నెల్లూరులో జికా వైరస్..భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి ఆనం
మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో అనారోగ్యానికి గురైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి పంపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో జికా వైరస్ ప్రచారం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అనారోగ్యానికి గురైన బాలుడుని చెన్నై తరలించామన్నారు. వ్యాధి నిర్థారణ కోసం వైద్యాధికారులు బాలుడి రక్తం నమూనాలను తీసుకున్నారని, వాటిని పూణే ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. నెల్లూరు జీజీహెచ్ వైద్య బృందాలతో పాటు మర్రిపాడు వైద్య బృందాలు వెంకటాపురం గ్రామానికి వెళ్లాయని, బాలుడి కుటుంబంతో పాటు గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.