దావోస్ టూరుపై తకరారెందుకన్న చంద్రబాబు

రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది ముఖ్యం కాదు, అదో అనుభవాల మేళా. సరికొత్త ఆలోచనలకు వేదిక. అటువంటి దానిపై విమర్శలు చేయడం తగదు అంటున్నారు చంద్రబాబు;

Update: 2025-01-25 10:41 GMT
'దావోస్ పోవడం కొత్తేమీ కాదు.. దావోస్ కి వెళ్లాలని చెప్పిందే నేను. వెళ్లింది కూడా నేనే. నా తర్వాతనే దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రలు వెళుతున్నారు. అదో గొప్ప అనుభవం. దాన్ని విమర్శించడం ఎందుకు?' అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశంలో మొదటిసారి దావోస్‌ వెళ్లాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు. 1997 నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్‌ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచపటంలో పెట్టడమే లక్ష్యమన్నారు.
ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే.. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో జనవరి 25న మీడియాతో మాట్లాడారు.
దావోస్‌లో జరిగిన ఒప్పందాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్‌ కంపెనీలు, వివిధ దేశాల ప్రతినిధుల సమావేశానికి దావోస్‌ వేదిక. మూడు రోజుల్లో అందరినీ ఒకే చోట కలిసే అవకాశముంటుంది. ప్రపంచంలో వచ్చే ఆధునిక ఆలోచనలు, ట్రెండ్స్‌ తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మొత్తంగా నెట్‌ వర్కింగ్‌ చేసుకోవచ్చు. దావోస్‌ సదస్సుల్లో ఈసారి గ్రీన్‌ ఎనర్జీ- గ్రీన్‌ హైడ్రోజన్‌, ఏఐ కీలక అంశాలుగా మారాయి’’ అని చంద్రబాబు అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘‘మనం జాబ్‌ అడగడం కాదు.. ఇచ్చే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఐటీ అంటే హైటెక్‌ సిటీ అంటున్నారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాను. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మనం ఎక్కడున్నా జన్మభూమి, కర్మభూమికి సేవ చేయాలి. తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎంఎస్‌ఎంఈలు సృష్టిస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ప్రపంచంలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోంది. 2028 నుంచి జీడీపీ వృద్ధి రేటులో చైనాను అధిగమిస్తాం. యువ భారత్‌ మనకున్న అద్భుత అవకాశం. జీడీపీ వృద్ధి రేటులో మన దేశం సుదీర్ఘ కాలం అగ్రస్థానంలో ఉండబోతోంది. రామాయపట్నంలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను బీపీసీఎల్‌ ఏర్పాటు చేయబోతోంది. ఆ సంస్థ రూ.95వేలకోట్ల పెట్టుబడులు పెడుతోంది. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌ రాబోతోంది. రూ.1.87లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయబోతోంది. గ్రీన్‌ అమ్మోనియా కూడా కాకినాడ నుంచి ఎగుమతి చేయనున్నాం.
గేమ్ చేంజర్ కానున్న విశాఖ గూగుల్‌
రాష్ట్రంలో 10 పోర్టులు ఉన్నాయి. వాటిని సమక్రంగా వినియోగించుకోలేకపోతున్నాం. మన వనరులు, ఉత్పత్తి ఇతర ప్రాంతాలకు సరిగా ఎగుమతి చేయలేకపోతున్నాం. కొన్ని చిన్నచిన్న దేశాలు కూడా పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ఫోరం గ్రీన్‌ ఎనర్జీని ప్రమోట్‌ చేస్తోంది. అమరావతితో పాటు రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీకి ఉన్న అవకాశాలను దావోస్‌లో వివరించాం. సమీప కాలంలోనే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా స్వర్ణయుగం రాబోతోంది. విశాఖలో గూగుల్‌ ఏర్పాటు గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. టీసీఎస్‌ కూడా యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో భవిష్యత్‌ అంతా పర్యాటకానిదే. టాటా గ్రూప్ 200 వరకూ గదులు నిర్మించేదుకు ముందుకు వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
బిల్‌గేట్స్‌ సహకారం కోరాం..
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో భాగస్వామి కావాలని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కోరాం. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారానికి విజ్ఞప్తి చేశాం. పెట్టుబడుల కోసం రాష్ట్రంలో ఎకో సిస్టమ్‌ రూపకల్పన చేస్తున్నాం. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్‌ చేస్తున్నా. రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచపటంలో పెట్టడమే మా లక్ష్యం. మనవాళ్లు ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాం. 2047 నాటికి అత్యంత ప్రభావిత వ్యక్తులుగా తెలుగువాళ్లు ఉంటారు. ప్రపంచానికి అన్ని సేవలూ ఇవ్వగలిగే స్థాయికి ఏపీ రాబోతోంది.
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభం కానున్నాయి. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పనులు ఊపందుకున్నాయి. 2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి నీళ్లిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ.11,457 కోట్లతో రివైవ్ ప్యాకేజ్ ఇచ్చింది. విధ్వంసం చేసిన వ్యక్తులు ఇంకా గొంతు చించుకుంటున్నారు. అమరరాజా లాంటి సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేశారు. సాధారణ పౌరుడికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం, తలసరి ఆదాయం పెంచడమే మా లక్ష్యం.
Tags:    

Similar News