ప్రాథమిక సంఘాల పటిష్టతే సహకార వ్యవస్థకు జీవం

ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయడమే నాఫ్స్కాబ్ లక్ష్యంగా ఉండాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. నాఫ్స్కాబ్ వజ్రోత్సవాలను ఆయన ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు

Update: 2024-11-27 05:20 GMT
Union Home, cooperative Minister Amit Shah is launching NAFSOB Diamond Jubilee celebrations at New Delhi on 26th November 2024.(Photo Curtesy- AKBAR PASHA)
(న్యూఢిల్లీ నుంచి అక్బర్ పాషా)
ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయడమే నాఫ్స్కాబ్ లక్ష్యంగా ఉండాలన్నారు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా. నాఫ్స్కాబ్ వజ్రోత్సవాలను ఆయన నవంబర్ 26న ఢిల్లీ ప్రగతిమైదాన్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
"ఏ సంస్థ అయినా జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నపుడు రెండు ప్రధాన ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుంటుంది. తను సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచుతుంది. గడచిన కాలంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటుంది. వాటి నుంచి పొందిన గుణపాఠాల ద్వారా తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో సంస్థ నిర్ణయించుకోవటం అవసరం. దేశంలో మూడంచెల సహకార వ్యవస్థ సేవలే అంది వుండకపోతే వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ అభ్యున్నతి, రైతుల సంక్షేమం గత 75 ఏళ్లుగా ఈ స్థాయికి చేరి వుండేది కాదు.

ఇంత విశాల దేశంలో సుమారు 11 కోట్ల మంది రైతులకు ఇలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా స్వల్పకాలిక పంట రుణాలు సజావుగా అందుతూ వ్యవసాయ రంగం ప్రగతి సాధిస్తోందంటే అది సహకార రంగం ప్రాణప్రతిష్ట చేయటమేనని చెప్పటంలో సందేహం లేదు. ఈ నేపథ్యం వెనుక దాగి వున్న నాఫ్స్కాబ్ రథసారథుల కృషిని వజ్రోత్సవాల సందర్భంలో నేను అభినందిస్తున్నాను.
కేవలం వ్యవసాయ రుణాలకే పరిమితం కాకుండా సామూహిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడం, రైతులకు వ్యవసాయ పరికరాలు అందించడం, వ్యక్తిగత ఆర్థిక అవసరాలు తీర్చడంలోనూ రాష్ట్ర సహకార బ్యాంకుల మార్గదర్శకత్వంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రభుత్వ సంఘాలు పోషించిన పాత్ర అసామాన్యమైనది. సహకారం ద్వారా సమృద్ధి - సమృద్ధి ద్వారా సంపూర్ణ ఆర్థిక వికాసం సాధించాలనే ఉద్దేశమే కేంద్రంలో సహకార శాఖ ఏర్పాటుకు పురుడు పోసింది.
2027 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం మూడో స్థానానికి చేరాలే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము. సహకారం మంత్రిత్వ శాఖ ఏర్పాటు వెనుక ప్రధానోద్దేశం కూడా ఇదే. మీ ఏ కొందరి ఆర్థిక ప్రగతినో కోరుకోవడం లేదు. దేశంలోని రైతులు, దళితులు, మహిళలు, ఇతర బలహీన వర్గాల సమగ్ర ఆర్ధిక అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళుతున్నాం. గ్రామ స్వరాజ్యం రామరాజ్యం లక్ష్యాలను గాంధీజీ మనముందుంచారు. ఈ లక్ష్యాన్ని చరితార్థం చేయటం కోసమే ప్రధాని మోదీ 2021లో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖకు తొలి మంత్రిగా పనిచేయడం నా జన్మసార్థకంగా భావిస్తున్నాను. మోదీ మూడోసారి ప్రధాని కావటం సహకార వ్యవస్థకు నిజంగా శుభ సందర్భం. ఇపుడు మన సహకార వాహనం వేగంగా దూసుకెళ్ళాలి. అయితే బ్రేకు, ఎక్సలేటర్ పై కూడా మనం దృష్టిపెట్టాలి.
మనముందు ప్రధానంగా రెండు రకాల అవరోధాలున్నాయి. చట్టాల్లో లోపాలు, 75 ఏళ్లలో పేరుకుపోయిన తప్పులు. వీటిని మనం సరిదిద్దుకుంటే వచ్చే ఐదేళ్లలో భారతదేశం సహకార రంగంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అమూల్, ఇఫ్కో, క్రిభ్కో, రాష్ట్ర, జిల్లా శాఖ బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలు ఈ దిశలో గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. 1964లో నాఫ్స్కాబ్ ను స్థాపించడంలో డాక్టర్ గాడ్గిల్, మదన్ భాయ్ పటేల్ దూరదృష్టితో చేసిన కృషిని ఈ సందర్భంలో మనం స్మరించుకోవాలి. రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, ప్యాక్స్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ రుణ వితరణలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం, భద్రపరచడంలో దేశంలో నాఫ్స్కాబ్ కు మించిన సంస్థ మరొకటి లేదు. వీటి డేటాను పారదర్శకంగా, శుద్ధంగా భద్రపరిచారు.
కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన సందర్భంలో నేను ఈ డేటాను పరిశీలించినప్పుడు వీరు చేసిన కృషిపై ఆశ్చర్యం కలిగింది. వీరి డేటా 99.72 శాతం కచ్చితత్వంతో వుండటం దేశంలోని ప్యాక్స్ కంప్యూటరీకరణకు మాకు ఉపయోగపడింది. ఇది చాలా గొప్ప విజయం. వీరి డేటాను థర్డ్ పార్టీగా మేము పరిశీలించటం, అది 99.72 శాతం కరెక్ట్ గా వుందని గ్రహించడం బహుశా రవీందర్ రావుకూ తెలియదు. నాబార్డ్, ఆర్బీఐ అధికారుల వద్ద కూడా ఇంత సమాచారం లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. సహకార సంఘాల సమస్యలను పరిష్కరించడం, దిశానిర్దేశం చేయడం, రణనీతిని రూపొందించడం కోవడమే నాఫ్స్కాబ్ ను నాడు స్థాపించారు. నాబార్డ్, ఆర్బీఐ సహా దేశంలోని ఆర్థిక సంస్థలన్నీ నాఫ్స్కాబ్ తో కలిసి పనిచేస్తూ ముందుకు సాగాల్సిన అవసరముంది. సహకార సంస్థలకు ప్యాక్స్ నే ఆత్మ వంటిది. వీటి కంప్యూటరీకరణ, పాలనలో పారదర్శకత రానంతకాలం రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులో బలపడే పరిస్థితి వుండదు. కంప్యూటరీకరణ సాఫ్ట్ వేర్ ను ఎనిమిది భాషల్లో రూపొందించాము. నాబార్డ్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. టాక్స్ లో కంప్యూటర్ పనివిధానాన్ని తక్షణం బలపరచాల్సిన అవసరముంది. దేశంలో ప్యాక్స్ ను ప్రతి గ్రామానికీ విస్తరిస్తూ రెండు లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

