బిర్సా ముండా జయంతి సభకు ప్రధాని మోదీ..అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధాని మోదీ బీహార్‌లోని జముయి జిల్లాలో ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు ముండా గౌరవార్థం నాణెం, పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు.

Update: 2024-11-15 08:02 GMT

ప్రధాని మోదీ శుక్రవారం బీహార్‌లో పర్యటించారు. ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జముయి జిల్లాలో రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. అలాగే ముండా గౌరవార్థం నాణెం, పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. భారతీయ గిరిజన స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా..చోటానాగ్‌పూర్ ప్రాంతంలోని గిరిజన సమాజాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడేలా ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా "ఉల్గులన్" (తిరుగుబాటు) సాయుధ విప్లవానికి నాయకత్వం వహించారు.

గిరిజనుల కోసం పలు ప్రాజెక్టులు..

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) కింద గిరిజన కుటుంబాల కోసం నిర్మించిన 11,000 గృహాలకు మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్య, జీవనోపాధి మెరుగుపరచడంపై మోదీ దృష్టి సారించారని అధికారులు పేర్కొన్నారు. PM-JANMAN కింద 23 మొబైల్ మెడికల్ యూనిట్లు (MMUలు), మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం ధరి ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUA) కింద 30 అదనపు MMUలను మోదీ ప్రారంభించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా 10 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, 300 వాన్ ధన్ వికాస్ కేంద్రాలను కూడా ప్రధాని ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, జబల్‌పూర్‌లో రెండు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంలను, శ్రీనగర్, గాంగ్‌టక్‌లలో రెండు గిరిజన పరిశోధనా సంస్థలను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హబ్‌లుగా పనిచేసే 500 కి.మీ కొత్త రోడ్లు, 100 బహుళ ప్రయోజన కేంద్రాలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. PM-JANMAN కింద 25,000 కొత్త గృహాలకు, DAJGUA కింద 1.16 లక్షల గృహాలకు, గిరిజన విద్యార్థుల కోసం 370 హాస్టళ్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Tags:    

Similar News