పోలీసులు లంచం ఇవ్వాలని చూశారు: ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు
‘మా కూతురి మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయడం ద్వారా పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు‘ - ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు
తమ కూతురి మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయడం ద్వారా పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని కోల్‌కతాలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని భద్రపరచాలని కోరినా.. దహన సంస్కారాలకు బలవంతం చేశారని చెబుతున్నారు. మృతదేహాన్ని తమకు అప్పగించేటప్పుడు ఓ సీనియర్ పోలీసు అధికారి లంచం ఇచ్చారన్న పేర్కొన్నారు.బుధవారం ఆర్‌జి కర్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు ఈ విషయాలు చెప్పారు.
‘ఆ డబ్బును తిరస్కరించాం’
“మొదటి నుంచి పోలీసులు కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదు. పోస్టుమార్టానికి తీసుకెళ్లే సమయంలో పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాలని చెప్పారు. తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు.. సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బు ఇచ్చారు. మేం వెంటనే తిరస్కరించాం” అని మృతురాలి తండ్రి చెప్పారు.
‘చాలా ఒత్తిడి తెచ్చారు’
"మేం ఇంటికి తిరిగి వచ్చాం. సుమారు 300-400 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. ఉద్రిక్త పరిస్థితుల్లో కూతురిని దహనం చేయవలసి వచ్చింది." అని కన్నీరు పెట్టుకున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై తన సంతకం కోసం ప్రయత్నించారని, అయితే ఆ కాగితన్ని చింపి విసిరివేశానని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తమ స్నేహితురాలు, సహోద్యోగికి న్యాయం చేయాలంటూ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్ద ధర్నా చేస్తున్న వైద్యులకు బాధితురాలి తల్లి పూర్తి మద్దతు తెలిపారు. "నేను నిద్రపోలేను. నేరస్థులు కూడా నిద్రపోకూడదని కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగించాలి" అని పేర్కొంది.
సమాధానం లేని ప్రశ్నలు..
తన కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగిన తర్వాతి పరిస్థితులపై బాధితురాలి తండ్రి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. మృతదేహాన్ని పరీక్షించకముందే ఆస్పత్రి అధికారులు తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయిందని ఎలా చెప్పారని ప్రశ్నిస్తున్నారు. తమ కూతురి ముఖాన్ని చూసేందుకు మూడున్నర గంటలపాటు ఎందుకు వెయిట్ చేయించారని అడుగుతున్నారు.
"కూతురిని చూడనివ్వమని నా భార్య వారి కాళ్ళపై పడింది. శవపరీక్ష ఎందుకు ఆలస్యమైంది? పోలీసులు అసహజ మరణంపై ఎందుకు కేసు పెట్టారు? నేను తాలా పోలీస్ స్టేషన్‌లో రాత్రి 7 గంటలకు ఫిర్యాదు చేసాను. 11.45 గంటలకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు?" అని ప్రశ్నిస్తున్నారు.
మృతదేహం ఉన్న సెమినార్ హాల్‌కు తీసుకెళ్లే ముందు బాధితురాలి తల్లిదండ్రులు కేవలం 10 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చిందని కోల్‌కతా పోలీసులు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో తెలిపారు. తమ కుమార్తెను చూడనివ్వకుండా, మూడు గంటలకు పైగా మమ్మల్ని వెయిట్ చేయించారన్న వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు.
ఎఫ్‌ఐఆర్ దాఖలులో జాప్యం..
ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యం కూడా ప్రశ్నలను లేవనెత్తారు. మృతదేహాం చూసిన దాదాపు 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి గల కారణాన్ని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అడిగారు.
బాధితురాలి తల్లిదండ్రులు గతంలో కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వివిధ వర్గాల ప్రజలు ఆగస్టు 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ గత రాత్రి నగర వాసులు గంటపాటు లైట్లు ఆర్పేశారు. నిరసనలో భాగంగా విక్టోరియా మెమోరియల్, రాజ్ భవన్ వంటి ల్యాండ్‌మార్క్ స్మారక చిహ్నాలలో కూడా లైట్లను ఆపేశారు. గవర్నర్ సివి ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో కొవ్వొత్తులను వెలిగించి ఎక్స్‌లో విజువల్స్ పంచుకున్నారు.
ప్రిన్సిపాల్ అరెస్టు..
ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. మంగళవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అత్యాచార బాధితురాలు మరణించినా, లేక మానసిక స్థితి కోల్పోయినా మరణశిక్ష విధించాలని, నేరస్తులకు పెరోల్‌కు అనుమతించకుండా జీవిత ఖైదు విధించాలని బిల్లులో పొందుపర్చారు.