తొడగొట్టి చెప్పుకోదగ్గ తెలుగోడి వరి కథ ఇది!

అరె వో 'సాంబా'! వరి పంట పండింది! మన సాంబమసూరి, కాటన్ దొర సన్నాల నుంచి కమల, పూసా రకాల సృష్టి..;

By :  A.Amaraiah
Update: 2025-08-05 11:56 GMT
దేశం తీవ్రమైన ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్న 1970–80 దశకాల్లో ఆంధ్రప్రదేశ్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాలు- ఇవాళ రెండో హరిత విప్లవానికి నాంది పలకనున్నాయి. రాష్ట్రంలోని బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి పరిచిన సాంబా మసూరీ, కాటన్ దొర సన్నాలు- అత్యధిక దిగుబడి ఇవ్వనున్న రెండు వరి వంగడాలకు (DRR ధన్ 100 (కమల), DST 1 పూసా) జన్మనిచ్చాయి. ఈ రెండింటిని తొలి స్వదేశీ జీనోమ్ ఎడిటెడ్ వంగడాలుగా పిలుస్తున్నారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పార్లమెంటులో చెప్పిన ప్రకారం- పబ్లిక్ సెక్టార్‌లో అభివృద్ధి చేసిన BPT 5204, MTU 1010 అనే పేరెంట్ వరి వంగడాల ఆధారంగా స్వదేశీ పరిశోధనలతో కొత్త వాటిని రూపొందించారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జీనోమ్ ఎడిటెడ్ వరి వంగడాలు ఇవి.
ప్రపంచంలోనే తొలిసారి ఆవిష్కరించిన ఈ రెండు అధిక దిగుబడి- జీనోమ్ ఎడిటెడ్ - వరి వంగడాలు పూర్తిగా స్వదేశీ ప్రయత్నాల ఫలితంగా రూపొందాయి. ఈ విత్తనాలను రైతులకు ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల ద్వారా అందిస్తారు.
DRR ధన్ 100 (కమల), DST 1 పూసా వంగడాలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR), ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IARI) అభివృద్ధి చేశాయి. ఇవి వచ్చే 4–5 ఏళ్లలో వాణిజ్యపరమైన సాగుకు సిద్ధం కానున్నాయని హైదరాబాద్ లోని ICAR, IIRR డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎం. సుందరం చెప్పారు. “వాటి విత్తనాలను ఆయా అభివృద్ధి సంస్థలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్, భారతీయ బీజ సహకారి సమితి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తాయి” అన్నారు.
“ఈ వరి వంగడాల అభివృద్ధికి ఉపయోగించిన సాంకేతికత పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానమే. ఇవి ధాన్యం దిగుబడిని 25–30% వరకు పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయి" అని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ టి. హరికృష్ణ 'ది ఫెడరల్' ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు.

