yemen) దేశంలో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya) కేసుపై భిన్న కథనాలు బయటకు వస్తున్నాయి. ఉరిశిక్షకు ముందు రోజు భారత గ్రాండ్ ముఫ్తీ.. సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వారి జోక్యంతో మరణశిక్ష వాయిదా పడిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మరోలా చెబుతోంది. "ఉరిశిక్ష రద్దు గురించి యెమెన్ అధికారుల నుంచి మాకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు" అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.
‘అవన్నీ తప్పుడు కథనాలే..’
హతుడు తలాల్ అబ్దో మహదీ సోదరుడు అబ్దుల్ ఫత్తా మహదీ భారత మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా తీవ్ర పదజాలంతో కూడిన పోస్టు పెట్టాడు. అరబిక్ భాషలో ఉన్న ఆ పోస్టులో ఇలా రాసి ఉంది. “మేం నిమిషాను క్షమించలేదు. మాతో ఎలాంటి ఒప్పందం జరగలేదు. బ్లడ్ మనీ కూడా అందలేదు. ఈ వార్తలన్నీ అబద్దాలే. దారుణమైన నేరానికి పాల్పడ్డ మహిళను భారత మీడియా కీర్తిస్తోంది’’ అని పేర్కొన్నారు.
యెమెన్ చట్టం ప్రకారం..హతుడి కుటుంబసభ్యులు బ్లడ్ మనీ తీసుకుని నిమిషాకు క్షమాభిక్ష పెట్టే వీలుంది. ఆ విషయాన్ని వారు అధికారికంగా కోర్టుకు తెలియపర్చాలి. కాని ఇప్పటివరకూ అలాంటిదేమీ జరగలేదు. దీంతో నిమిషా విషయంలో జోక్యం చేసుకున్న వ్యక్తుల ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
‘క్రెడిట్ కోసమేనా?’
జాతీయ మీడియా కంట్లో పడేందుకు మాత్రమే కాంతపురం ప్రతినిధి బృందం, సనాలో నిమిషా కుటుంబంతో కలిసి పనిచేస్తున్న బృందం, KA పాల్ వంటి నిమిషా విషయంలో జోక్యం చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిమిషాకు మరణశిక్ష నుంచి బయటపడేసేది కేవలం అబ్దో కుటుంబం మాత్రమే. నిమిషాకు క్షమాభిక్ష పెడుతున్నామని వారే కోర్టులో తెలపాలి. అలాంటపుడు మాత్రమే నిమిషా మరణశిక్ష నుంచి బయటపడినట్లు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ అలా జరగలేదు.
ప్రస్తుతం కారాగారంలోనే ఉన్న నిమిషా..
ప్రస్తుతం నిమిషా ప్రియ యెమెన్ జైలులో ఉంది. ఆమె తల్లి ప్రేమకుమారి దాదాపు ఒక సంవత్సరం పాటు యెమన్ దేశ రాజధాని సనాలో ఉన్నారు. నిమిషా భర్త, కుమార్తె రెండు రోజుల క్రితం యెమెన్ చేరుకున్నారు. మరణ శిక్ష నుంచి నిమిషాకు విముక్తి లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు నిమిష శ్రేయోభిలాషులు. అయితే మరణశిక్ష నుంచి నిమిషా బయటపడ్డా.. ఆమెకు జీవిత ఖైదు తప్పదని మరికొంతమంది పేర్కొంటున్నారు. మొత్తం మీద నిమిషాకు మరణ దండన విషయంలో అటు కోర్టు నుంచి, ఇటు యెమన్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.