AP POLITICS | కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యల పరిశ్రమ క్లోజ్

కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆర్ధిక మూలాలపై భారీ వేటే పడింది. ఆయన కుటుంబానికి ఉన్న వీరభద్ర రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీ మూతకు పీసీబీ తాకీదులు ఇచ్చింది.

Update: 2024-12-03 06:35 GMT

Ex MLA Dwarampudi's prance Unit

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం కొత్తేమీ కాదు. రాష్ట్రంలో పాలక పార్టీ మారినపుడల్లా ప్రతీకార రాజకీయాలు మొదలవుతుంటాయి. ఇప్పుడదే కోవలో వైసీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రక్రియ మొదలైంది. తాజాగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వ్యాపారి, వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy) ఈ జాబితాలో చేరారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ద్వారంపూడి కుటుంబానికి ఇప్పుడు తగిలిన దెబ్బ మామూలుది కాదు. ఆయన కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్‌ కార్యాలయం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ పేరిట రెండో యూనిట్‌ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిశ్రమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందన్న ఆరోపణలపై ఇప్పుడు పీసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన తనిఖీల్లో ఈ పరిశ్రమలో అతిక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. నోటీసులు ఇచ్చారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో మూసివేతకు తాఖీదులు ఇచ్చినట్టు పీసీబీ ప్రకటించింది. ఫలితంగా ఈ యూనిట్ లో ఉత్పత్తి నిలిచిపోనుంది.
కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో గతంలో ద్వారంపూడి కుటుంబానికే చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలోనూ ఉల్లంఘనలు గుర్తించి ఈ ఏడాది ఆగస్టు 6న మూసివేయించారు.
వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ రొయ్యల శుద్ధి యూనిట్‌ 25 టన్నుల సామర్థ్యంతో నడుస్తోంది. 300 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ 1.5 టన్నుల అమ్మోనియా నిల్వ ట్యాంకు ఉంది. ఈ ట్యాంకు నిర్వహణకు సంబంధించి లోపాలు ఉన్నట్టు పీసీబీ పేర్కొంది. ప్రమాదాలు గుర్తించే హెచ్చరికల వ్యవస్థ లేదని తెలుస్తోంది. వ్యర్థాల శుద్ధి కేంద్రం ఉన్నా సరిగా పని చేయడం లేదు. అనుమతి లేకుండా 20 టన్నుల ఐస్‌ ట్యూబ్‌ ప్లాంటు నిర్వహిస్తున్నారు. ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలని జులై 3 న నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత తనిఖీలు చేసినా స్పందించకపోవడంతో మూసివేతకు చర్యలు తీసుకున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.
ద్వారంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరస్పరం సవాళ్లు కూడా విసురుకున్నారు. ద్వారంపూడి ఆటకట్టిస్తామని ఎన్నికల ప్రచార సమయంలోనే పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Tags:    

Similar News