ఆ నలుగురు కాంగ్రెస్ వృద్ధనేతలు రాహుల్‌కు ఏం చెప్పారు?
గుజరాత్‌లో 2027 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేనెల రెండు రోజుల పాటు AICC సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.;
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ నెల మొదట్లో గుజరాత్(Gujarat) రాష్ట్రంలో పర్యటించారు. తన రెండు రోజుల పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగు వృద్ధ నేతలు - 90 ఏళ్ల వయసు ఉన్న బాలుభాయ్ పటేల్, లాల్జీ పటేల్, యోగేంద్ర మక్వానా, 86 ఏళ్ల రమణీక్‌బెన్ పండ్యాను కలిశారు. ఏప్రిల్‌లో రెండు రోజుల పాటు అహ్మదాబాద్(Ahmedabad)లో జరగనున్న ఏఐసీసీ(AICC) సమావేశాలకు రావాలని వారిని ఆహ్వానించారు.
గుజరాత్‌లో పార్టీ పతనానికి ప్రత్యక్ష సాక్షులు..
వాస్తవానికి ఈ నలుగురు చాలా ఏళ్ల క్రితమే పార్టీ(Congress)కి దూరమయ్యారు. రాజకీయాల్లోనూ క్రియాశీల రహితంగా ఉన్నారు. ఒకప్పుడు పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్, ట్రైబ్స్ విభాగానికి గుజరాత్‌లో అధ్యక్షుడిగా ఉన్న యోగేంద్ర మక్వానా 2008లోనే పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా 1960లో పార్టీ విజయం, 1970లో గుజరాత్ నవనిర్మాణ ఉద్యమం అనంతర పార్టీ వెనుకబడటం, 1980లో పార్టీ పునరుజ్జీవనం, 1990 తర్వాత నుంచి గుజరాత్‌లో పార్టీ పతనాన్ని ప్రత్యక్షంగా చూసినవారు.
కాంగ్రెస్ పార్టీ 64 ఏళ్ల తర్వాత మళ్లీ గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సారి వేదికను మార్చారు. అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నలుగురు 1961లో గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ కారణంగానే రాహుల్ గాంధీ మళ్లీ వీరిని ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానించారు.
రాహుల్ గాంధీ ఈ నలుగురి నేతలను కలిసినప్పుడు అప్పటి పార్టీ వైభవాన్ని గురించి చెప్పుకొచ్చారు.
కార్యకర్తలో క్రమశిక్షణ, నిబద్ధత లోపించాయి...
గుజరాత్ భావ్‌నగర్‌లో 1961లో ఏఐసీసీ సమావేశాలకు ఏర్పాట్లు చేయడంలో బాలుభాయ్ కీలకపాత్ర పోషించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో సమావేశాలు విజయవంతమయ్యాయని రాహుల్‌కి వివరించారు. అప్పట్లో సబర్కాంతా జిల్లాలో కాంగ్రెస్ సేవాదళ్ యూనిట్ బాధ్యతలు నిర్వహించిన బాలుభాయ్.. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాది ప్రతినిధుల వసతి కోసం పార్టీ నేతలు, కార్యకర్తల కోసం ఒక చిన్న పట్టణమే నిర్మించామని గుర్తుచేసుకున్నారు. వృద్ధాప్యం వల్ల ఇంటికే పరిమితమైన ఆయన.. అహ్మదాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. తమ కాలంలో పార్టీ కార్యకర్తల్లో ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ ఇప్పుడున్న వారిలో లేవని రాహుల్‌కు చెప్పారు.
ఇప్పటి నేతలు మాటలకే పరిమితం..
