బాబోయ్ ఆంధ్రపదేశ్‌లో బర్డ్‌ఫ్లూ
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి విజృంభించింది. పది రోజుల క్రితం కోళ్లకు వ్యాధి సోకింది. రెండు ఫారాల్లో ఈ వ్యాధికి 10వేల కోళ్లు బలయ్యాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-02-16 00:00 GMT
బర్డ్‌ఫ్లూ భయంకరమైన అంటువ్యాధి. పక్షుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. గాలిద్వారా వ్యాధి వస్తుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దేశంలో 2019లో వచ్చిన కరోనా వ్యాధికి దీనికి పెద్ద తేడా ఉండదని, పశువుల్లో వచ్చే కరోనా వ్యాధిగా భావించాలని పశువైద్యులు చెబుతున్నారు. 2021లో ఈ వ్యాధిపట్ల అందరూ అలర్ట్‌గా ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి కరోనాలో పక్షులు కూడా చాలా వరకు చనిపోయాయని, అయితే ఆ విషయాన్ని పెద్దగా అధికారులు కానీ, సాధారణ ప్రజలు కానీ పట్టించుకోలేదని పశువైద్యాధికారి ఒకరు తెలిపారు.
పది రోజుల క్రితమే బర్డ్‌ఫ్లూ వ్యాప్తి
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తేటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామాల్లో బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది. ఈనెల 5న కోళ్లు వేల సంఖ్యలో చనిపోవడంతో వెంటనే అక్కడి ఫారాల వారు పశువైద్య అధికారులను సంప్రదించారు. పశు సంవర్థక శాఖ నుంచి కొందరు అధికారులు అక్కడికి వెళ్ళి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (విబిఆర్‌ఐ)కు పంపించారు. అక్కడ కొంత అనుమానం వచ్చిన రీసెర్చ్ ల్యాబ్ అధికారులు ఈ రక్త నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ((NIHSAD)) భోపాల్‌కు పంపించారు. వారు చేసిన పరీక్షల్లో బర్డ్‌ఫ్లూగా నిర్థారించి రిపోర్టులు గురువారం రాష్ట్ర రీసెర్చ్ కార్యాలయం విజయవాడకు పంపించారు. వెంటనే ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు, ఇతర సంబంధిత అధికారులకు విజయవాడ లేబరేటరీ వారు పంపించారు.
నేలపట్టు ప్రాంతంలో రాలేదు
సాధారణంగా విదేశీ పక్షుల ద్వారా బర్డ్‌ఫ్లూ వస్తుందని అంటుంటారు. అయితే నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నేలపట్టు ప్రాంతానికి ఫ్లెమింగో పక్షలు వస్తుంటాయి. నైజీరియా నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి గుడ్లుపెట్టి పిల్లలు లేపిన తరువాత పిల్లలతో కలిసి తిరిగి వెళుతుంటాయి. వైల్డ్‌లైఫ్ వారు ఇక్కడి పక్షుల సంరక్షణార్థం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. అయితే నేలపట్టు ప్రాంతంలో వ్యాధి సోకలేదు. వెంటనే ఈ ప్రాంతాన్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
వెంటనే జిల్లా అధికారులు ఈచర్యలు చేపట్టాలి
బర్డ్‌ఫ్లూ వ్యాధి వచ్చిందనే రిపోర్టులు రావడం వల్ల వెంటనే జిల్లా అధికారులు ఈ చర్యలు చేపట్టాల్సి ఉంది. ముందుగా బార్డర్ జిల్లాలైన ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలను అలర్ట్ చేయాలి.
ఒక చదరపు కిలో మీటరు పరిధిలో వెయ్యి కోళ్లు ఉంటే ఆ జిల్లాలను ‘ఎ’ కేటగిరీ జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో అటువంటి జిల్లాలు మూడు ఉన్నాయి. అవి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించాలి.
విదేశీ పక్షులు వచ్చే సరస్సులు ఉన్న జిల్లాలను అలర్ట్ చేయాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో విదేశీ పక్షులు వస్తుంటాయి. వీలైతే అక్కడ ఆ పక్షుల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు చేయించాలి.
సరిహద్దు జిల్లాల నుంచి కోళ్లను నెల్లూరు జిల్లాకు కానీ, నెల్లూరు జిల్లా నుంచి సరిహద్దు జిల్లాలకు కానీ రవాణా జరగకుండా ఆపివేయాలి. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి.
చనిపోయిన కోళ్లను కాల్చి వేయాలి. లేదా పూడ్చివేయాలి. ప్లాస్టిక్ కవర్స్‌లో ప్యాక్‌చేసి పూడ్చి వేయాల్సి ఉంటుంది.
యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి. పది కిలోమీటర్ల పరిధిలో సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలి. వ్యాధి వచ్చిన కోళ్ల ఫారాలకు ఒక కిలోమీటరు దూరంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలి. గాలి ద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కోళ్ల తరలింపుపై బ్యాన్ పెట్టాలి. చికెన్, ఎగ్స్ మార్కెట్లు మూసివేయాలి.
ఎందుకు హై అలర్ట్ ప్రకటించలేదు
నిజానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాలి. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను అలర్ట్ చేయాలి. సిబ్బందికి సెలవులు ఇవ్వరాదు. నిత్యం అందుబాటులో ఉండాలి.
కలెక్టర్ వెంటనే పశు సంవతర్థకశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, హెల్త్ డిపార్ట్‌మెంట్స్‌లో కమిటీలు వేయాలి. కానీ ఇంతవరకు జరగలేదు.