PM Modi: యువత కోసం రూ. 1 లక్ష కోట్ల పథకం

ఈ ఏడాది చివరికి తొలి మేడ్-ఇన్-ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు మార్కెట్లోకి - సింధూ జలాలను వదలమని స్పష్టీకరణ - సామాన్యులపై భారాన్ని తగ్గించేలా జీఎస్టీలో సంస్కరణలు..;

Update: 2025-08-15 07:53 GMT
Click the Play button to listen to article

79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని (Independence day) ప్రధాని మోదీ(PM Modi) ఢిల్లీలోని ఎర్రకోట బురుజు(Red Fort) నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు. పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. యువత కోసం రూ. 1 లక్ష కోట్ల పథకం - ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి ప్రభుత్వం నుంచి రూ.15 వేలు ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.


సెమీకండక్టర్ల ఉత్పత్తి..

ఈ ఏడాది చివరి నాటికి తొలి మేడ్-ఇన్-ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు మార్కెట్లోకి విడుదలవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆరు సెమీకండక్టర్ యూనిట్లు ప్రారంభం అయ్యాయని, నాలుగు కొత్త యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పారు. అణుశక్తి సామర్థ్యాన్ని పదిరెట్లకు పెంచుతామని మోదీ తెలిపారు.


జీఎస్టీలో సంస్కరణలు..

సంస్కరించిన జీఎస్టీని దీపావళి కానుకగా ఇస్తామన్నారు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు, చేర్పులు చేస్తు్న్నామని, సామాన్యులపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


'పాక్ బెదిరింపులకు బెదరం'

అణుబాంబుల బెదిరింపులకు భారత్ బెదరదని, శత్రువుకు తగిన సమాధానం ఇస్తామని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు మోదీ. పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌కు సింధు జలాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, మాజీ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో, పాకిస్థాన్ ప్రధాని షహెబాజ్ షరీఫ్ ..సింధూ జలాలను వదలకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్-పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం వల్ల గత ఏడు దశాబ్దాలుగా భారత రైతులు "ఊహించని నష్టాలను" చవిచూశారని, ఇకపై వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాక్‌కు నీరు వదలడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.


స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి..

స్వాతంత్య్ర సమరయోధులు డా.రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎస్ రాధాకృష్ణన్ త్యాగాలను మోదీ కొనియాడారు. "నారి శక్తి" సహకారం తక్కువేమీ కాదని అన్నారు. రాజ్యాంగం కోసం ముఖర్జీ ఎంతో త్యాగం చేశారని గుర్తుచేశారు.


ప్రధాని ప్రసంగం రికార్డుల్లోకి..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఈ సారి 103 నిమిషాలు ప్రసంగించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇంత సమయం పాటు మాట్లాడలేదు. గతేడాది 98 నిమిషాల తన రికార్డును బద్దలు కొట్టారు. 2016 లో 96 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ 2017 లో 56 నిమిషాలు మాత్రమే మాట్లాడారు.

ప్రధాని హోదాలో మోదీ ఎర్రకోట నుంచి వరుసగా 12 సార్లు ప్రసంగించి ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టారు. వరుసగా 17 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత స్థానం మోదీకే దక్కింది. 

Tags:    

Similar News