9.. 12.. 28.. అంకెలు కాదు.. తలరాతలు మార్చిన మెజారిటీలు

ఈ అంకెలు సంఖ్యాశాస్త్రం కాదు. ఒక్క అంకె తలరాతే మార్చేస్తుంది. ఎన్నికల చరిత్రలో నాయకుల రాత మార్చిన రికార్డు ఆంధ్ర రాష్ట్ర పోలింగ్ చరిత్రలో నమోదైంది.

Update: 2024-04-30 05:50 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: అంకెలు విడివిడిగా ఉంటే.. వాటి విలువ తక్కువగా ఉంటుంది. అవన్నీ కలిస్తే ఆ విలువ చాలా ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల రణరంగంలో కొందరు అభ్యర్థులు వేళ్ల మీద లెక్కించే మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల రణరంగంలో ఒకరి రికార్డును మరొకరు అధిగమించే రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, జాతీయస్థాయిలో కూడా తెలుగు ప్రజాప్రతినిధులుగా ఆ గుర్తింపును సాధించారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాలక పగ్గాలు చేజిక్కించుకోవడానికి తహతహలాడుతాయి.

ఆ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు పదవుల కోసం హోరాహోరీగా శ్రమిస్తారు. ఆ కోవలో బ్యాలెట్ పత్రాలు అమలులో ఉన్న రోజుల్లో.. పోలింగ్ ముగిసిన తర్వాత జరిగే ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ ఏర్పడుతుంది. ప్రతి రౌండ్‌లో కొన్ని వందల ఓట్లను లెక్కిస్తారు. ఆ సమయంలో ఒక్కో రౌండ్లో ఒక్కో అభ్యర్థికి వచ్చే ఆధిక్యత మరింత ఆందోళనకు గురిచేస్తుంది. చివరగా ఓట్లు అన్ని లెక్కింపు పూర్తయ్యాక అసలు కథ మొదలవుతుంది. చెల్లని ఓట్లు పరిగణగలోకి తీసుకోవాలని పట్టుబడతారు. ఇది అధికారులను మరింత ఒత్తిడికి గురిచేస్తే, అభ్యర్థులతో పాటు వారి మద్దతుదారుల్లో.. ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది.

ఆ 9 మంది ఎవరో..!

ఎన్నికల్లో జాతీయస్థాయిలోనే అత్యంత తక్కువ ఓట్లతో విజయం సాధించిన రికార్డు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైంది. ఆ పుణ్యాత్ములు ఎవరో కానీ 9 మంది వేసిన ఓట్లతో ఓ అభ్యర్థిని విజయం వరించింది. 1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణపై టిడిపి అభ్యర్థి అప్పల నరసింహ పోటీకి దిగారు. కొణతాలకు 2,99,109 ఓట్లు లభించాయి. టిడిపి అభ్యర్థి నరసింహకు 2,99,100 ఓట్లు దక్కాయి. దీంతో కొణతాల రామకృష్ణ 9 ఓట్ల మెజారిటీతో గెలుపొంది దేశ స్థాయిలో రికార్డు నమోదు చేసుకున్నారు.


12 ఓట్లతో విజయం..

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం కాస్తా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. నవ్యాంధ్రలో ప్రథమ ఎన్నికలు 2014లో జరిగాయి. అప్పటికే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సిపి ద్వారా మొదటిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పాతర వేశారు. దివంగత సీఎం డా. వైయస్సార్ లేరని సానుభూతి ఉన్నప్పటికీ.. "యువకుడు, అనుభవం లేదు" అనే ప్రచారం, ఓటర్లు కూడా అలాగే భావించి, అనుభవానికి పెద్దపీట వేస్తూ టిడిపికి అధికారం కట్టబెట్టారు. ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కె)కి 88,977 ఓట్లు లభించాయి. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవికి 88,965 ఓట్లు దక్కాయి. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్పంగా 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

బ్యాలెట్ ఉత్కంఠ..!

