త్వరలో కర్ణాటకలో SIR ..

ఒక ఓటరు రెండు వేర్వేరు చోట్ల కనిపిస్తే.. కొత్త ఫోటో-స్కానింగ్ వ్యవస్థ గుర్తిస్తుంది. నకిలీ దరఖాస్తుదారులపై చర్యలు తీసుకుంటాం’’ - కర్ణాటక సీఈవో అన్బుకుమార్;

Update: 2025-09-17 14:30 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR) పూర్తయిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం కేరళలో ఈ విధానాన్ని అమల్లో పెట్టిన EC..ఇప్పుడు కర్ణాటక(Karnataka)లోనూ సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (CEO) V అన్బుకుమార్ బెంగళూరులో విలేఖరులకు చెప్పారు. SIR రోడ్ మ్యాప్‌ను ఆయన వివరించారు.


23 ఏళ్ల తర్వాత కర్ణాటకలో..

‘‘కర్ణాటకలో చివరిసారిగా SIR 2002లో నిర్వహించారు. మళ్లీ 23 సంవత్సరాల తర్వాత చేపడుతున్నారు. బూత్-లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. BLOలు ప్రతి ఇంటికి రెండు ఫారాలు ఇస్తారు. అందులో వారు ఒకదానిపై సంతకం చేసి ఓటరుకు రసీదుగా తిరిగి ఇస్తారు. ఇంట్లో ఎవరూ లేకపోతే పొరుగువారి సహాయంతో ఓటర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. ఓటరు IDలోని ఫోటో అస్పష్టంగా ఉంటే కొత్త ఫోటోను ఓటరు సమర్పించాలి. ఓటర్లంతా తప్పనిసరిగా మేం ఇచ్చే పత్రాన్ని పూరించాల్సి ఉంటుంది. ఒకసారి పూరించి BLOలకు ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో అందులో సవరణలు చేయడానికి వీలుండదు. ఇంట్లో అందుబాటులో లేని ఓటర్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఒక ఓటరు పేరు రెండు వేర్వేరు చోట్ల కనిపిస్తే.. కొత్త ఫోటో-స్కానింగ్ వ్యవస్థ దాన్ని గుర్తిస్తుంది. నకిలీ దరఖాస్తుదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని అన్బుకుమార్ హెచ్చరించారు.

‘‘SIR ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటరు పేరు జాబితాలో లేకుంటే.. BLO సంతకం చేసిన ఫారమ్‌ను చూయించి సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు. SIR ఆపరేషన్ కోసం దాదాపు 18,000 మంది BLOలను నియమిస్తున్నాం. SIR ప్రారంభతేదీని ఇంకా ప్రకటించలేదు. త్వరలో చెబుతాం. ఈప్రక్రియపై కర్ణాటకలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం జరిగింది.’’ అని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్‌లో ఈసీ ఇప్పటికే ప్రత్యేక సవరణను ప్రారంభించింది. 38 జిల్లాల్లోనూ ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిచారు. లక్షల సంఖ్యలో నకిలీ ఓటర్ల పేర్లను తొలగించారు. తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 30న ప్రచురితమవుతుంది. 

Tags:    

Similar News