వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై పెరుగుతున్న కేసులు

ప్రభుత్వం మారడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై నమోదవుతున్న కేసులు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడుతారో అని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Byline :  The Federal
Update: 2024-06-26 11:56 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలలో ఆందోళనలు నెలకొన్నాయి. మాజీలపై కేసులు పెరుగుతుండటంతో ఎప్పుడు ఎవరి మీద కేసులు పెడుతారో అని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులతో ఫిర్యాదులు చేయించి కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.

వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి, నెల్లూరు పట్టణ మాజీ ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై మంగళవారం కేసు నమోదు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్‌ జాన్‌ అనే మహిళ నెల్లూరు చిన్నబజార్‌ సీఐకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలో తమ స్థలంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కడుతున్నారని, ఈ విషయంలో న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నాని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2002లో తన భర్త కొన్న స్థలంలో 2.8 ఎకరాలు ఆక్రమించారని దీనిపై విచారణ జరిపి న్యాయం జరిపించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. సత్యనారాయణ, మరి కొందరితో కలిసి ఎంఓయు పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని హయగ్రీవ కన్‌స్ట్రక్షన్‌ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సత్యనారాయణ, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపైన ఈ నెల 22న విశాఖ పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపైన ఈ నెల 22న పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని, ఆయన అనుచరులు తమను బెదిరించి ఎన్నికల ముందు రాజీనామాలు చేయించారని దాదాపు 20 మంది వాలంటీర్లు గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, కఠారి శేషుకుమార్, కూర్మా రాజులపై గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించేందుకు ప్రచారం చేయాలని, తిరిగి తామే అధికారంలోకి వస్తామని, రాజీనామాలు చేసిన వాళ్లను తిరిగి నియమిస్తామని కొడాలి నాని, ఆయన అనుచరులు తమపై ఒత్తిడి చేశారని, ఈ లోగా ఏప్రిల్, మేల నెలల వేతనం రూ. 10వేలు ఒకే సారి ఇస్తామని ఆశ చూపారని, వారి ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేస్తే నగదు ఇవ్వకుండా మోసం చేశారని వాలంటీర్లు వాపోయారు.
నెల్లూరులో పలువురు కార్పొరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బలవంతంగా ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేశారు. 41వ డివిజన్‌ వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ కే విజయలక్ష్మితో పాటు మరి కొందరు ఆ పార్టీ నేతలపై నెల్లూరు చిన్నబజారు పీఎస్‌లో కేసులు నమోదు చేశారు. 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మొయిల్ల గౌరి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సురేష్‌రెడ్డిపై వేదాయపాళెం పోలీసులు కేసులు నమోదు చేశారు. 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాస్‌ యాదవ్‌పైన నెల్లూరు బాలాజీ నగర్‌ పీఎస్‌లోను, ఫామిదా, వాసంతి తదితర కార్పొరేటర్లపైన దర్గామిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇలా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, కార్పొరేటర్లపైన కేసులు నమోదు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. పోలీసుల కేసులు ఇంతటితో ఆగవని, రాను రాను కేసులు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నారని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడంతో అధికార పక్షం వేధింపులు తప్పవని, వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనే ఆలోచనల్లో ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
Tags:    

Similar News