అత్యాచారం తర్వాత వైస్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడిన ప్రధాన నిందితుడు..
నిందితులకు వైద్యపరీక్షలు చేయించి కాల్ డేటాను పరిశీలిస్తు్న్న సిట్ బృందం..;
కోల్‌కతా (Kotkata) లా కాలేజీ సామూహిక అత్యాచారం(Gang rape) కేసును తొమ్మిది మంది సభ్యుల సిట్ (S.I.T) బృందం దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఘటనకు ముందు, ఆ తర్వాత ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారన్న దానిపై కూపీ లాగుతున్నారు. వారి కాల్‌డేటాను ఇన్‌వెస్టిగేషన్ టీం ఇప్పటికే సేకరించింది. నేరం జరిగిన మరుసటి రోజు (జూన్ 26) ఉదయం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయన ఛటర్జీకి ఫోన్ చేసినట్లు గుర్తించారు. ‘వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికే వైస్ ప్రిన్సిపాల్‌ను రెండుసార్లు ప్రశ్నించాం’’ అని దర్యాప్తు బృందలోని IPS అధికారి ఒకరు చెప్పారు.
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అన్ని విషయాలకు పోలీసులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగా దక్షిణ కోల్‌కతా కస్బా ప్రాంతంలోని లా కాలేజీ విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాను పరీక్షించిన వైద్యులు.. అతని ఒంటిపై గోటి గాయాలున్నట్లు గుర్తించారు. జూన్ 25వ తేదీ సాయంత్రం కాలేజీ ఆవరణలోని సెక్యూరిటీ గార్డు రూంలో అత్యాచారానికి పాల్పడ్డ సమయంలో బాధితురాలు ప్రతిఘటించింది.
ఘటనా సమయంలో తాను అస్వస్థతకు గురయ్యానని, ఊపిరి ఆడడం లేదని, వెంటనే ఆసుప్రతికి తీసుకెళ్లాలని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు అందుకు నిరాకరించడంతో చివరకు ఇన్‌హేలరయినా తేవాలని కోరారు.
ఇన్‌హేలర్ కొని తెచ్చిన మరో నిందితుడు..
‘అరెస్టయిన నిందితుల్లో ఒకరైన జైబ్ అహ్మద్ బాధితురాలికి ఇన్హేలర్ కొనేందుకు మెడికల్ షాపునకు వెళ్లాడు. ఇన్సేలర్ కావాలని మెడికల్ షాప్ యజమానికి అడిగాడు. తన దగ్గర ఉన్న కొంతడబ్బును నగదు రూపంలో, మిగతా డబ్బును UPI ద్వారా చెల్లించాలని అనుకున్నాడు. అయితే దుకాణ యజమాని అందుకు ఒప్పుకోకపోవడంతో UPI ద్వారానే మొత్తం డబ్బు చెల్లించాడు. మెడికల్ షాప్ ఓనర్ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నాం. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు," అని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు .
కస్టడీ పొడిగింపు..
ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. జూలై 8 వరకు ఎనిమిది రోజుల పాటు కస్టడీకి అలీపోర్ కోర్టు అనుమతి ఇచ్చింది. జూన్ 26న అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచిన నిందితులకు తొలుత నాలుగు రోజుల పోలీసు కస్టడీ అంగీకరించింది. అయితే పోలీసులు కోరడంతో కస్టడీని పొడిగించింది. ఇదే కేసులో అరెస్టు చేసిన సెక్యూరిటీ గార్డును పినాకి బెనర్జీకి జూలై 4 వరకు కస్టడీ పొడిగించారు.
ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్ డ్యూటీ వదిలిపెట్టి బయటకు వెళ్లలేదని, అతనికి బెయిల్ మంజూరు చేయాలని సెక్యూరిటీ గార్డు తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే ఆయన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు.
వర్చువల్‌గా విచారణ..
నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఒక వర్గం న్యాయవాదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన నేపథ్యంలో.. కోర్టు ప్రాంగణంలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు నిందితులను న్యాయమూర్తి ముందు వర్చువల్‌గా హాజరుపరచాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అలీపోర్ కోర్టు న్యాయవాదుల సంఘం బీజేపీ లీగల్ సెల్ సభ్యులు కూడా నిందితుల తరపున ఏ న్యాయవాది వాదించకూడదని డిమాండ్ చేస్తూ బార్‌కు లేఖ రాశారు.
ఇప్పటికే డిబార్..
కాగా కాలేజీ పాలక మండలి నిందితులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్న మిశ్రా సేవలను రద్దు చేశారు. ఇద్దరు విద్యార్థులను కాలేజీ నుంచి తొలించారు.
విద్యార్థుల నిరసన ప్రదర్శన..
అంతకుముందు రోజు.. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థులు క్యాంపస్‌లో భద్రత పెంచాలని కోరుతూ కళాశాల ముందు నిరసన ప్రదర్శనకు దిగారు. తరువాత దక్షిణ కోల్‌కతాలోని గరియాహత్ క్రాసింగ్ వరకు ప్రదర్శన చేపట్టారు.