గాజు గ్లాసు తలనొప్పి ఎంత మందికో..

గాజు గ్లాసుతో పలువురు అభ్యర్థులకు తలనొప్పులు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులకు పలు చోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

Update: 2024-04-29 16:11 GMT

ఎన్‌డీఏ కూటమిలో సీట్లు రాని వారు చాలా చోట్ల రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. తెలుగుదేశం, జనసేన రెబల్స్‌గా సుమారు 21 మంది పోటీలో ఉన్నట్లు ఆయా పార్టీల వారు చెబుతున్నారు. వీరు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు తలనొప్పిగా మారటమే కాకుండా ప్రస్తుతం మరో తలనొప్పిని తీసుకొచ్చారు. ఏకంగా గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా తీసుకుంటున్నారు.

ముగిసిన నామినేషన్‌ల ఉపసంహరణ
ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్‌ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలోనూ స్వతంత్రలు చాలా మంది పోటీలో ఉన్నారు. సీట్లు రాని వారు తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. వారు కూడా స్వతంత్ర అభ్యర్థుల కింద పరిగణిస్తారు. ఎన్‌డీఏ కూటమిలోని జనసేన పార్టీ తమకు గాజు గ్లాసు గుర్తు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. వారి కోరిక మేరకు ఎన్నికల సంఘం వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారి నుంచి లెటర్‌ తీసుకుని గాజు గ్లాసును జనసేన అభ్యర్థికి కేటాయించారు.
పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన రెబల్స్‌
రాష్ట్రంలో 21 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగిలిన చోట బిజెపి, టీడీపీ వారు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ ద్వారా గుర్తులు కేటాయిస్తారు. అయితే గాజుగ్లాసు గుర్తు కావాలని ఎక్కువ మంది పోటీ పడటంతో లాటరీ వేసి కేటాయించారు. గాజుగ్లాసు వచ్చిన చోట్ల జనసేన ఓటర్లు సైకిల్‌కు ఓటు వేయకుండా గాజు గ్లాసుకు ఓటు చేసే అవకాశం ఉందని టీడీపీ వారు ఆందోళన చెందుతున్నారు.
ఎందుకు ఈ పరిస్థితి..
జనసేన రిజిస్టర్డ్‌ పార్టీ మాత్రమే. ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ కాదు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గుర్తింపు లభించాలంటే ఎన్నికల సంఘం పెట్టిన షరతుల ప్రకారం పార్టీ ఓట్లు సాధించాలి. 2019 శాసనసభ ఎన్నికల్లో 137 సీట్లకు పోటీ చేసిన జనసేన 5.53 శాతం ఓట్లు జనసేన సాధించింది. ఎన్నికల నిబంధన ప్రకారం ఆరు శాతం ఓట్లు సాధిస్తేనే శాశ్వత గుర్తును ఎన్నికల సంఘం పార్టీకి కేటాయించాలనే నిబంధన ఉంది.
1968 ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్‌/కేటాయింపు) 10బి నిబంధన ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. జనసేనకు కేటాయించిన గుర్తు గాజు గ్లాసు. ఈ గుర్తు తన పార్టీకి చెందాలంటూ రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యులర్‌) అధ్యక్షులు మేడా శ్రీనివాసరావు కోర్టుకు వెళ్లడంతో వివాదం ప్రారంభమైంది. 2023 డిసెంబరు 20న ఆయన గాజు గ్లాసు గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశానని చెబుతుండగా 2023 డిసెంబరు 12న మేము లేఖ రాశామని జనసేన చెబుతోంది. శాసన సభ గడువు ఆరు నెలలకు ముగుస్తుందనగా ఎన్నికల గుర్తు కోసం ముందుగా ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. వివాదం హైకోర్టుకు వెళ్లింది. జనసేన ముందుగా లేఖ ఇచ్చినందున గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే గాజుగ్లాసు ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్‌ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, హిందూపురంలలో రెబల్‌ అభ్యర్థులు పోటీకి దిగారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్‌ రాజేష్, అథిది గజపతిపై మీసాల గీత, జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర, రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్‌ మొడియం సూర్యచంద్రరావు బరిలో ఉన్నారు. ఈ నియోకజవర్గాల్లో గ్లాసు గుర్తు అడిగిన వారికి లాటరీ వేసి గుర్తులు కేటాయించారు. కావలి జనసేన రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన రఘువర్మ (చంటి) తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బొలిశెట్టి సత్య చొరవతో తాను నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు.
Tags:    

Similar News