‘ఇండిగో విమానాల రద్దుపై రాజ్యసభలో దుమారం’
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన కేంద్రం..
గత రెండు రోజుల్లో విమానయాన సంస్థ ‘ఇండిగో’ (IndiGo) 500 విమానాలను రద్దు చేయడం రాజ్యసభ(Rajya Sabha)లో ఆందోళనకు దారితీసింది. ఎయిర్‌లైన్ గుత్తాధిపత్యం పార్లమెంటు సభ్యులు, సాధారణ పౌరులపై తీవ్ర ప్రభావం చూపిందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ పేర్కొన్నారు.
జీరో అవర్‌లో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. చాలా మంది సభ్యులు శుక్రవారం ఇంటికి చేరుకుని సోమవారం తిరిగి పార్లమెంట్‌కు రావడానికి విమానాలు బుక్ చేసుకున్నారని ఆయన వివరించారు.
"ఒక విమానయాన సంస్థ గుత్తాధిపత్యం వల్లే ఈ సమస్య తలెత్తింది. ఈ సమస్య తలెత్తడానికి కారణమైన మంత్రి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటుందా?" అని కాంగ్రెస్ ఎంపీ అడిగారు.
ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తోందని సభకు హామీ ఇచ్చారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.
"సభకు వచ్చే ముందు, నేను పౌర విమానయాన మంత్రితో మాట్లాడాను. విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సభ్యులు సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతారు. మీరు ప్రతిస్పందనతో సిద్ధంగా ఉండాలని పౌర విమానయాన మంత్రికి చెప్పాను" అని రిజిజు పేర్కొన్నారు. పరిస్థితి గురించి సభకు, పౌరులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు రిజిజు.
ఇంతకు ఏం జరిగింది?
నిర్వహణ లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు (IndiGo Crisis) తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా ఈ విచారణలో భాగంగా అధికారులు సిఫార్సులు చేయనున్నారు.