కోల్‌కతా ఘటనలో ప్రిన్సిపాల్‌ను అనుమానిస్తున్నారా?
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యకు కుట్ర జరిగిందా? ప్రిన్సిపాల్ బండారం బయటపెడుతుందని అంతమొందించారా? సీబీఐ ఆయనను అనుమానిస్తోందా?
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. దుర్ఘటనకు సంబంధించి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ ఘోష్ మీదున్న ఆరోపణలే అందుకు కారణం.
వివాదాలకు కేంద్రం డాక్టర్ ఘోష్..
డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్థోపెడిక్ డాక్టర్. ప్రొఫెసర్ కూడా. 2021లో RG కర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా వచ్చారు. అంతకుముందు కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ (CNMC) వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన రెండు రోజుల తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే మమత బెనర్జీ ప్రభుత్వం డాక్టర్ ఘోష్‌ను CNMCకు బదిలీ చేయాలనుకుంది. అయితే అక్కడి ట్రైనీ డాక్టర్లు ఘోష్‌ను తిరిగి తమ ఆసుపత్రికి రావడానికి ఇష్టపడడం లేదని సమాచారం. ఘోష్ నుద్దేశించి మా క్యాంపస్‌లో ఈ ‘‘చెత్త’’ ఎందుకు అన్నారట.
విద్యార్థుల నిరాహార దీక్ష..
RG కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల తర్వాత.. విద్యార్థులకు, హాస్టల్‌కు వేర్వేరుగా రెండు కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు పట్టుబట్టారు. అందుకు ఘోష్ అంగీకరించలేదు. దాంతో 350 మంది విద్యార్థులు నిరసనకు దిగారు. ఆయన కార్యాలయం వెలుపల నిరాహార దీక్ష కూడా చేపట్టారు విద్యార్థులు.
TMC నేతలతో ఘోష్‌కు సత్సంబంధాలు..
ఘోష్‌పై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో అతనిని రెండుసార్లు మరో కాలేజీకి బదిలీ చేశారు. కాని TMC నేతలతో తనకు ఉన్న సత్సంబంధాల వల్ల ట్రాన్స్ఫర్ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నాడు ఘోష్. మే 2023లో ఘోష్‌ని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. కానీ అతను వెళ్లలేదు. RG కర్ మెడికల్ కాలేజీలో తన గదికి తాళం వేసి, కొత్త ప్రిన్సిపాల్ బాధ్యతలు తీసుకోకుండా అడ్డుకున్నాడు. 48 గంటల్లోనే తన బదిలీని రద్దు చేయించుకున్నట్లు సమాచారం. గతేడాది సెప్టెంబరులో మళ్లీ అదే మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. నెల రోజులు తిరక్కుండానే RG కర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్నాడు.
కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా శవపరీక్ష కోసం తెచ్చిన మృతదేహాలతో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడంపై విమర్శలొచ్చాయి. ఈ విషయంలో జనవరి 2023లో మెడికల్ కాలేజీ యంత్రాగం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంది.
ఘోష్‌కి అనుకూలంగా కొందరు విద్యార్థులు..
ట్రైనీ డాక్టర్లలో కొంతమంది ఘోష్‌కి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారే ఆయన బదిలీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం, ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఘోష్ అండదండలున్న ట్రైనీ డాక్టర్లు ఆర్‌జి కర్ కళాశాల బాయ్స్ హాస్టల్‌లో ర్యాగింగ్‌కు పాల్పడడంతో.. ఘోష్‌పై రెండో సారి బదిలీ వేటు పడింది.
‘మోస్ట్ కరెప్టెడ్ ఫెలో..’
డాక్టర్ సందీప్ ఘోష్ ‘‘ప్రతీకారేచ్చ’’ గల వ్యక్తి అని కొందరు అంటున్నారు. తన రాజకీయ పలుకుబడితో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేవాడని, ఆ కారణంగానే ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే వారు కాదని తెలుస్తోంది. ఆర్‌జి కర్ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ కూడా ఇదే విషయం వినిపించారు. డాక్టర్ ఘోష్ కాలేజీలో మాఫియా ముఠాను నడుపుతున్నాడని ఆరోపించారు.
#WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | On former principal Prof. (Dr.) Sandip Ghosh, Akhtar Ali, Ex-Deputy Superintendent, RG Kar Medical College and Hospital, says, " He is a very corrupt person. He used to fail students, he used to avail 20% commission… pic.twitter.com/QGdUZqyHGW
— ANI (@ANI) August 14, 2024
“అతను (సందీప్ ఘోష్) చాలా అవినీతిపరుడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే విద్యార్థులను ఫెయిల్ చేయించేవాడు. టెండర్ ఆర్డర్లపై 20 శాతం కమీషన్ తీసుకునేవాడు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేసే ప్రతి పనికి లంచం కావాలనేవాడు. తన గెస్ట్‌హౌస్‌లో విద్యార్థులకు మద్యం సరఫరా చేసేవాడు. మాఫియా మనిషిలా వ్యవహరించేవాడు’’ అని అక్తర్ అలీ పేర్కొన్నాడు. ఘోష్ బౌన్సర్లను వెంట బెట్టుకుని తిరిగేవాడు. నేను అతనిపై 2023లో ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం అతని రాజీనామా కేవలం కంటి తుడుపు చర్యే” అని అలీ అన్నారు.