దేశంలో 60 లక్షల ప్రాధమిక సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నప్పుడే మనం ఇంత ప్రగతి సాధించినపుడు రెండు లక్షల సంఘాలు స్థాపిస్తే అభివృద్ధి వేగం ఎంతగా ఉంటుందో మీరే ఊహించండి. నాఫ్స్కాబ్ ప్రధాన ఉద్దేశం ప్యాక్స్ ను కంప్యూటరీకరించడం, ఆధునికరించడం, పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడడమే. నాఫ్స్కాబ్ తీసుకునే ఎటువంటి నిర్ణయాన్నైనా భారత ప్రభుత్వం సహకరించి ముందుకు తీసుకువెళుతుంది. రైతులకు దీర్ఘకాలిక రుణ సదుపాయం కల్పించాలి. ఈ వ్యవహారంలో ప్యాక్స్ కి స్థానం కల్పించాలి. దేశం ఆర్థిక ప్రగతి సాధించడంలో సహకార సంఘాల పాత్రే ప్రధానమైందని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కొండూరు రవీందర్ రావు,నాఫ్స్కాబ్ ఛైర్మన్...
నాఫ్స్కాబ్ ఛైర్మన్ రవీందర్ రావు స్వాగతోపన్యాసం చేశారు. దేశంలో సహకార వ్యవస్థ బలోపేతం చేయడానికి తాము కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. సహకార వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లడానికి దేశంలోని అన్నీ ఆర్థిక సంస్థలతో పాటు కేంద్రప్రభుత్వంతోనూ కలిసి పని చేయడానికి సిద్ధం ఉన్నామన్నారు. నాఫ్స్కాబ్ వజ్రోత్సవం సందర్భంగా తాను ఛైర్మన్ గా ఉండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. కేంద్రమంత్రి ఆర్ధిక మంత్రి అమిత్ షా సమక్షంలో తాము ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా భావిస్తున్నాం అని రవీందర్ రావు చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన నాఫ్స్కాబ్ నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. తమది బాధ్యతాయుత సంస్థగా చెప్పారు. దేశంలో మరే సంస్థా చేయని కృషిని గత 40 ఏళ్లలో నాఫ్స్కాబ్ చేసి చూపిందన్నారు.
భీమా సుబ్రమణ్యం, నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్
నాఫ్స్కాబ్ గత 40 ఏళ్లలో సాధించిన కృషిని కేంద్ర సహకార, హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించడం పట్ల నాఫ్స్కాబ్ ఎండీ భీమా సుబ్రమణ్యం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంలో ఆయన వేదికపై ఆశీనులైన నాఫ్స్కాబ్ మాజీ ఛైర్మన్, ఎన్.సి.యూ.ఐ., ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ సంఘానీ, కేంద్ర సహకార శాఖ కార్యదర్శి అశిష్ భూటానీ, కేంద్ర సహాయ మంత్రులు కృష్ణపాల్, మురళీధర్ మహోల్, అంతర్జాతీయ సహకార సమాఖ్య (ఐసీఏ) అధ్యక్షుడు ఏరియల్ ఆర్కోల్ కి అభినందనలు తెలిపారు.

నాఫ్స్కాబ్ తన ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించిందన్నారు. ప్యాక్స్ అభివృద్ధి కోసం నాఫ్స్కాబ్ చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలుగు రాష్ట్రాల సహకార సంస్థలకు నాఫ్స్కాబ్ అవార్డులు
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్స్కాబ్) 60ఏళ్ల ఉత్సవ వేడుకలు కొత్త ఢిల్లీలోని భారత్ మండపం సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత సహకారవేత్తలు కొండూరు రవీంద్రరావు, భీమా సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్న ఈ జాతీయ సహకార సంస్థ 60ఏళ్ల వేడుకలను కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉత్తమ సేవలకు గాను నాఫ్స్కాబ్ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను ఇదే వేదికపై మంత్రి అమిత్ షా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) మూడో బహుమతి పొందింది. ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మొదటి బహుమతిని, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మూడో బహుమతిని పొందాయి. కరీంనగర్ డిసిసి పొందిన అవార్డును అధ్యక్షులు రవీందర్ రావు, సీఈవో సత్యనారాయణ రావు కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. కెడిసిసి బ్యాంక్ బహుమతిని పర్సన్ ఇంచార్జ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు.
Tags:    

Similar News