ఏడుగురు ఆంధ్రా మంత్రుల ఎదురీత
సీఎం జగన్ క్యాబినేట్‌లో మంత్రులుగా టిప్‌టాప్‌గా బుగ్గ కార్లల్లో తిరిగిన మంత్రులకు గడ్డు కాలం నడుస్తోంది. దాదాపు ఆరుగురు మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు.
Byline : The Federal
Update: 2024-05-06 08:58 GMT
అంతా నేను చేసి పెట్టాను.. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చాను.. మీరు వెళ్లి నిల్చోండి.. ఇచ్చిన హామీలను నెరవేర్చామని ప్రజలకు చెప్పండి.. ప్రజల ఆశీర్వదిస్తారు.. దేవుడు చల్లగా దీవిస్తాడు.. తప్పకుండా 2024 ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాము అన్న ధోరణిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే.. మరో పక్క సీఎం జగన్ క్యాబినేట్‌లోని పలువురు మంత్రులే ఈ ఎన్నికల్లో ఎదురీదతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. దాదాపు ఆరుగురు మంత్రులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చర్చ సాగుతోంది.
ఎదురీదుతున్న వారిలో మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రథమ స్థానంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వెఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఈయన బరిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ రంగంలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొట్టు సత్యనారాయణ, 2009లో ఓడి పోయారు. 2019లో మరో సారి గెలిచారు. ఇక్కడ బీజీపే అభ్యర్థిగా 2014లో బరిలోకి దిగిన పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు. 2019లో జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయనకు 36,197 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నానికి 54,275 ఓట్లు వచ్చాయి. సుమారు 16వేల ఓట్ల మెజారిటీతో కొట్టు గెలిచారు. అయితే ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటంతో గతంలో చీలిన ఓట్లు ఈ సారి సాలిడ్‌గా çకూటమికి పడుతాయని, దీంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కొట్టుకు గడ్డు కాలమే అని స్థానికుల్లో చర్చ సాగుతోంది. దీనికి తోడు బొలిశెట్టి శ్రీనివాస్‌కి అన్ని వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారనే విమర్శలు కొట్టు సత్యనారాయణపై ఉన్నాయి.
రాజకీయ బదిలీపై వచ్చిన మేరుగ నాగార్జున
మరో మంత్రి మేరుగ నాగార్జున కూడా ఎదురీదుతున్నారు. సీఎం జగన్ చేపట్టిన రాజకీయ బదిలీల నేపథ్యంలో ఆయనను గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. మేరుగ నాగార్జునది వేమూరు అసెంబ్లీ నియోజక వర్గం. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచారు. 2009, 2014లో పోటీ చేసి ఓడి పోయారు. అక్కడ నుంచి ఆయనను సంతనూనతలపాడుకు జగన్ బరిలీ చేశారు. పూర్తిగా ఇది ఆయనకు కొత్త. స్థానికంగా ఆయనకు పరిచయాలు లేవు. ప్రజలు, నేతలతో సత్సంబంధాలు అంతకన్నా లేవు. టీడీపీ, బీజెపీ, జనసేన కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బిఎన్ విజయ్‌కుమార్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఈయనకు స్థానికుల్లో మంచి మంచి ఆదరణ ఉంది. ప్రజల సమస్యలను పరిష్కారానికి పని చేస్తారనే నమ్మం కూడా తెచ్చుకున్నారు. గత రెండు సార్లు ఓడి పోవయారనే సానుభతి ఓటర్లలో ఉంది. మేరుగ నాగార్జునకు స్థానికత కూడా సమస్య మారింది. బిఎన్ విజయ్ కుమార్ స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే ప్రచారం కూడా ఉంది. ఇది ఆయనకు ప్లస్‌గా మారే చాన్స్ ఉంది. ఇక మేరుగ నాగార్జున ప్రజల్లోకి వెళ్లడంలోను, స్థానిక నేతలు, కార్యకర్తలను కలుపుకొని పోవడంలోను, స్థానిక సమస్యలను అడ్రస్ చేయడంలోను చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