28 ఓట్లతో విజయం

అవి 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు. కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ డిఎల్. రవీంద్రారెడ్డిపై టిడిపి అభ్యర్థిగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అన్ని లెక్కించేసరికి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డికి 47, 046 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డికి 47, 018 ఓట్లు లభించాయి. చెల్లని ఓట్ల కింద 30 బ్యాలెట్ పత్రాలను పక్కన ఉంచారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని టిడిపి అభ్యర్థులు పట్టుబట్టారు.

ఓట్లు లెక్కింపు పూర్తయిన విషయాన్ని అప్పటి కలెక్టర్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం (దివంగత సీఎం డాక్టర్ వైయస్తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు) కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. "రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తున్నాం. మైదుకూరు సీట్ టిడిపికి ప్రకటించండి" అనే ఒత్తిళ్లు అప్పటి కలెక్టర్ సుబ్రహ్మణ్యంపై ఎక్కువయ్యాయి. నిక్కచ్చిగా వ్యవహరించిన ఆయన ఒత్తిళ్ళను సున్నితంగా భరిస్తూనే, నిబంధనల మేరకు 28 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి ఎన్నికైనట్లు ప్రకటించారు. అప్పట్లో రాష్ట్రంలో టిడిపి ప్రభంజనం కనిపించినా మైదుకూరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయకేతనం ఎగరవేశారు. అసెంబ్లీ స్థానాల్లో ఇలా ఉండగా.. పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరు తెలుగువాళ్లు భారీ మెజారిటీతో గెలిచి రికార్డుల్లో నమోదయ్యారు.


పీవీ... రికార్డ్...

ఎంపీ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన టాప్-7లో ఇద్దరు తెలుగు ప్రజాప్రతినిధులు ఉన్నారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పీవీ నరసింహారావు దేశంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. 1999 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటికి ఆయన ఎంపీ కాదు. ఆరు నెలల లోపల ఆయన ఎంపీగా గెలవాల్సి ఉంటుంది.

అయితే పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేయించాలని ఏఐసీసీ హైకమాండ్ నిర్ణయించింది. "తెలుగు వ్యక్తి ప్రధాని పీఠంపై కూర్చుంటున్నారు అంటే అది ఆంధ్రులకు గర్వకారణం" అని టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు చెప్పడమే కాదు. పీవీ నరసింహారావుపై పోటీ పెట్టబోమని విస్పష్టంగా ప్రకటించారు. పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేయడానికి వీలుగా.. గంగుల ప్రతాపరెడ్డి కొన్ని రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై అప్పటి ప్రధాన పీవీ నరసింహారావు 5.8 లక్షల మెజారిటీతో గెలుపొందారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వారిలో మహారాష్ట్రకు చెందిన ప్రీతం ముండే 6.2 లక్షలు, పశ్చిమ బెంగాల్ అమర్ బాగ్ ఎంపీ స్థానం నుంచి సిపిఐ (ఎం) అభ్యర్థి అనిల్ బసు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. గుజరాత్‌లోని వడదొర ఎంపీ స్థానం నుంచి ఎంపీగా 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ నాలుగో స్థానంలో నిలిచారు.


ఒంటరిగా బరిలోకి...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, కేంద్రంలో కూడా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి, ఢిల్లీ పెద్దలను ఎదిరించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ కుమారుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2011లో కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీకి దిగారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డితో వైఎస్. జగన్ పోటీపడ్డారు. ఎన్నికల్లో.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి 6,92,252 ఓట్లు దక్కాయి. డాక్టర్ డీఎల్. రవీంద్రారెడ్డికి 1,46,579 ఓట్లు లభించాయి.

దీంతో వైఎస్ జగన్.. 5,45,672 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్‌లోని హాజీపూర్ నుంచి రాం విలాస్ పాస్వాన్ ఆరో వ్యక్తిగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రం (ప్రస్తుతం తెలంగాణ) లో 2015 లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి 4.59 లక్షలతో గెలుపొందిన పసునూరి దయాకర్ ఏడు స్థానంలో నిలిచారు. 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటు స్థానంలో ఓటర్లు ఎవరికి అత్యధిక మెజార్టీ ఇవ్వనన్నారు అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News