“ఈ రోజుల్లో మీరు ఏఐసీసీ సమావేశ ఏర్పాట్ల కోసం పటేల్ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తని ‘టాయిలెట్లు నిర్మించండి’ అని అడగలేరు. అలా అడిగితే భిన్న వాదనలు పుట్టుకొస్తాయి. కానీ అప్పట్లో మేమేం అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే మా నాయకులు ముందుండి పనిచేశారు,” అని బాలుభాయ్ The Federalతో అన్నారు. “ఆ సమయంలో జవహర్‌భాయ్ (అప్పటి ప్రధాని నెహ్రూ) మాతో నేలపై కూర్చునారు. అది చూసి మోరార్జీభాయ్ దేశాయ్ సహా మిగతా నేతలు కూడా స్టేజ్‌పై నుంచి దిగిపోయి మాతో చేరారు.”
“అప్పటి నాయకులు మా గురించి, మా చిన్నచిన్న అవసరాల గురించి శ్రద్ధ వహించేవారు. మరుగుదొడ్లు నిర్మాణంలోనయినా.. ఖాదీ నెయ్యడంలోనయినా..వాళ్లు మాతో కలసి పనిచేసేవారు. ఈ సహకారమే కార్యకర్తలు, నాయకత్వం మధ్య బంధాన్ని పెంచేది. కానీ ఇప్పటి నాయకులు కేవలం ఉత్తేజకర మాటలకే పరిమితమయ్యారు. ఈ విషయం పార్టీ నేతలకు బోధపడాలి ’’ అని పేర్కొన్నారు బాలుభాయ్.
90 ఏళ్ల లాల్జీ పటేల్ 1976లో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980 కాలంలో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సొలంకికి అత్యంత సన్నిహితుడు కూడా. అప్పటి KHAM (క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం) ఓటు బ్యాంక్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన లాల్జీ రాహుల్‌తో కొంతసమయం గడిపారు.
పార్టీ తీరు మారాలి..
“ప్రతి ఎన్నికలో ఓటమి తర్వాత కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు, ఆత్మపరిశీలనలతో బిజీగా ఉంటుంది. కానీ ఏ చర్య తీసుకోవడం ఉండదు. గతంలో పార్టీ ఓటములపై నివేదికలు సిద్ధం చేయమని ఏ.కే. ఆంటోనీని నియమించారు. కాని ఆయన తన నివేదికలో ఏం రాశారో ఎవరికి తెలియదు. దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియదు.” అని లాల్జీ The Federalకి చెప్పారు. భారత్ జోడో యాత్ర దక్షిణ గుజరాత్ మీదుగా వెళ్లినా.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీకి పెద్ద ఆదరణ లభించలేదని రాహుల్‌కి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటి నేతలు పట్టించుకోవడం లేదు..
‘‘ఈ రోజుల్లో గుజరాత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోవడం లేదు. మధ్యకాలంలో కొంతమంది కార్యకర్తలు నన్ను కలవడానికి వచ్చారు. బీజేపీ కార్యకర్తలు మనవాళ్లను వేధిస్తున్నారని. కానీ మన నాయకులకు ఈ సంగతి తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు. మా రోజుల్లో ఇలా కార్యకర్తలను ఎప్పుడూ వదిలేయలేదు. 1960లో మేం నిబద్ధత గల కార్యకర్తల బృందాన్ని నిర్మించాం. 1970ల నవనిర్మాణ ఉద్యమం తర్వాత పార్టీ పునర్నిర్మాణం జరగడం దాంతోనే సాధ్యమయ్యింది,” అని లాల్జీ గట్టిగానే చెప్పారు.
అప్పట్లో నాయకత్వం, కార్యకర్తల మధ్య ఉన్న బంధాన్ని వివరించేందుకు లాల్జీ ఒక ఆసక్తికర ఘటనను పంచుకున్నారు. “KHAM సిద్ధాంతం వాస్తవానికి కాంగ్రెస్ రూపొందించినదే. కాని క్రిడిట్ మాత్రం మాధవ్‌సింగ్ సొలంకి దక్కింది. దాని మూలకర్తలు జినాభాయ్ దర్జీ, సనత్ మెహతా. వీరిద్దరూ సురేంద్రనగర్ జిల్లా సమావేశంలో తమ ఆలోచనను ప్రతిపాదించారు. అయినా మాధవ్‌భాయ్‌కి క్రెడిట్ వెళ్లినందుకు వారు అసహనం వ్యక్తం చేయలేదు. పైగా మాధవ్‌సింగ్ సొలంకి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాతే వాళ్లు పార్టీకి దూరమయ్యారు,” అని లాల్జీ గుర్తుచేశారు.
