విదేశాంగ శాఖలో తెలుగు అధికారికి సెక్రటరీ ర్యాంకు..
నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి రమేష్ చంద్రకు విదేశాంగ శాఖలో సెక్రటరీ స్థాయికి ప్రమోషన్ దక్కింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) డాక్టర్ అకెళ్ల వెంకట సాయి రమేష్ చంద్రకు చోటు దక్కింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ కమిటీ (ACC) ఆయనకు సెక్రటరీ హోదా కల్పించింది. 1989 బ్యాచ్‌కు చెందిన రమేష్ చంద్ర గతంలో రొమెనీయా, అల్బేనియా, మాల్దోవా దేశాలకు భారత రాయబారిగా పనిచేశారు. అంతకుముందు ఉగాండా, వాండా దేశాల భారత హై కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఈస్ట్ ఆఫ్రికాలోని బురుండికి కూడా ఇండియన్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కొంతకాలం మాస్కోలో పొలిటికల్ వింగ్‌కు హెడ్‌గా వ్యవహరించారు. పాకిస్థాన్, ఆఫ్‌ఘనిస్థాన్, న్యూయార్స్ ఇండియన్ ఎంబసీస్‌లో సీనియర్ డిప్లొమేట్‌గా కూడా సేవలందించారు రమేష్ చంద్ర.
డిప్లొమాటిక్ కెరీర్..
డాక్టర్ చంద్ర డిప్లొమాటిక్ కెరీర్ మాస్కోలో 1990లో ప్రారంభమైంది. రష్యన్ భాషలో అనర్గళంగా మాట్లాడతారు. 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడిచేసినపుడు అమెరికా ఫైనాన్స్ కమిటీకి భారత ప్రతినిధిగా పనిచేసే అవకాశం వచ్చింది.
బాల్యం, విద్యాభ్యాసం..
డాక్టర్ అకెళ్ల వెంకట సాయి రమేష్ చంద్ర 1964 నవంబర్ 23వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు అకెళ్ల క్రిష్ణ సోమయాజులు, కమలాదేవి. సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ చర్చ్ హై స్కూల్‌లో చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో అనేక వ్యాసరచన పోటీలు, డిబేట్లలో పాల్గొని పలువురి ప్రశంసలందుకున్నారు. ఎన్నో బహుమతులు అందుకున్నారు. 8వ తరగతిలో ఉండగా తండ్రి మృతిచెందడంతో తన అన్న, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎపీ శివకుమార్ వద్ద పెరిగారు. రమేష్ చంద్ర తమ్ముడు ఎ. సురేష్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్డుమెంట్‌లో అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గోల్డ్ మెడలిస్ట్..
ఉమ్మడి ఏపీలోని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (ప్రసుత్తం వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణ)లో చదువుకునే రోజుల్లో డాక్టర్ రమేష్ చంద్ర గోల్డ్ మెడలిస్ట్. క్రీడాల్లోనూ ప్రతిభ చాటారు. బాస్కెట్ బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అలాగే ఢిల్లీలో 1985-86 మధ్య జరిగిన నేషనల్ హార్స్ రైడింగ్ పోటీకి ఏపీ తరపున సారథ్యం వహించారు. ఉత్తమ సేవలందించినందుకుగాను జూలై 1988లో గురుపౌర్ణమి రోజున భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. డాక్టర్ రమేష్ చంద్ర భార్య పేరు కాశ్చాయని. కూతురు కామేశ్వరీ చంద్ర బెంగళూరులోని సెంటర్ ఫర్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (CDPI) లో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పదోన్నతి పొందిన రమేష్ చంద్రకు ఆయన సహచరులు, మిత్రులు, బంధువుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.