విశాఖ తీరాన అలికిడి లేని వైసిపి
ఒకనాడు విశాఖను ఆకాశానికి ఎత్తినా వైసిపి క్యాడరులో ఇపుడు అయోమయం. ఓటమి అనంతరం నియోజకవర్గాల ఆఫీసులు మూత. పత్తా లేకుండా పోయిన నాయకులు. మంచి రోజులెపుడు?;
విశాఖపట్నం: రెండోసారి అధికారం తమదేనని గంపెడాశలు పెట్టుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. నలభై రోజుల క్రితం వరకు నానా హంగామా చేసిన క్యాడరు ఆ పార్టీ అనూహ్య ఘోర పరాజయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు సీట్లు మినహా మిగిలిన 11 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచారు. ఈసారి ఎన్నికల్లో కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు ఎమ్మెల్యే స్థానాలు, అరకు లోక్సభ స్థానం తప్ప మరెక్కడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందలేకపోయారు. అటు రాష్ట్రంలోనూ ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో పార్టీ క్యాడరు తీవ్ర నైరాశ్యంలో ఉంది. దీంతో నెలన్నర క్రితం వరకు జనంతోను, వాహనాలతోనూ కిక్కిరిసి పోయి కనిపించిన పార్టీ ఆఫీసుల వద్ద ఇప్పుడు ఒక్క పిట్ట కూడా వచ్చి వాలడం లేదు. అంతేకాదు.. కొన్ని కార్యాలయాలకున్న పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, నేతల కటౌట్లు సైతం తొలగించేశారు. దీంతో కొద్ది రోజుల నుంచి ఈ ఆఫీసులతో పాటు పరిసరాలు కళా విహీనంగా కనిపిస్తున్నాయి. విశాఖ నగరానికి 10 కి.మీల దూరంలో రూ.కోట్లు వెచ్చించి ఎంతో విశాలంగా నిర్మించిన పార్టీ ప్రధాన కార్యాలయం కూడా బోసిపోయింది. ఆ పార్టీ నాయకులెవరూ అటు వైపు కన్నెత్తి చూడడానికి ఇష్టపడడం లేదు. దీంతో తన వద్దకు ఎవరొస్తారా? అని పార్టీ కార్యాలయం దైన్యంగా ఎదురు చూస్తోంది.
పత్తాలేకుండా పోయిన నేతలు..
మరోవైపు ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్య నాయకులు సైతం పత్తా లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పార్టీ కార్యాలయాలకే కాదు.. జనానికి గాని, కార్యకర్తలు, నాయకులకు గాని కనిపించడం లేదు. ప్రధానంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పలు కేసుల్లో చిక్కుకున్నారు. స్వతహాగా నిర్మాణ రంగంలో ఉన్న ఆయన అధికారంలో ఉండగా నగర నడిబొడ్డున ఉన్న సిరిపురం జంక్షన్లోని సీఎన్ బీసీ స్థలంలో వెంచర్తో పాటు ఇతరుల భూములు, స్థలాలను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఆయనపై కేసులకు దారి తీశాయి. దీంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అడ్రస్ లేకుండా పోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు, వివిధ నామినేటెడ్ పదవులను అనుభవించిన వారు, వార్డు అధ్యక్షులు జనానికి కనిపించడం లేదు. రోడ్డెక్కడం లేదు.
చుట్టపు చూపుగా సుబ్బారెడ్డి..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మూడేళ్ల నుంచి చక్రం తిప్పుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రులు, ఎంపీలు సైతం ఆయన కనుసన్నల్లోనే నడవాల్సి వచ్చేది. దీంతో జగన్ తర్వాత ఉత్తరాంధ్రలో ఆయనదే అగ్రస్థానం. ఆయన వారంలో నాలుగైదు రోజులు విశాఖలోనే ఉండేవారు. సుబ్బారెడ్డి వారానికి రెండు మూడుసార్లు విశాఖ వచ్చినప్పుడల్లా వంది మాగధులంతా విమానాశ్రయానికి పోటెత్తేవారు. వచ్చిన ప్రతిసారీ శాలువాలతో కప్పి ఆయన కంట్లో పడడానికి తపించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అధికారం చేజారిన ఈ నలభై రోజుల్లో సుబ్బారెడ్డి విశాఖకు చుట్టపు చూపుగానే వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మునుపటిలా శ్రేణులు, నేతల జాడ కానరావడం లేదు. జేజులు పలకడం లేదు. సుబ్బారెడ్డి విశాఖ వస్తే స్వాగతం పలికే వారే కరువయ్యారు. ప్రస్తుతానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక్కరే అడపాదడపా ప్రెస్మీట్లు పెట్టి టీడీపీ నేతలు, మంత్రుల ప్రకటనలకు ఖండనలు ఇస్తున్నారు.
కుప్పిగంతులకు కార్పొరేటర్లు సిద్ధం...
మహా విశాఖ నగరపాలక సంస్థలో 98 స్థానాల్లో 59 మంది వైఎస్సార్సీపీ, 29 మంది టీడీపీ, నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పతనం తర్వాత ప్రస్తుత మేయర్ హరివెంకటకుమారిని తప్పించి, ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో 30 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తమ వైపు ఉన్నారంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. గత 2019 ఎన్నికల్లో 15కి 11 ఎమ్మెల్యే, మూడింట్లో రెండు ఎంపీ స్థానాలను దక్కించుకున్న వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో కేవలం రెండు (పాడేరు, అరకు), ఎమ్మెల్యే, ఒక ఎంపీ (అరకు) స్థానానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీ క్యాడరు పరిస్థితి 'తీరమెక్కడో, గమ్యమేమిటో తెలియదు పాపం' అన్నట్టుగా తయారైంది.