గుజరాత్‌లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడం గురించి రాహుల్ సూచించిన మార్గంపై కూడా లాల్జీ పూర్తిగా ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ మధ్యనే అహ్మదాబాద్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ కాంగ్రెస్‌లో కొందరు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై లాల్జీ స్పందించారు. రాహుల్ ఇలా బహిరంగంగా మాట్లాడటం ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. లాల్జీతో కలిసి పనిచేసిన మరో సీనియర్ నాయకుడు యోగేంద్ర మక్వానా. కాంగ్రెస్‌లోని లోపాలను ఈయన కూడా ఎత్తి చూపారు.
ఇందిరాగాంధీతో నేరుగా మాట్లాడా..
“1967లో నేను పార్టీ కార్యకర్తను. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇందిరా గాంధీతో నేరుగా మాట్లాడాను. గుజరాత్ ఎన్నికలలో పార్టీ టికెట్లను ఉన్నత వర్గాల నాయకులకే కేటాయించడం వల్ల కులపక్షపాతం కాంగ్రెస్‌లోకి ప్రవేశిస్తోందని ఆమె దృష్టికి తీసుకెళ్లాను. అప్పట్లో ఆమె నన్ను కూర్చోబెట్టింది. నీళ్లు, టీ ఇచ్చింది. నేనేమీ చెప్పాలనుకుంటున్నానో పూర్తిగా చెప్పమంది. ఆ తర్వాత నన్నే రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు.”
“ఈ రోజుల్లో అప్పటిలాగే పార్టీ నాయకత్వానికి నిజాయతీగా మాట్లాడతే.. పార్టీ నుంచే తొలగించే ప్రమాదం ఉంది. 2008లో గుజరాత్ కాంగ్రెస్ పనితీరుపై బహిరంగ విమర్శలు చేసినందుకు అప్పట్లో కేంద్ర నాయకత్వం నన్ను గట్టిగా మందలించింది,” అని గుర్తుచేసుకున్నారు.
ప్రతిభ గల వారిని గుర్తించాలి..
రాజకీయాల నుంచి దూరంగా ఉన్న 86 ఏళ్ల రమణీక్‌బెన్ పండ్యా భావ్‌నగర్‌కు మూడుసార్లు మేయర్‌గా పనిచేశారు. ఈ నలుగురు స్థానిక నేతల్లో ఈమే ఏకైక మహిళ. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రతిభ గల నాయకులను తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమైందని, అలాంటి వాళ్లను నియోజకవర్గ స్థాయికే పరిమితం చేయడం పెద్ద లోపమని చెప్పుకొచ్చారు.
“జిగ్నేశ్ మేవాణీ లాంటి దళిత నాయకులు ఉన్నారు. అర్జున్ రాథ్వా, అనంత్ పటేల్ వంటి గిరిజన నాయకులు ఉన్నారు. కానీ పార్టీ వాళ్లను వినియోగించలేదు. ప్రతిభ ఆధారంగా వారికి నాయకత్వం బాధ్యతలు అప్పగించాలి. కానీ ఈ విషయంలో నాయకత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. పార్టీ పూర్తిగా పతనమైపోయినపుడు పునర్నిర్మాణానికి చర్యలు మొదలుపెడుతున్నారు. మార్పు అనేది ముందు నాయకుల్లో రావాలి. కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలవాలి,” అని రమణీక్‌బెన్ తెలిపారు.
ఈ నలుగురు పార్టీ నేతల మాటలు రాహుల్ గాంధీ చెవికెక్కాయా? వాటిని అమల్లో పెడతాడా? అన్నది వేచిచూడాలి.