‘గత ప్రభుత్వానిదంతా పరదాల పాలనే’.. మరోసారి జగన్‌ను టార్గెట్ చేసిన చంద్రబాబు

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి టార్గెట్ చేశారు. జగన్ చేసిందంతా పరదాల పాలనే అంటూ ఎద్దేవా చేశారు.

Update: 2024-08-23 14:41 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి టార్గెట్ చేశారు. జగన్ చేసిందంతా పరదాల పాలనే అంటూ ఎద్దేవా చేశారు. ఆయన సభలు పెట్టిన, పర్యటించాలన్నా, పరామర్శించాలన్నా అన్నీ మూసేయాలని, పాఠశాలలకు కూడా మినహాయింపు ఇవ్వలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన ప్రయాణించాలంటే పచ్చదనం కనిపించకూడదని, అందుకే జగన్ వెళ్లే మార్గంలో చెట్లు కూడా నరికి వేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం జగన్ ఎక్కడికైనా రావాలంటే పరదాలు కట్టాలి, ప్రతిపక్షాలను హౌస్ అరెస్ట్‌లు చేయాల్సిందేనంటూ చురకలంటించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన ‘గ్రామసభ’ సందర్భంగా జగన్ టార్గెట్‌గా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పనులు గ్రామాల కోసం చేయాలి..

‘‘పేదలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమిది. ఎన్‌డీఏది సింపుల్ గవర్నెస్.. సింపుల్ గవర్న్‌మెంట్. గ్రామాల అభివృద్ధిని బట్టి పనులు చేపట్టాలి కానీ కాంట్రాక్టర్ల అవసరాలను బట్టి కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకం కింద రూ.4,500 కోట్లు మంజూరు చేశాం. 87 పనుల ద్వారా 54 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజంతో గెలిచారు. జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలి. జగన్‌కు రంగుల పిచ్చి. జాతీయ జెండాను కూడా తన రంగుల పిచ్చితో అవమానించారు’’ అని అన్నారు చంద్రబాబు.

గ్రామాలకు ఐదేళ్లే టైమ్

గ్రామాలకు మహర్దశ పట్టడానికి ఐదేళ్లే సమయం ఉందని అన్నారు. ‘‘ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో గ్రామాలకు రూ.2,100 కోట్లు అందిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేరా సిమెంటు రోడ్లు వేస్తాం. 10 వేల కిలోమీటర్ల సిమెంట్ డ్రైనేజీలు నిర్మిస్తాం. 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేస్తాం. పశువులకు ప్రత్యేక షెడ్లు నిర్మిస్తాం. వీటన్నింటికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. అతి త్వరలోనే వీటన్నింటిని ప్రారంభిస్తాం. చెత్త నుంచి కూడా సంపద సృష్టిస్తాం. కూలీల రేట్లు పెంచుతాం. గ్రామాణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో కుటుంబానికి రెండు సెంట్ల భూమి ఇస్తాం. ప్రతి లబ్ధిదారునికి ఇల్లు కూడా కట్టిస్తాం. త్వరలోనే మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు కూడా అందిస్తాం’’ అని వెల్లడించారు.

అవినీతి లేని అభివృద్ధే లక్ష్యం: నాదెండ్ల

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘మూడు నెలల్లో నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఉపాధి హామీ పథకాన్ని తిరిగి గాడిన పెడతాం. నిజాయితీగా పనిచెయ్యని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతాం. రైతులు ఎవరై అధైర్యపడాల్సిన అవసరం లేదు. యూరియా కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా, రాకుండా చూసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News