కడపలో అవినాష్‌రెడ్డి ఎలా గెలిచాడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని కడప పార్లమెంట్‌ ఎన్నికల్లో ముక్కోణం పోటీ జరిగింది. ఓడాల్సిన అవినాష్‌రెడ్డి గెలిచాడు. గెలవాల్సిన సుబ్బరామిరెడ్డి ఓడారు. ఎలా?;

Update: 2024-06-06 13:00 GMT

కడప పార్లమెంట్‌ స్థానం నుంచి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడని కేంద్ర బిందువుగా ఎన్నికల ప్రచారం ఆమె చేశారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా షర్మిలకు తోడుగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున చదిపిరాళ్ల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి పోటీ చేయగా, వైఎస్సార్‌సీపీ తరపున వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోటీ చేశారు. అంటే కడపలో ముక్కోణపు పోటీ జరిగింది. ఈ ముక్కోణం పోటీలో గెలవాల్సిన టీడీపీ అభ్యర్థి ఓడి పోగా ఓడిపోవాల్సిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచారు. ఇదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

కడప లోక్‌ సభ పరిధిలో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఐదు స్థానాల్లో టిడిపి పోటీచేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. రెండు స్థానాల్లో పోటీచేసిన బిజెపి ఒక చోట గెలిచింది. ఏడింటిలో పోటీచేసిన వైఎస్‌ఆర్సీపీ పులివెందుల, బద్వేల్‌లో మాత్రమే గెలిచింది. ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ రెండింటికీ కలిపి 6,25,199 ఓట్లు వచ్చాయి. వైఎస్‌ఆర్సీపీకి 6,00,351 వచ్చాయి. కాంగ్రెస్‌ పోటీ చేసిన ఆరు స్థానాలు, సిపిఐ పోటీ చేసిన ఒక స్థానం కలిపి 57,858 ఓట్లు వచ్చాయి.
కడప లోక్‌ సభ స్థానంలో వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 6,05,143 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చదిపిరాళ భూపేష్‌ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల రెడ్డికి 1,41,039 ఓట్లు వచ్చాయి.
ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపికి కలిపి వచ్చిన 6,25,199 ఓట్లు టీడీపీ లోక్‌ సభ అభ్యర్థి చదిపిరాళ భూపేష్‌ సుబ్బరామి రెడ్డికి పోలై ఉంటే విజయం టీడీపీని వరించేది. వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఓడిపోయేవారు. ఓటర్లు తెలివిగా ఓట్లు వేశారు. క్రాస్‌ ఓటింగ్‌ ఎక్కువగా చేశారు. టిడిపి లోక్‌ సభ అభ్యర్థి చదిపిరాళ భూపేష్‌ సుబ్బరామి రెడ్డికి 5,42,448 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 82,751 మంది ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమైంది. నిజానికి ఈ క్రాస్‌ ఓటింగ్‌ ఎక్కువగా షర్మిల వైపు ఉండే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే వేవ్‌ తెలుగుదేశం పార్టీవైపు ఉండటంతో అనుకున్న స్థాయిలో షర్మిలకు క్రాస్‌ ఓటింగ్‌ జరగలేదు.
ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సీపీఐకి కలిపి వచ్చిన ఓట్లు 57,858, క్రాస్‌ ఓటింగ్‌ జరిగిన ఓట్లు 82,751. రెండూ కలిపితే 1,40,609. కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల రెడ్డికి వచ్చిన ఓట్లు 1,41,039. ఈ గణాంకాలు గెలుపు ఓటముల్లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో అర్థమై ఉంటుంది. గెలవాల్సిన అభ్యర్థి ఓడారు. ఓడాల్సిన అభ్యర్థి గెలిచారు. న్యాయాన్ని గెలిపించాలని ఘోషించిన అభ్యర్థికి కాస్త ఊరట కల్పించారు ఓటర్లు. ఇదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల పాత్ర.
కడప పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయనేందుకు కడప పార్లమెంట్‌ ఎన్నికే నిదర్శనమన్నారు. ఒకే ఓటరు పార్లమెంట్‌కు ఒకరికి, శాసన సభకు ఒకరికి ఓటు వేసి తన విజ్ఞత చూపారు. వివేకానందరెడ్డి హత్య ప్రభావం వైఎస్సార్‌సీపీపై ఉంటుందని అందరూ భావించారు. ఆ ప్రభావం కొద్దిగ మాత్రమే పనిచేసింది. రాష్ట్ర మంతా టీడీపీ ప్రభంజనం వీచింది. అయినా కడపలో కాస్త సంయమనం వహించిన ఓటర్లు అవినాష్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనేదానికి సమాధానం లేదు. కానీ ఓటర్లు ఎంత తెలివిగా ఓటు చేశారనేదానికి ఈ గణాంకాలే నిదర్శనం. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. అది నేతలు చేయొచ్చు. అవకాశం వచ్చినప్పుడు ఓటర్లు చేసి చూపించొచ్చు. ఇక్కడ అదే జరిగింది. ప్రజాస్వామ్యం ఎంతో విలువైనది. దానిని మంచికి ఉపయోగిస్తే మంచి జరుగుతుంది. చెడుకు ఉపయోగిస్తే చెడు జరుగుతుంది. అందరూ ఆలోచించాలి. గెలుపు ఓటములు ఎలా తారుమారు అయ్యాయో చూశాము. అందుకే పెద్దలంటారు ఏదైనా ఆలోచించి చేయాలని. ఈ నియోకజవర్గంలో ఆలోచనతో పాటు రాజకీయ చతురత కూడా చోటు చేసుకుంది.
Tags:    

Similar News