JOLT TO JAGAN|జగన్ కి మరో దెబ్బ, విపక్ష నేత లేకుండానే లోకాయుక్త

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS JAGAN) కి మరో ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే లోకాయుక్త ఏర్పాటు కానుంది.

Update: 2024-11-23 03:14 GMT
YS JAGAN
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS JAGAN) కి మరో ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ప్రకటించిన వైఎస్ జగన్ కు అటువంటి హోదా కల్పించే ప్రసక్తే లేదని అధికార పక్షమైన టీడీపీ తేల్చిచెప్పింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (NARA LOKESH) చేసిన ప్రకటన ఆ అర్థం వచ్చేలా స్పష్టత ఇచ్చింది. లోకాయుక్తలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చట్టాన్ని సవరించబోతున్నట్టు మంత్రి లోకేశ్ ప్రకటించడంతో జగన్ ని ప్రతిపక్ష నాయకునిగా గుర్తించడం లేదని తేలిపోయింది.
లోకాయుక్త (LOKAYUKTA) నిర్వహణలో విధిగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించబోతున్నట్టు లోకేశ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
అదానీ గ్రూపుల నుంచి జగన్ మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ కి ఇది నిజంగా పెద్ద దెబ్బలేనని పరిశీలకులు భావిస్తున్నారు. తమ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేడని నారా లోకేశ్ ప్రకటించారు. అమెరికాలో గౌతమ్‌ అదానీపై క్రిమినల కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటికే వైసిపి అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి కూడా అదానీ గ్రూపుల నుంచి ముడుపులు ముట్టాయంటూ నవంబర్ 22న అసెంబ్లీలో చర్చించారు. సరిగ్గా ఈ దశలోనే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేరని అధికార తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 'టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం లోకాయుక్త స్ఫూర్తిని కొనసాగిస్తుందని, ప్రస్తుతం శాసనసభలో ఎలాంటి లోపాలు లేకపోయినప్పటికీ.. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో జగన్ ఒక్క అసెంబ్లీ సమావేశానికి కూడా హాజరు కాలేదు' అన్నారు నారా లోకేశ్.
“ప్రస్తుతం లోకాయుక్త నిర్వహణలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఐదుగురు సభ్యులలో ఒకరు ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలన్నది నిబంధన. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షం సభకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త నిర్వహణ పూర్తిగా అధికార పక్ష సభ్యులతోనే ఉండిపోనుంది. ప్రతిపక్ష నాయకుడు లేకుండా మిగిలిన నలుగురు సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంటూ చట్ట సవరణ తెచ్చారు. ఈ మేరకు చట్ట సవరణను ఆమోదించారు.
శాసనమండలిలో లోకాయుక్త చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్త వాతావరణం ఏర్పడిందన్నారు. “ఇంతకుముందు లోకాయుక్త ఛైర్మన్ గా ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, హోం మంత్రి లేదా ఇతర క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, శాసన మండలి చైర్మన్ సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో లోకాయుక్త కమిటీలో నలుగురు మాత్రమే సభ్యులుగా ఉంటారు. చైర్మన్ నియామకానికి సంబంధించి ప్రస్తుత సవరణను ప్రవేశపెడుతున్నామని లోకాయుక్త సభ్యుల ఎంపిక కమిటీ కూర్పుపై బిల్లును ప్రవేశపెడుతూ తెలిపారు.
సాధారణంగా లోకాయుక్తకు రిటైర్డ్ జిల్లా జడ్జి నేతృత్వం వహిస్తుండగా, హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి లోకాయుక్తకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. లోకాయుక్త ప్రొసీడింగ్స్‌ను లోపాలు లేకుండా నిర్వహించడానికి తీసుకొచ్చారు.
ప్రజాస్వామ్యంలో శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ భాగస్వాములేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయించారన్నారు. ‘‘ఇంతకుముందు ప్రతిపక్షంలో కూర్చున్నాం, ప్రజల తీర్పు తర్వాత ఇప్పుడు అధికారం చేపట్టాం. మాకు పవిత్రమైన బాధ్యత ఉంది. మేము ఖచ్చితంగా లోకాయుక్త స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
జగన్ ఇప్పుడేం చేస్తారో...
2024 ఎన్నికల్లో సుమారు 41 శాతం ఓట్లు సంపాయించి 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఈ వ్యవహారమై ఆయన హైకోర్టులో కేసు కూడా వేశారు. త్వరలో ఆ కేసు విచారణకు రానుంది. ఈలోగా అధికార పక్షమైన టీడీపీ అసలు తమ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటూ ప్రకటన చేసింది. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే లోకాయుక్త ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు చట్ట సవరణ కూడా చేసినందున ఇకపై వైఎస్ జగన్ ను గుర్తించబోమనే అర్థం వచ్చేలా చెప్పకనే చెప్పింది.
Tags:    

Similar News