మాజీ ఎంపీ కేశినేని నాని విజయవాడలో సేవా కార్యక్రమాలు చేపడతారా?

విజయవాడ పార్లమెంట్ మాజీ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ప్లాన్ ఏమిటి? రాజకీయాలకు దూరంగానే ఉంటారా? విజయవాడ ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేపడతారా?;

Update: 2025-02-20 03:13 GMT

కేశినేని శ్రీనివాస్ (నాని) పదేళ్లుగా విజయవాడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఎంపీగా ఆయన సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీలో 2014, 2019లో గెలిచి తనకంటూ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభంజనంలోనూ విజయవాడలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. నగరంలో ఫ్లై ఓవర్ ఆయన హయాంలోనే శాంక్షన్ అయి పూర్తి చేయించారు. కేంద్రం ద్వారా వచ్చే నిధులను వినియోగించడంలో ముందున్నారు. అవినీతి మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ నగరంలో అవినీతి మచ్చ పడకుండా ఎంపీగా పనిచేసి రాజకీయాలకు దూరమైన వారిలో మాజీ ఎంపీ కేశినేని నాని ఒకరు.

టాటా సంస్థతో మంచి సంబంధాలు

స్వర్గీయ రతన్ టాటా ద్వారా పలు కార్యక్రమాలు గతంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టారు. యువకులకు భవిష్యత్ ను ఇచ్చే పలు ట్రైనింగ్ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేశారు. నియోజకవర్గంలోని పశ్చిమ ప్రాంతంలో తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మంచినీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. విజయవాడకు పై భాగాన ఉన్న తిరువూరు, మైలవరం, నందిగామ వంటి నియోజకవర్గాల్లో తాగు నీటి కష్టాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు బోర్లపైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది. సాగర్ నీరు ఈ నియోజకవర్గాలకు అందే పరిస్థితులు లేవు. ఎన్నికల సందర్భంగానే కాకుండా సాధారణ రోజుల్లోనూ నియోజకవర్గంలో మంచినీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు.

తెలుగుదేశంతో తెగదెంపులు

2024 సాధారణ ఎన్నికలకు మూడు నెలల ముందు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాని ఎంపీగా ఉండగానే దూరంగా పెడుతూ వచ్చారు. పార్టీలో ముఖ్య నాయకునిగా ఉంటూ విజయవాడ ఎంపీగా తనకే ప్రాధాన్యత తగ్గించడంపై కాస్త నాని ఇబ్బంది పడ్డారు. దీంతో ఎన్నికల సమయంలో పార్టీని వదులుతున్నట్లుగా చెప్పారు. నాని కుమార్తెను కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు. ఎన్నికల చివరి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని

విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ (చిన్ని) పోటీకి దిగారు. నాని ఓటమి చెందటం, చిన్ని గెలవటంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేశినేని చిన్ని నగర ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. అయితే తెలుగుదేశం పార్టీపై అభిమానం, వైఎస్సార్ సీపీపై వ్యతిరేకత చిన్ని కి కలిసొచ్చాయి.

వారంలో మూడు రోజులు విజయవాడలోనే..

ఎన్నికలు జరిగిన తరువాత కొద్దిరోజులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన సొంత పనులు చూసుకుంటూ తన కోసం వెళ్లిన వారిని పలకరిస్తూ వస్తున్నారు. బెంగుళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో తన వ్యాపారాలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కేశినేని ట్రావెల్స్ ను కూడా ఎంపీ గా ఉండగానే మూసి వేశారు. ఉద్యోగులకు తనకు చేతనైనంత వరకు సాయం చేసి వేరే చోట్ల అవకాశాలు కూడా కల్పించారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా కేశినేనికి వ్యతిరేకంగా ట్రావెల్స్ మూసి వేసినప్పుడు మాట్లాడలేదు. నష్టాలు భరించే స్థాయిని దాటి నందున ట్రావెల్స్ మూసి వేస్తున్నట్లు అప్పట్లో కేశినేని ప్రకటించారు.