బాలింతపై చేయిచేసుకున్న ఘోష్..
ఘోష్ తన ఇంటి పక్కనున్న వారితోనూ గొడవ పడేవాడని తెలుస్తోంది. నార్త్ 24-పరగణాస్ జిల్లాలోని బరాసత్‌లోని మల్లిక్ బగాన్ ప్రాంతంలో ఉంటే ఘోష్ ..తన పొరిగింటి వారితో ఘర్షణ పడ్డాడని సమాచారం. బాలింతగా ఉన్న తన భార్యపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని బాధితురాలి భర్త చెప్పారు.
డాక్టర్ ఘోష్ భార్య కూడా డాక్టరేనని తెలుస్తోంది. డబ్బులకు ఆశపడి ఇంటి దగ్గర కూడా రోగులను పరీక్షించేవాడట.
ఘోష్ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు..
అత్యాచార ఘటన జరిగిన తర్వాత డాక్టర్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. "అమ్మాయి రాత్రిపూట ఒంటరిగా సెమినార్ హాల్‌కి వెళ్లడం బాధ్యతారాహిత్యం" అనడంపై నిరసనలు వెల్లువెత్తాయి. రెండోది, ఘోష్ సూచన మేరకు..ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ బాధితురాలికి అనారోగ్యంతో ఉందని మొదట ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం, ఆ తర్వాత మళ్లీ 20 నిమిషాలకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పడం.. ఇవన్నీ ఘటన జరిగిన ఆరుగంటల్లో జరిపిపోవడం అనుమానాలను తావిస్తోంది.
కోర్టులో అక్షింతలు..
ఆగష్టు 13న కలకత్తా హైకోర్టు డాక్టర్ ఘోష్ వ్యవహర శైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ఆసుపత్రి ప్రాంగణంలో ట్రైనీ డాక్టర్ చనిపోయిందని తెలిసిన వెంటనే తానే స్వయంగా లేదా తన సిబ్బంది ద్వారా పోలీసులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ప్రిన్సిపాల్, అతని ఆధీనంలో పనిచేసే అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ‘‘మీరు అతన్ని ఎందుకు కాపాడుతున్నారు’’ అని ఘోష్ తరపు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘోష్‌ను "లాంగ్ లీవ్‌లో వెళ్లమని" సూచించింది కోర్టు.
ట్రైనీ డాక్టర్ మరణంపై బాధితురాలి తల్లిదండ్రులకు పలురకాలుగా చెప్పడం, ఉన్నఫలంగా ఘటనా స్థలానికి దగ్గరలో మరమ్మతు పనులు చేయించడంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కోణంలో కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. హత్యకు ముందు బాధితురాలిని వార్డులో 48 గంటల పాటు పనిచేసేలా పనిష్మెంట్ ఇచ్చారని సమాచారం.
ట్రైనీ డాక్టర్ హత్యకు కుట్ర జరిగిందా?
డాక్టర్ ఘోష్ చెప్పిన కొన్ని సమాధానాలు నమ్మశ్యకంగా లేవని ఒక CBI అధికారి చెప్పారు. ‘‘ఈ నేరం వెనుక కుట్ర దాగి ఉందా? ముందస్తు ప్రణాళిక ఉందా? ప్రిన్సిపాల్‌కు ఏమైనా ప్రమేయం ఉందా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కోణంలో విచారించడానికి కారణాలు కూడా ఉన్నాయి. హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌పై పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, పనిష్మెంట్ కింద ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారని బాధితురాలు తల్లిదండ్రులు చెబుతున్నారు’’ అని చెప్పారు.
ఘోష్ కు సెక్స్ రాకెట్ తో సంబంధాలున్నాయా?
డాక్టర్ ఘోష్ సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని, డ్రగ్ సైఫనింగ్ రాకెట్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఈ విషయాలు ట్రైనీ డాక్టర్‌కు తెలియడంతో ఆమెను అంతమొందించేందుకు కుట్ర జరిగి ఉంటుందని, డాక్టర్ ఘోష్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ హత్యలో భాగస్వాములై
అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇది ముమ్మాటికి సామూహిక అత్యాచారమే అని బాధితురాలి తల్లిదండ్రులు, పేరు బయటపెట్టడానికి ఇష్టపడని కొందరు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ చెబుతున్నారు.