రోజా ఓడితే మా బాధ్యత కాదన్నా!

ఆర్కే రోజాకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో ఆమె ఓడితే తమకు సంబంధం లేదని వైసీపీ అధిష్టానానికి ఐదు మండలాల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెగేసి చెప్పారు.;

Update: 2024-03-06 10:37 GMT
జగన్‌తో మండల నాయకులు

ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్-తిరుపతి



"కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. నాయకులంటే విలువ లేదు. మంత్రి ఆర్కే రోజా అన్నదమ్ముల దోపిడీ ఎక్కువైపోయింది. ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేకతను గుర్తించకుండా, అధిష్టానం మళ్లీ ఆర్కే రోజాకు టికెట్ ఇస్తే.. ఆమె ఓటమికి మేము బాధ్యులం కాదు. ఆమె మినహా ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం" అని వైఎస్ఆర్సిపి అధిష్టానానికి ఐదు మండలాల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెగేసి చెప్పారు. మళ్లీ ఈసారి ఆర్కే రోజాకు టికెట్ ఇవ్వడం అంటే... టిడిపి అభ్యర్థిగా చెబుతున్న గాలి భాను ప్రకాష్ రెడ్డి విజయానికి బాటలు వేయడమేనని హెచ్చరిస్తున్నారు.

నగిరి నియోజకవర్గంలో వడమాలపేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డితో మంత్రి ఆర్కే రోజా మధ్య సాగుతున్న పోరు కొత్త మలుపు జరిగింది. ఆయనకు పుత్తూరు, నిండ్ర, విజయపురం, నగిరి మండలాల కీలక నాయకులు కూడా గళం కలిపారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాలో వైయస్ఆర్సీపీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంట వైఎస్ఆర్సిపి లోకి వచ్చిన వారే.

ప్రయాణం ఇలా..

సినీనటి, ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రగిరి, నగిరి లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలకపాత్ర పోషించారు.

వైఎస్సార్సీపీలో చేరిక..

కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో వైయస్సార్ సిపి ఏర్పడిన తర్వాత ఆర్కే రోజా. వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్సిపి లోకి వచ్చారు. 2014 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైయస్సార్సీపి పెద్దల సూచన మేరకు ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి స్వయంగా మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సానుకూల పవనాలు, నియోజకవర్గంలోని స్థానిక నాయకుల సంపూర్ణ సహకారంతో ఆమె మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే రాష్ట్రంలో రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేశారు.

నాయకుల ఐక్యతతో

ఆమె ఎన్నికల్లో విజయం సాధించడానికి నగరి అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్, నిండ్ర మండలం నుంచి రెడ్డివారి చక్రపాణి రెడ్డి, అప్పటి వడమాల పేట ఎంపీపీ మురళీధర్ రెడ్డి (ప్రస్తుతం జడ్పిటిసి సభ్యులు), పుత్తూరు మాజీ ఎంపీపీ వేలుమలై మొదలియార్ (అమ్ములు), విజయపురం నుంచి లక్ష్మీపతి రాజు, కేజే శాంతి, ఆమె భర్త తేజ కుమార్ వంటి నాయకులందరూ సమస్టిగా కలిసి పని చేయడం వల్ల విజయకేతనం ఎగరవేయడానికి అవకాశం కలిగింది.

తర్వాత ఏమైంది?

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్థానిక నాయకులతో ఏర్పడిన విభేదాలు అంతరం సృష్టించాయి. అందులో ప్రధానంగా వనరిలో కీలకంగా వ్యవహరించే ప్రస్తుత ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి ఆమె భర్త కే.జే. కుమార్ దంపతులతో వైరం ఏర్పడింది. మిగతా మండలాల్లోని ఉడమల పేట, పుత్తూరు, నిండ్ర, విజయపురం, నగిరి మండలాల్లోని కీలక నేతలతో కూడా అంతరం ఏర్పడింది. నాయకులను, కార్యకర్తలను గాలికి వదిలేసి టిడిపి నుంచి వచ్చి చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నార. ఆర్కే రోజా సోదరులు కుమారస్వామి రెడ్డి, పెత్తనం ఎక్కువైపోయిందని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వారి దోపిడీకి అంతం లేకుండా పోయిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. వారి ఇంటిలో ఇదే విషయంలో గొడవలు కూడా జరిగాయని చెబుతున్నారు. ఆర్కే రోజా ఒకరికి మాటిస్తే.. ఆమె అన్న కుమారస్వామి రెడ్డి మరొకరికి హామీ ఇచ్చి పంపకాల్లో కూడా తేడాలు వచ్చినట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఆర్కే రోజా సోదరుల దోపిడీకి అంతం లేకుండా పోయిందని, చివరికి అధికారిక కార్యక్రమాల్లో కూడా వారి పెత్తనం ఏంటని వైఎస్ఆర్సిపి కీలక నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఎంపీపీ కాకుండా చేశారు..
నగిరి నియోజకవర్గం నిండ్ర మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా ఉన్న రెడ్డివారి చక్రపాణి రెడ్డి మద్దతుదారులు ఆరుగురు వైయస్సార్ సిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలుపొందారు. అందులో రెడ్డివారి చక్రపాణి రెడ్డి సోదరుడు రెడ్డివారి భాస్కర్ రెడ్డి కూడా ఒకరు. ఈ వర్గం నుంచి ఎంపీటీసీ సభ్యురాలు దీపను తన పక్క తిప్పుకొని, గెలిచిన టిడిపి ఒక సభ్యుడిని కొనుగోలు చేసిన మంత్రి ఆర్కే రోజా .. " నన్ను ఎంపీపీ కాకుండా అడ్డుకున్నారు" అని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి సోదరుడు రెడ్డి వారి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.

