62 మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు

వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్

Byline :  The Federal
Update: 2023-12-12 03:39 GMT
వైఎస్సార్‌సీపీ మీటింగ్‌ (పాత చిత్రం)

వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఏకంగా 62 చోట్ల ఇంఛార్జీలను మార్చనున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పగ్గాలు ఇవ్వనున్నారు. విజయావకాశాల్ని బట్టి మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ విడతల వారీగా మిగిలిన వాటిని ప్రకటించనుంది.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు జగన్. ఇందులో భాగంగా నియోజకవర్గాల ఇంఛార్జిలను మార్పులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మార్పులు భారీగా ఉంటాయని ముందు నుంచి చెబుతున్న జగన్ దానికి అనుగుణంగా ఇంఛార్జిల మార్పులు మొదలు పెట్టారు. అయితే ఈ మార్పుల ప్రకటన విడతల వారీగా ఉండనుంది.
ఇది తొలి విడత...
మొదటి విడతలో 11 మందిని మార్చారు. ఇందులో నాలుగు చోట్ల స్థాన చలనం చేశారు. వీరిలో ముగ్గురు మంత్రులు విడుదల రజిని, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్‌తో పాటు మాజీ మంత్రి సుచరిత ఉన్నారు. ఇక ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్కే, నాగిరెడ్డి, సుధాకర్ బాబులకు టోటల్‌గా టికెట్ లేదని తేల్చి చెప్పేశారు జగన్. ఇక పార్టీ సీనియర్ నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ లేదని స్పష్టం చేశారు జగన్.
విడతల వారీగా మార్పులు...
మొత్తం 62 నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండనున్నట్టు తెలుస్తుంది. వీటిలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం ఉండనున్నట్టు పార్టీ కీలక నేతల నుంచి సమాచారం అందుతుంది. మరో 30 మందికి పైగా సిట్టింగ్‌లకు పూర్తిగా టికెట్ ఉండదనేది పార్టీలో జరుగుతున్న చర్చ.
ఎమ్మేల్యేలకు ఎంపీలుగా చాన్స్‌...
ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరికి ఎంపీ టికెట్లు ఇచ్చి.. ఎంపీలుగా ఉన్న కొందరికి ఎమ్మెల్యే టికెట్ల ఇవ్వనున్నారు. అయితే మొదటి విడతలో ఉమ్మడి ఒంగోలు, గుంటూరు జిల్లాల నుంచి 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత మిగిలిన చోట్ల విడతల వారీ ప్రకటనలు ఉంటాయని సమాచారం. మొత్తానికి పార్టీలో భారీగా ఇంఛార్జిల మార్పులు చేస్తున్నారు జగన్. అయితే ఈ మార్పులతో పార్టీలో అసంతృప్తులు వ్యక్తమయ్యే పరిస్థితి ఉన్నా... వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్తాం అంటున్నారు పార్టీ సీనియర్‌ నేతలు


Tags:    

Similar News