FREE BUS | కొత్త సంవత్సర కానుకగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం!
ఏపీలో సూపర్ సిక్స్ లోని మరోహామీని అమలు చేసేందుకు నడుంకట్టింది. ఆర్టీసీ బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం (Free bus Travel) కల్పించేలా సన్నాహాలు చేస్తోంది.;
By : The Federal
Update: 2024-12-09 06:34 GMT
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ (SUPER SIX) లోని మరోహామీని అమలు చేసేందుకు నడుంకట్టింది. ఆర్టీసీ బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం (Free bus Travel) కల్పించేలా సన్నాహాలు చేస్తోంది. అంతా సవ్యంగా సాగితే సంక్రాంతి నుంచి మహిళలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలుచేసేందకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరును అధ్యయనం చేసిన అధికారులు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యంతో ప్రభుత్వంపై పడే భారం, బస్సుల లభ్యత, రోజువారీ ప్రయాణికుల సంఖ్య వంటి అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు. పథకాన్ని ఒక్కసారి అమలు చేశాక ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా స్పష్టమైన విధివిధానాలు నివేదికలో పొందుపరచనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ స్కీంను కచ్చితంగా అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది.
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత సిలెండర్ల పథకాన్ని గత నెలలో ప్రారంభించింది. రెండో పథకంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బస్సుల లభ్యత, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపై అధికారులు ఇప్పటికే పరిశీలించి వచ్చారు. తుది నివేదిక వచ్చాక ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
రాష్ట్రమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు కర్నాటక, తెలంగాణ సహా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పథకం ఒక్కొక్క రాష్ట్రంలో పథకం ఒక్కో విధంగా అమలవుతోంది. కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాలకే పరిమితం కాగా మరికొన్ని చోట్ల రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
అన్ని రాష్ట్రాల్లో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనే ఉచితంగా మహిళలను ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు ఉచిత ప్రయాణం అమలులో ప్రత్యేకించి పురుషులు చెబుతున్న కొన్ని సమస్యలను చర్చిస్తున్నారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆటో డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనిలో ఉన్నారు.
సంక్రాంతి నుంచే అమలు చేసేలా...
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో ఈ విషయమై సమీక్షించారు. ఇప్పటికే ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పాత బసుల్ని సర్వీసు నుంచి పక్కనబెట్టారు. దీంతో బస్సుల కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఆరొందల వరకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో వెయ్యి బస్సుల వరకు ఆర్టీసీకి సమకూరనున్నాయి. ఇదే సమయంలో అద్దె బస్సుల సంఖ్యను కూడా ఆర్టీసీ పెద్ద ఎత్తున సమకూర్చుకోనుంది.