మంత్రిగా సురేష్ కొండపికి చేసిందేమీ లేదు
మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈయన కూడా సీఎం జగన్ చేపట్టిన రాజకీయ బదిలీల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండపికి వెళ్లారు. ఒకే జిల్లా అయినా సురేష్‌కు ఇది కొత్త నియోజక వర్గమే. 2014లో సంతనూతలపాడు నుంచి, 2009, 2019లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు. తాజాగా కొండపి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇది టీడీపీ అడ్డాగా చెప్పొచ్చు. గత రెండు ఎన్నికల్లో డోలా బాలవీరాంజనేయస్వామి గెలిచి మూడో సారి హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీ మీద వ్యతిరేకత ఉన్నా, జగన్ గాలి విపరీతంగా వీచినా 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొండపి నుంచి వీరాంజనేయస్వామి గెలవడం గమనార్హం. అలాంటిది ఆదిమూలపు సురేష్‌ను సీఎం జగన్ తమ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం గమనార్హం. ఈయనకు కూడా స్థానిక సమస్యలపై అవగాహన లేదు. స్థానిక నేతలు, కార్యకర్తల్లో కూడా ఈయనకు పట్టు లేదు. స్థానిక సమస్య కూడా సురేష్ ఎదుర్కొంటున్నారు. కమ్మ సామాజిక వర్గందే ఇక్కడ పెత్తనం. వారంతా టీడీపీలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు లేదు. మంత్రిగా ఇక్కడ సురేష్ చేసింది కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో సురేష్‌కు ఎదురీత తప్పడం లేదు.
రజనినీ వెంటాడుతున్న స్థానికత సమస్య
మరో మంత్రి విడదల రజని కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఈమె కూడా రాజకీయ బదిలీపై వచ్చారు. చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నుంచి నిలబెట్టారు జగన్. రజని మంత్రి అయినప్పటికీ గుంటూరు పశ్చిమ ఆమెకు కొత్త. స్థానిక నేతలు, కార్యకర్తలతో సత్సంబంధాలు లేవు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి గెలిచిన మద్దాల గిరి తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారు. అయితే ఈయనకు సీఎం జగన్ సీటు కేటాయించ లేదు. ఆ అసంతృప్తి నుంచి ఇంకా బయటకు రాలేదు. దీంతో గిరి, ఆయన అనుచరులు విడదల రజనికి సహకరించడం లేదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. స్థానిక సమస్యలను అడ్రస్ చేయడంలోను రజని సమస్యలు ఎదుర్కొంటోంది. స్థానికత కూడా ఆమెకు పెద్ద సమస్యగా మారింది. వీటిని అధికమించి ఓటర్లును చేరుకోవడంలో వెనుక బడ్డారని చర్చ సాగుతోంది. గుంటూరు పశ్చి నుంచి కాంగ్రెస్, టీడీపీలు పోటీ పడుతూ గెలుస్తూ వచ్చాయి. గత రెండు ఎన్నికల్లోను టీడీపీనే గెలిచింది. ఈ సారి వికాస్ ఆసుపత్రి ఎండీ పిడుగురాళ్ల మాధవిని టీడీపీ రంగంలోకి దింపింది. ఈమెకు స్థానికుల్లో మంచి ఆదరణ ఉంది. టీడీపీ శ్రేణులు బలంగా ఉండటంతో ఆమెకు సహకరిస్తున్నారు. ఎంపీ గల్లా జయదేవ్, సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ వర్గాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడదల రజని ఎదురీత ఈదుతున్నారని స్థానికుల్లో చర్చ సాగుతోంది.
