రాహుల్ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షల నజరానా ప్రకటించిందెవరు?

మహారాష్ట్రలో శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వెంటనే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంతకు రాహుల్ ఏమన్నారు?

Update: 2024-09-16 11:03 GMT
శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్

మహారాష్ట్రలో శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు బహుమతి ఇస్తామని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించారు.

“విదేశాలలో ఉన్నప్పుడు రాహుల్ భారతదేశంలో రిజర్వేషన్ విధానానికి స్వస్తి పలకాలనుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఒకవైపు మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే.. వాటిని రద్దు చేస్తామనడం ఏమిటి? రాహుల్ రాజ్యాంగాన్ని చూపించి, బీజేపీ దాన్ని మార్చాలని చూస్తోందని బూటకపు ప్రచారం చేశారు. కాంగ్రెస్ దేశాన్ని 400 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లుంది' అని గైక్వాడ్ విలేఖరుల సమావేశంలో అన్నారు.

‘వ్యాఖ్యలను సమర్ధించను..ఆమోదించను.’

గైక్వాడ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే పేర్కొన్నారు. "గైక్వాడ్ వ్యాఖ్యలను నేను సమర్ధించను లేదా ఆమోదించను. అయితే జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లను ఎలా వ్యతిరేకించారో మనకు తెలుసు. రిజర్వేషన్లు ఇవ్వడం అంటే మూర్ఖులకు మద్దతు ఇవ్వడం అని రాజీవ్ గాంధీ అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రిజర్వేషన్లను అంతం చేస్తానని అంటున్నారు. నెహ్రూ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అవగాహన కల్పిస్తాం. రాహుల్ వ్యాఖ్యలపై మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే కూడా ఆలోచించాలి’’ అని బవాన్‌కులే అన్నారు.

గైక్వాడ్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌..

మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే గైక్వాడ్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. "సంజయ్ గైక్వాడ్‌కు సమాజంలో జీవించే హక్కు లేదు. రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గైక్వాడ్‌పై చర్య తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు. గైక్వాడ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆయన లాంటి వ్యక్తుల వల్లే రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్ఠుపట్టాయని మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాయ్ జగ్తాప్ మండిపడ్డారు.

వివాదాలకు కొత్త కాదు..

విదర్భ ప్రాంతంలోని బుల్దానా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గత నెలలో శివసేన ఎమ్మెల్యే కారును ఓ పోలీసు కడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాహనం లోపల వాంతులు చేసుకోవడంతో పోలీసులు స్వచ్ఛందంగా దానిని శుభ్రం చేశారని గైక్వాడ్ వివరణ ఇచ్చుకున్నారు. మరో సందర్భంలో తాను 1987లో పులిని వేటాడానని, దాని పంటిని మెడలో వేసుకున్నానని గైక్వాడ్ చెప్పడంతో వెంటనే అటవీ శాఖ పులి దంతాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‪కు పంపి, ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గైక్వాడ్‌పై అభియోగాలు మోపింది.

Tags:    

Similar News