ఇది ‘చంద్రబాబు’ అనాల్సిన మాటేనా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో చిత్రవిచిత్ర ప్రకటనలు వస్తూ ఉన్నాయి. తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటిస్తూ ఓ మాట అన్నారు.. అదేంటంటే..
By : The Federal
Update: 2024-03-27 05:26 GMT
రాజకీయ నాయకులంతా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారు. ‘ఫలానా రాజకీయ పార్టీ ఎన్నికల ముందు డబ్బు ఇస్తుంది, దాని తీసుకుని మా పార్టీకే ఓటు వేయాలి’ అని పిలుపునిస్తూ ఉంటారు. లేదా మేము అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ మాఫీ చేస్తాం వెంటనే బ్యాంకులకు వెళ్లి అప్పులు తీసుకోమంటారు. ఇవన్నీ పాతపడి పోయాయని అనుకున్నారో ఏమో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో విచిత్ర వాదన తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే డీఎస్సీని ఎన్నికల సంఘాన్ని కలిసి ఆపేయండని, మేము కూడా మాట్లాడతామని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ఏంటో ఈ వాదన అస్సలు అర్థం కాలేదు.. ఎందుకంటే..
ఏ రాజకీయ నాయకుడు అయినా ఇప్పుడు ఉన్నా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, తాము అధికారంలోకి రాగానే మిగిలిన ఖాళీలను గుర్తించి లేదా కొత్త విధానాలతో స్కూళ్ల సంఖ్యను లేదా పోస్టుల సంఖ్యను పెంచి ఖాళీలు సృష్టించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఈ వింత ప్రకటన వచ్చింది. ఓ వైపు ప్రభుత్వం గత పరిపాలన కాలంలో నిరుద్యోగులను మోసం చేసిందని, ఖాళీలను భర్తీ చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూనే, మరో వైపు అదే ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీని మాత్రం నిలిపివేయాలని చెప్పడం ఏంటో?
ప్రతిపక్షాల ప్రకారమే గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులు నష్టపోయారు. ఇప్పుడు అదనంగా మరో మూడు నాలుగు నెలలు ఎందుకు నష్టపోవాలి. ప్రభుత్వ కొలువు సాధించాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదవాలి. మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుంది. ఇంటి దగ్గర పరిస్థితులు బాలేకుంటే ఓ వైపు పని చేస్తూ మరోవైపు చదువుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో కదా. కొంతమంది అయితే ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని రెండు మూడు సంవత్సరాలు కష్టపడి పని చేసి దాచుకున్న సొమ్ముతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారికి ఒక్కో నెలా చాలా ముఖ్యమైంది. ఓ వైపు మనీ అయిపోతూ ఉంటుంటే.. ఇంకోవైపు ఆత్మవిశ్వాసం తగ్గుతూ వస్తుంది.
చంద్రబాబు నాయుడు కుప్పంలో ప్రచారంలో చెప్పినట్లుగా ఆయన అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని నిర్వహిస్తే మంచిదే. కానీ ఇప్పుడు నిర్వహిస్తున్న డీఎస్సీని వద్దనడం ఎంతవరకూ సబబు. ఒకవేళ బాబుగారు అన్నట్లు ఇప్పుడున్న డీఎస్సీని ఆపేసి, నాయుడుగారు అధికారంలోకి రాగానే జరిగేదేంటీ? మొదట పాత డీఎస్సీని రద్దు చేయాలి.. తరువాత 1.50 ఖాళీలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి.
తరువాత వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలి తరువాత జరిగే తతంగం అంతా మనకు తెలుసు కాబట్టి మరో నాలుగు ఐదు నెలలు సమయం పడుతుంది. పరీక్షకు మరో నాలుగు నెలల సమయం పడుతుంది అనుకున్నా.. మొత్తానికి సంవత్సరం కాలం వృథా అవుతుంది. రాజకీయ నాయకులకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పరీక్ష ఉంటుంది. కానీ నిరుద్యోగులకు జీవితకాలంలో ఒకే పరీక్ష ఉంటుంది. ఒకే సమయం ఉంటుంది. అది మిస్ అయితే.. లైఫ్ ఎటు పోతుందో ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి రాజకీయ నాయకుల్లారా మీరు మమ్మల్ని వదిలేయండి. మీ రాజకీయాలు మీరే చేసుకోండి.. ప్లీజ్