లాయర్లకు నో ఎంట్రీ..విచారణకు జయసుధ

ఎట్టకేలకు పేర్ని జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు.;

Update: 2025-01-01 12:56 GMT

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేషన్‌ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పేర్ని జయసుధ ఏ1గా పోలీసులు చేర్చారు. గత ఎన్నికల ముందు వరకు కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కేసు నమోదు కావడం, విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం, దీంతో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు హాజరు కావడం మచిలీపట్నంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కోర్టు ఆదేశాల మేరకు పేర్ని జయసుధ తమ న్యాయవాదులతో కలిసి విచారణ నిమిత్తం బుధవారం మచిలీపట్నంలోని రాబర్ట్‌సన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే జయసుధ న్యాయవాదులను మాత్రం పోలీసులు లోపలికి అనుమతించ లేదు. పేర్ని జయసుధను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. రాబర్ట్‌సన్‌ పోలీసు స్టేషన్‌ సిఐ ఏసుబాబు జయసుధను విచారిస్తున్నారు. రేషన్‌ బియ్యం మాయమైన అంశంపై జయసుధ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య పేర్ని జయసుధ పేరు మీద గోడౌన్‌లు నిరించారు. దీనిలో రేషన్‌ బియ్యం మాయమయ్యాయని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, మాజీ మంత్రి పేర్ని నాని అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పేర్ని జయసుధ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అలాంటింది ఆమెను ఎంత సేపు విచారిస్తారని వారు పోలీసులను ప్రశ్నించారు. జయసుధ తరపున న్యాయవాదులు కూడా ఎంత సేపు ప్రశ్నిస్తారని అసహనం వ్యక్తం చేశారు. లోపల విచారణ జరుగుతున్న సయమంలో లోపలికి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్‌కు పేర్ని జయసుధ ఓ ప్రభుత్వ వాహనంలో వెళ్లడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోమవారం పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూ చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. మరో వైపు విచారణకు హాజరు కావాలంటూ మంగళవారం రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జయసుధ విచారణకు హాజరయ్యారు.

Tags:    

Similar News