వారంలో మూడు రోజుల పాటు విజయవాడలోని ఎనికేపాడులో ఉన్న ఇంట్లోనే నాని ఉంటున్నారు. తనకోసం వచ్చే వారిని కలుస్తున్నారు. సేవా కార్యక్రమాలకు ఎవరు పిలిచినా వెళుతున్నారు. పుట్టిన రోజు, గిట్టిన రోజు వంటి ఫంక్షన్ లకు పిలిస్తే వెళుతున్నారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతున్నారు.

రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నాడంటూ ప్రచారం

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విజయవాడలో ప్రచారం మొదలైంది. రతన్ టాటాతో ఉన్న సంబంధాల వల్ల బీజేపీ వారితోనూ మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆ కథనాలను కేశినేని నాని ఖండించారు. తనను అభిమానించే ప్రజల కోసం వెళుతున్నానని ప్రకటించారు. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు ఈ ప్రచారం వ్యూహంగా కనిపిస్తోందని అన్నారు. అయితే ఏడు నెలల కాలంలో కనీసం మూడు నెలల వరకు విజయవాడకు రావడం కూడా తగ్గించారు. అందువల్ల ఈ ప్రచారం సాగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. నిప్పు లేనిదే పొగ వస్తుందా? అంటూ మరి కొందరు వ్యాఖ్యానించటం విశేషం.

సేవా కార్యక్రమాలు చేపడతారా?

తాను రాజకీయాలు జూన్ 10 నుంచి వదిలేసానని, తిరిగి ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఫేస్ బుక్ వేదికగా ఆయన మనసులో మాటను వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. తాను గతంలో రాజకీయాలపై తీసుకున్న నిర్ణయం మారదన్నారు. ప్రజా సేవ అనేది నిబద్ధత అని, కుల, మతాలకు రాజకీయాలు అతీతంగా ఉండాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని ప్రకటించారు. సమాజానికి నా సేవలు ఏ రాజకీయ పార్టీతోనూ ముడిపడి లేవన్నారు. కానీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పౌరుల శ్రేయస్సు నాలోని అంకిత భావంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి శ్రేయస్సు ను నిరంతరం పరిగణలోకి తీసుకుని అడుగులు వేస్తానని ప్రకటించారు. నాకు మద్దతుగా నిలిచిన, నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు తన సందేశంలో ప్రకటించారు.

ఎంపీ కేశినేని శివనాథ్ పరిచయాలు పెరగలేదు..

ఎంపీ కేశినేని శివనాథ్ నగరంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తప్ప సెకండ్ కేడర్ తో పరిచయాలు పెరగలేదనే చర్చ జరుగుతోంది. మునిసిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నా వారిని నేరుగా గుర్తుపట్టే పరిస్థితులు లేవని కొందరు చెబుతున్నారు. ఎంపీని కార్యాలయంలో కలిసేందుకు ఎప్పుడైనా కార్పొరేటర్లు వస్తే వారి పేరు ఏమిటని పక్క వారిని అడుగుతున్నారని, అదే నానీ అయితే నేరుగా కార్పొరేటర్లను పేర్లతోనే పిలిచే వారని టీడీపీలోని కొందరు నాయకులు చెబుతున్నారు. యాక్టివిటీలో నానీకి, చిన్నీకి కొన్ని తేడాలు ఉన్నాయని, ఇద్దరు అన్నాతమ్ముళ్లు అయినా పనితీరులో చాలా తేడాలు కనిపిస్తున్నాయనే చర్చ ఉంది. చిన్ని ఏ విషయాన్ని కూడా వెంటనే తెంచి పరిష్కరించడం లేదని, అదే నానీ హయాంలో ఏ సమస్య వచ్చినా అవుతుందో కాదో వెంటనే తేల్చేసే వారనే చర్చ కూడా ఉంది. తనకు ఈ పని చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల నేను చేయలేని చెప్పే వారని, చేయగలిగిన పనిని ఫోన్ లోనే సంప్రదించి చేయించే వారని కొందరు తెలుగుదేశం పార్టీ వారు చెబుతున్నారు.

Tags:    

Similar News