స్థానికులకే ఇవ్వండి

నగిరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా కాకుండా ఎవరికైనా టికెట్ ఇవ్వాలని స్థానిక నాయకులు తమ డిమాండ్ ను మళ్లీ తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే సమస్య ఏర్పడినప్పుడు.. వైఎస్ఆర్సిపి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరిని సముదాయించి ఐక్యం చేశారు. మళ్లీ అదే సమస్య పునరావృతమైంది. ఈ వ్యవహారంపై వడమాలపేట మండల మాజీ ఎంపీపీ, ప్రస్తుత జెడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి ఏమంటున్నారంటే... "మా మండలంలో అప్పలాయగుంట సచివాలయం, పత్తి పుత్తూరు భరోసా కేంద్రాలు నిర్మించాం. మంత్రి ఆర్కే రోజా ప్రమేయంతో శిలాఫలకాలను తొలగించారు. ఈ వ్యవహారంపై నాపై ఫిర్యాదు చేశారు. దీనిపై నేను ప్రైవేటు కేసు దాఖలు చేస్తా. అధికార పార్టీలో ప్రజాప్రతినిధిగా ఉండి, తన మాదిరి ఎవరు ఇంత అవమానాలు పడి ఉండరని ఆవేదన చెందారు.

2006 నుంచి రెడ్డివారి చెంగారెడ్డి మంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను క్రియాశీల రాజకీయాల్లో వున్నాను. 2014 నుంచి 19 వరకు నగిరి నియోజకవర్గంలో టిడిపి నాయకులు గెలిచినా. వైఎస్ఆర్సిపి నుంచి నేను ఒక్కడినే ఎంపీపీగా ఉన్న. నా మండల ఓటర్లు మళ్ళీ నన్ను జడ్పిటిసి సభ్యుడిగా గెలిపించారు. వడమాల పేట మండలం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే రోజాకు 1780 ఓట్లు మెజారిటీ తెప్పించడానికి ఎంతో శ్రమించానని ఆయన గుర్తు చేశారు.

ఆ అధికారం ఎవరిచ్చారు?

ఎమ్మెల్యే, మంత్రి హోదాలో ఆర్కే రోజా ఏ కార్యక్రమంలో అయినా పాల్గొనవచ్చు. ఆమె సోదరులకు "ఏ హక్కుతో అధికార కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు" అని వడమాల పేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంజూరు చేసిన రూ.51 లక్షలతో చేపట్టిన పనులకు ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆయనకు ఏం అధికారం హక్కు ఉందనేది మా ప్రశ్న అన్నారు.
గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి ఆర్కే రోజా మమ్మల్ని అందరినీ పక్కకు ఉంచి సంపాదనపైన దృష్టి నిలిపారని.. పుత్తూరు మాజీ ఎంపీపీ వేలుమలై మొదలియార్ (అమ్ములు), వైయస్సార్సీపి రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయపురం మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీపతి రాజు, పుత్తూరు మాజీ సర్పంచ్ రవి శేఖర్ రాజు, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి సోదరుడు రెడ్డి వారి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. "ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైఎస్సార్సీపీలో చేరిన వారు మాత్రమే ఆర్కే రోజాకు మళ్ళీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు" అని వారు గుర్తు చేశారు.

పరిష్కారం: " మేమే కాదు"
నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని కీలక నాయకులు, పార్టీ శ్రేణులు కోరుకుంటుంది ఒకటే. నగిరి నియోజకవర్గంలో నుంచి మంత్రి ఆర్కే రోజాకు మినహా.. స్థానిక నాయకులకి టికెట్ ఇవ్వాలి" అని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టి కూడా పలుసార్లు తీసుకువెళ్లామని వారు గుర్తు చేశారు.
2014 ఎన్నికల తర్వాత నుంచి మంత్రి ఆర్కే రోజాతో రాష్ట్ర ఈడ్గా కార్పొరేషన్ చైర్పర్సన్ ( గతంలో వైఎస్ఆర్సిపి నగరి మున్సిపల్ చైర్ పర్సన్) కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్ ఉప్పు -నిప్పులా ఉన్నారు. గతంలో నగిరి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిద్దరిని కలపడానికి వేదికపైనే ప్రయత్నించారు. ఎవరికివారు ముభావంగా తప్పుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం అన్నగిరిలో ఆర్కే రోజా విషయం ఏంటో తేల్చాలని కేజే కుమార్, తేజ శాంతి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.

కార్యకర్తలతో రోజా భేటీ...
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్కే రోజా సోదరులు రామ్ కుమార్ రెడ్డి, కుమార్ స్వామి రెడ్డి నియోజకవర్గంలో అంతా తామేనట్లు కార్యక్రమాలు చక్కదిద్దుతున్నారు. ఇటీవల పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి సారధ్యంలో నగిరి లో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది. దీంతో నష్ట నివారణ చర్యల కోసం రంగంలో దిగిన మంత్రి ఆర్కే రోజా గ్రామాలు పంచాయతీలోని నాయకులను తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడుతున్నారని సమాచారం. ఐదేళ్ల నుంచి మండుతున్న అసమ్మతిని చల్లార్చి, పార్టీ నాయకుల మధ్య ఐక్యత తీసుకురావడానికి వైఎస్ఆర్సిపి ఎలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News