ముత్యాల నాయుడుకి కుటుంబంలోనే వ్యతిరేకత
మరో మంత్రి బూడి ముత్యాల నాయుడు కూడా ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. ఈయనను మాడుగుల అసెంబ్లీ నుంచి అనకాపల్లి పార్లమెంట్‌కు సీఎం జగన్ బదిలీ చేశారు. మాడుగుల నుంచి గత రెండు సార్లు ముత్యాలనాయుడు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా గెలిచారు. అనకాలపల్లి పార్లమెంట్‌కు పంపడంతో ఆయనకు సమస్యలు వచ్చి పడ్డాయి. మంత్రి అయిన్పటికీ పార్లమెంట్ నియోజక వర్గంలో అంత పట్టు లేదు. దీనికి తోడు ఆయన కుటుంబం సభ్యులే ఆయనను వ్యతిరేకిస్తున్నారు. కుమారుడే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రెండో భార్య కుమార్తె ఈర్లె అనూరాధకు మాడుగుల సీటు ఇప్పించుకోవడంతో మొదటి భార్య కుమారుడు రవికుమార్ ముత్యాలనాయుడుపై నిరసన గళం విప్పారు. ఇది కాస్తా ముత్యాల నాయుడుకి తలనొప్పిగా మారిందని టాక్ స్థానికుల్లో నడుస్తోంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీకి అడ్డాగా చెబుతారు. టీడీపీ ఏర్పడిన తర్వాత ఐదు పర్యాయాలు ఇక్కడ నుంచి గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన వెంకట సత్యవతిని పక్కన పెట్టి మంత్రి బూడి ముత్యాలనాయుడుని సీఎం జగన్ రంగంలోకి దింపారు. అయితే ఈయనకు స్థానిక నేతలు, కార్యకర్తలు సహకరించడం లేదని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఎన్డీఏ కూటమి నుంచి బీజెపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న సీఎం రమేష్ ప్రచారంలో అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ దూసుకొని పోతోంటే ముత్యాల నాయుడు మాత్రం వెనుక బడ్డారనే టాక్ కూడా స్థానికుల్లో ఉంది.
ఉష శ్రీ చరణ్‌కు సహకరించని సామాజిక వర్గం
మరో మంత్రి ఉష శ్రీ చర్ కూడా గడ్డు పరస్థితులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి గెలిచిన ఆమెను సీఎం జగన్ రాజకీయ బదిలీ చేశారు. కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు. 2024 ఎన్నికల్లో పెనుగొండ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఆమె జిల్లా కూడా మారిపోయింది. స్థానికత పెద్ద సమస్యగా మారింది. పెనుకొండ ఉష శ్రీచర్‌కు కొత్త. ఇక్కడ స్థానిక సమస్యలపై ఆమెకు పట్టు లేదు. ముందుగానే ఆమె స్థానికులు, కార్యకర్తలను, స్థానిక నేతలతో సఖ్యతగా ఉండరనే విమర్శలు ఉన్నాయి. తన సామాజిక వర్గాన్ని కూడా దగ్గరకు రానివ్వరనే చర్చ కూడా స్థానికుల్లో ఉంది. పెనుకొండలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు, కార్యకర్తలు ఆమెకు సరిగా సహకరించడం లేదనే టాక్ నడుస్తోంది. టీడీపీకి మంచి పట్టున్న వాటిల్లో పెనుకొండ ఒకటి. 1983 నుంచి టీడీపీనే అధిక సార్లు గెలిచింది. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి గెలుపొందారు. 2019 మాత్రమే వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. 2024లో టీడీపీ అభ్యర్థిగా సవిత బరిలో ఉన్నారు. ఇక్కడ కురుబ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. అటు ఉష శ్రీచరణ్, ఇటు సవిత ఇదే సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ఉష శ్రీచరణ్‌తో పోల్చితే సవిత వైపే ఆ సామాజిక వర్గం మద్ధతు ఎక్కువుగా ఉందని స్థానికుల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉష శ్రీ చరణ్ గడ్డు కాలం ఎదుర్కొంటున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.