“ఇవి ప్రపంచంలోనే తొలి జీనోమ్ ఎడిటెడ్ వరి వంగడాలుగా నిలుస్తాయి. లక్షలాది హెక్టార్లలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించే లక్ష్యాన్ని సాధించడంలో ఇవి తోడ్పడతాయి. ఈ వంగడాలు రెండో హరిత విప్లవానికి తోడ్పడతాయి” అని హైదరాబాద్ లోని ICAR, IIRR శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
2020 నుండి ఇప్పటివరకు, వ్యవసాయ మంత్రిత్వశాఖ వివిధ ప్రాజెక్టుల కింద జీనోమ్ ఎడిటింగ్ పరిశోధనకు ₹486 కోట్లు కేటాయించింది. 2022లో, ప్రభుత్వం కొన్ని రకాల జీనోమ్ ఎడిటెడ్ పంటలను జన్యుమార్పిడి పంటలకు వర్తించే కఠినమైన బయోసేఫ్టీ నియంత్రణల నుంచి మినహాయించింది. దీని ఉద్దేశ్యం ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం, దేశంలో పంటల జన్యు మెరుగుదలను వేగవంతం చేయడం.
ఈ కొత్త వంగడాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 90 లక్షల హెక్టార్లలో సాగు చేసే “సాంబా మసూరీ”, “కాటన్ దొర సన్నాలు” వంగడాలను భర్తీ చేయనున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాలకు ఈ వంగడాలను సిఫారసు చేశారు.
DRR ధన్ 100 (కమల) ప్రత్యేకత ఏమిటంటే..
ఈ రకం సగటు దిగుబడి హెక్టారుకు 5.37 టన్నులు (సాంబా మసూరీ కంటే సుమారు 19% అధికం). అనుకూల పరిస్థితుల్లో హెక్టారుకు 9 టన్నుల వరకు కూడా సాధ్యమవుతుంది. సాధారణ రకాల కంటే 15–20 రోజుల ముందే పండుతుంది (సుమారు 130 రోజులు). ఖరీఫ్, రబీ సీజన్లలో కూడా ఈ వంగడాన్ని సాగు చేయవచ్చు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు కూడా ఇది అనుకూలం. ఏడాదికి సుమారు 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్లు వరకు నీటిని పొదుపు చేయవచ్చు.
పూసా రైస్ DST-1 ప్రత్యేకత...
మాతృ వంగడమైన MTU 1010 తో పోలిస్తే పూసా రైస్ DST 1 రకం 30.4% అధిక దిగుబడిని ఇస్తుంది. చౌడు భూములు, తీరప్రాంత భూముల్లోనూ (saline & alkaline soils) సాగుచేయవచ్చు. నీటి ఎద్డడిని తట్టుకోగలదు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
దేశానికి అన్నపూర్ణ – ఆంధ్రప్రదేశ్‌ వరి పరిశోధన....
బాపట్ల–మార్టేరు వంగడాలు భారత తొలి జీనోమ్ ఎడిటెడ్ వరి వంగడాలకు పునాది కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 1970–80 దశకాల్లో దేశం తీవ్రమైన ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాలు కోట్లాది రైతుల జీవితాలను మార్చాయి. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన BPT 5204 (సాంబా మసూరీ), MTU 1010 రకాలు దేశవ్యాప్తంగా 46 మిలియన్ల హెక్టార్లలో సాగవుతున్నాయి.
బాపట్ల వ్యవసాయ కళాశాల (ANGRAU) తొలి తరం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.వి.ఆర్. కృష్ణమూర్తి, డాక్టర్ మాలకొండారెడ్డి, ఆయన బృందం అహోరాత్రులు కష్టపడి BPT 5204 – ‘సాంబా మసూరీ’ని రూపొందించాయని అదే కళాశాలలో వ్యవసాయ శాస్త్రం చదివి శాస్త్రవేత్తగా ఎదిగిన డాక్టర్ హరికృష్ణ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 145–150 రోజుల్లో పంట చేతికి వచ్చే ఈ వంగడం ఆంధ్రప్రదేశ్ ను అన్నదాతను చేసిందని అన్నారు.
MTU 1010 – (కాటన్ దొర సన్నాలు) రకాన్ని 1988లో మార్టేరు రైస్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు రూపొందించారని, ఈ పరిశోధనకు శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. రామప్రసాద్, డాక్టర్ కె. వెంకట రామయ్య నాయకత్వం వహించినట్టు ఏపీ అగ్రీమిషన్ మాజీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. ఐదారు నెలల పంట కాలాన్ని ఈ వంగడం 120–125 రోజులకు తగ్గించిందన్నారు. ఆనాడు ఇదో సంచలనంగా అభివర్ణించారు.
భారతీయ తొలి స్వదేశీ జీనోమ్ ఎడిటెడ్ వరి వంగడాలకు ఆంధ్రప్రదేశ్‌ వంగడాలు పునాది కావడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ వలేటి గోపిచంద్ అన్నారు. BPT 5204, MTU 1010 వంగడాలు లేకపోతే DRR ధన్ 100, DST 1 వంటి ఆధునిక జీనోమ్ ఎడిటెడ్ రకాల రూపకల్పన సాధ్యమయ్యేది కాదని, ఇది ఆంధ్రప్రదేశ్‌ శాస్త్రవేత్తల ప్రతిభకు గర్వకారణం అని గోపీచంద్ కొనియాడారు.
“BPT 5204, MTU 1010 రకాలు ఒక కాలంలో దేశ ఆహార భద్రతను కాపాడగా, భవిష్యత్తు పంటల మెరుగుదలకు మార్గదర్శకాలు అయ్యాయి. ఈ కృషి తరతరాలకు స్ఫూర్తి ” అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రెండు వంగడాలు దేశానికి అన్నపూర్ణగా నిలిచాయి. గతంలో రైతుల ఆదాయాన్ని పెంచి, ఆహార భద్రతను బలోపేతం చేశాయి. ఇప్పుడు ఇవే భారత తొలి స్వదేశీ జీనోమ్ ఎడిటెడ్ వరి రకాల పునాది కావడం రాష్ట్రానికి మరింత గర్వకారణం. ఈ విజయాలు శాస్త్రీయ ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాకుండా, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాస్త్రవేత్తల కీర్తిని చాటుతున్నాయి.
Tags:    

Similar News