నేను గనుక ఈల వేస్తే ఆ అభ్యర్థికి గుండె దడే

సామాన్యుడు ఈల వేస్తే ఢిల్లీలో వినిపిస్తుంది. ఇది అభ్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. ఏంటా కథ..!

Update: 2024-03-20 08:56 GMT
Source: Twitter


(ఎస్. ఎస్. బి. భాస్కర్ రావ్,)

తిరుపతి: సమాజంలో సామాన్యుడే హీరో. ఇతను అనుకుంటే ఎవరి తలరాతైన మార్చగలడు. పల్లెలో ఈల వేస్తే ఢిల్లీలో వినిపిస్తుంది. అదే ఈల తిరిగి ఐదు నుంచి 15 నిమిషాల వరకు జిల్లా వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎన్నికల్లో అక్రమాల నిరోధానికి కేంద్ర ఎన్నికల సంఘం సామాన్యుడి చేతికి 'సీ- విజిల్ ' అనే యాప్‌ను అస్త్రంలా అందించింది. ఎన్నికల ప్రవర్తన ఉల్లంఘించే అభ్యర్థులపై ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఈ సి-విజిల్ యాప్ వల్ల ఇకపై గతంలో మాదిరి అభ్యర్థుల ఆటలు సాగవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రధాన పార్టీలకు ప్రతిష్ట ఈ ఎన్నికలు

2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. వెంటనే ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖర్చులు ఎవరికి ఎవరు తీసిపోమనే విధంగా ప్రవర్తించే అవకాశం లేకపోలేదనే ముచ్చట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా పార్టీల అభ్యర్థుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తన కార్యకలాపాలను ప్రారంభించింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ సామాన్యుడికి శరీరంలో భాగమైంది. అందుబాటులోని సాంకేతిక వ్యవస్థను సద్వినియోగం చేసుకునే దిశగా సామాన్యుడి చేతిలోని ఫోన్‌ను పాసుపతాస్త్రంగా మార్చడానికి ' సి-విజిల్' అనే ఒక యాప్‌ను అందుబాటులోకి వచ్చింది.




ఏం చేయాలంటే..

ఆండ్రాయిడ్ ఫోన్ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి సి-విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం మొబైల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం పంపే ఓటీపీని ఎంటర్ చేయగానే సి-విజిల్ యాప్ సిద్ధం అవుతుంది. ఎన్నికల ప్రచారంలో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

ఇలా చేయాలి..

సి-విజిల్ యాప్‌ను ఓపెన్ చేయగానే ఫొటో, వీడియో, ఆడియో ఆప్షన్స్ ఉంటాయి. ఫొటో ఫిర్యాదు చేయాలంటే.. ఫోటో ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ లొకేషన్ నమోదు అవుతుంది. మిగతావి కూడా అలాగే చేయాలి. అంతేకాకుండా రాష్ట్రం, నియోజకవర్గం, మండలం గ్రామం వంటి అంశాలను కూడా నమోదు చేయాలి. అభ్యర్థి ఉల్లంఘనకు పాల్పడిన తీరును వివరించాలి. అనంతరం సబ్‌మిట్ కొట్టగానే మీ ఫిర్యాదు.. కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతుంది.




ఫిర్యాదులు..

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా అభ్యర్థులు, పార్టీలు వ్యవహరిస్తుంటే ఫిర్యాదు చేయవచ్చు. నగదు, బహుమతులు పంపిణీ, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు వంటివే కాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఫిర్యాదు చేయవచ్చు.

నిమిషాల్లోనే రంగంలోకి అధికారులు

కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన ' సి-విజిల్ యాప్ ' లో ఫిర్యాదు నమోదు చేయగానే.. ఐదు నిమిషాల్లో ఫీల్డ్ యూనిట్‌కు సమాచారం వెళ్తుంది. ఫిర్యాదు వచ్చిన 15 నిమిషాల్లో అధికారులు ఘటన స్థలానికి చేరుకుంటారు. విచారణ అనంతరం 30 నిమిషాల్లో వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఎన్నికల అధికారికి నివేదిస్తారు. దానిపై ఆయన 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా 100 నిమిషాల్లో ' సి - యాప్ 'లో నమోదయ్యే ఫిర్యాదుపై చర్యలు తీసుకునే విధంగా.. ఫిర్యాదుదారు కూడా స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త తరహా ఫిర్యాదుల విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలకు... రాజకీయ పార్టీలు, ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంటాయి. కొద్దో గొప్పో నగదు ఇతరత్రా వస్తువులు పట్టుబడినప్పటికీ.. అంతిమంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాన్ని అమలు చేస్తుంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సి-విజిల్ యాప్ వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూద్దాం.



Tags:    

Similar News