కుటుంబాల్లో రాజకీయ చిచ్చు

అన్యోన్యంగా ఉన్న కుటుంబాలు విడిపోతున్నాయి. రాజకీయ అధికారమే అల్టిమేట్‌గా కత్తులు దూసుకుంటున్న కుటుంబ సభ్యులు

Byline :  The Federal
Update: 2024-04-28 06:20 GMT

సార్వత్రిక ఎన్నికలు కొన్ని రాజకీయ కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. అన్నా చెల్లిళ్ల మధ్య, తండ్రి కూతు, కొడుకుల మధ్య, అన్నా తముళ్ల మధ్య బంధాలు, బంధుత్వాలను తెగదెంపులు చేస్తున్నాయి. రాజకీయాలు, రాజ్యాధికారమంటేనే బంధువులు, బంధుత్వాలను తెంచుకోవడం అయిపోతోంది. అధికారం కరుడు గట్టిన నీచపు బుద్ధిని బయటకు తీసుకొస్తుంది. అధికారం ముందు ఎవ్వరూ కనిపించరు. అధికారం ఒక్కటే కంటి ముందు కనిపిస్తుంటుంది. దాని చేజిక్కుంచుకోవడానికి తనా, మనా తేడా తెలియకుండా ప్రవర్తిస్తారు. దీనికి ఫ్యాషన్‌గా రాజకీయమని పేరు పెట్టారు. ఒక సినిమాలో చెప్పినట్లు.. రాజకీయమంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అని పరచూరి గోపాల కృష్ణ ఒక పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ చెబుతారు. నేటి రాజకీయాలకు అది సరిగ్గా సరిపోతుంది. కీడు మాట అటుంచినా.. తనకు తాను రాజకీయంగా మనుగడ సాగించుకోడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బంధుత్వాలను సైతం తెజించడం పరిపాటిగా మారింది. రాజకీయాలకు ఇస్తున్న విలువ బంధుత్వాలకు ఇవ్వక పోవడం బాధగానే అనిపిస్తుంది. లేకుంటే కుటుంబాల్లో చిచ్చు పెట్టే రాజకీయాన్ని వదిలేయడానికి ఏ ఒక్కరు ఇష్టపడటం లేదు. ఒక్క సారి అధికారం అనుభవించిన తర్వాత తిరిగి వదులుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇష్టపడటం లేదు. ఫైనల్‌గా రాజకీయాధికారాన్నే అల్టిమేట్‌గా భావిస్తున్నారు.

రచ్చ కెక్కిన జగన్, షర్మిల
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంధుత్వాలకు, బంధాలకు తిలోదకాలు ఇచ్చారనే అపవాదు దేశ వ్యాప్తంగా వ్యాపించింది. సీఎం పీఠమెక్కగానే చెల్లెలు షర్మిలను దూరం పెట్టారు. తల్లిని కూడా దూరం చేసుకున్నారు. మిగిలిన బంధువులు గతంలో మాదిరిగా దగ్గరకు రావడం లేదు. అధికారం అందగానే మా గురించి ఆలోచించడం, మా అన్న మానేశాడు. అధికారంకు వచ్చే ముందు చిన్నాన్న హత్య జరిగితే అధికారం చేపట్టిన తర్వాత విచారించి చర్యలు తీసుకోవడమే మానేశాడని, నిందితులకు కొమ్ము కాస్తూ, నిందితులను పక్కన కూర్చొ పెట్టుకొని ప్రత్యేక స్థానమిస్తున్నాడంటే అధికార పీఠమెంత బలీయమైనదో బంధాలను ఎలా తెంపుకుంటున్నాడో చిన్నాన్న కూతురని చూడకుండా సునీతను, నన్ను హేళన చేస్తూ ఎలా మాట్లాడుతున్నాడో చూడాలని జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల స్వయంగా మాట్లాడటం మరో విశేషం. అన్న తమను పట్టించుకోవడం లేదని చెప్పిన చెల్లెలు రాజకీయాలకు దూరంగా ఉన్నారంటే అదీ లేదు. అన్నకు ధీటుగా కాంగ్రెస్‌లో చేరి సవాలు విసురుతోంది. ఇలా వారిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. ఈ అగాధం మధ్య ఎటు పోవాలో తెలియక తల్లి విలవిలలాడుతోంది. ఇది వైఎస్‌ కుటుంబంలో పొడచూపిన రాజకీయ చిచ్చు.
బద్ద శత్రువులుగా మారిన సోదరులు
నెల్లూరు జిల్లా మేకపాటి కుటుంబానిది రాజకీయ కుటిల నీతికి నిదర్శనమే. అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు నుంచి చక్రం తిప్పిన వారే. రాజమోహన్‌రెడ్డి ఢిల్లీ రాజకీయాలపై పట్టు సాధించగా, చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించేలా చేశారు. మేకపాటి కుటుంబం రాజకీయాల్లోనే కాMýంండా వ్యాపార రంగంలో కూడా కలిసిమెలిసి ఉండేదని వారి సన్నిహితులు చెబుతుంటారు. రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా పని చేస్తూ అకాల మరణం చెందారు. అన్న కుమారుడు మృతి చెందిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న తనకు మంత్రిగా అవకాశం వస్తుందని చంద్రశేఖర్‌రెడ్డి భావించారు. గౌతమ్‌రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డికి జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రిపదవి రాలేదు. అన్న రాజమోహన్‌రెడ్డి తన స్వార్థం చూసుకున్నారే తప్ప తన గురించి ఆలోచించ లేదని చంద్రశేఖర్‌రెడ్డి వేరు కుంపటికి సిద్ధపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా పని చేయడం మొదలు పెట్టారు. దీంతో అన్నా తమ్ముళ్ల మధ్య రాజకీయ శత్రుత్వం పెరిగింది. విడిపోక తప్ప లేదు. అన్న వైఎస్‌ఆర్‌సీపీకి నాయకత్వం వహిస్తుండగా, తమ్ముడు టీడీపీకి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ను మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి రాజమోహన్‌రెడ్డి ఇప్పించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయనను ఓడించి అన్న రాజమోహన్‌రెడ్డికి బుద్ది చెప్పాలనే ఆలోచనలో చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.
ప్రత్యర్థులుగా మారిన కేశినేని బ్రదర్స్‌
విజయవాడలో కేశినేని సోదరుల మధ్య కూడా ఇలాంటి పరిణామాలో చోటు చేసుకున్నాయి. కేశినేని నాని రెండు సార్లు పార్లమెంట్‌ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో తమ్ముడు కేశినేని చిన్ని సహకరించాడు. ఈ ఎన్నికల్లో ఏమైందో అన్నా తమ్ముళ్లు విడిపోయారు. కేశినేని నానిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడంతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్‌ చేతుల మీదుగా బిఫారమ్‌ తీసుకొని పోటీలోకి దిగారు. చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించి విజయవాడ నుంచి ఎన్నికల రంగంలోకి దించారు. అన్నా తముళ్ల మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. వీరి మధ్య రాజకీయ యుద్ధం మొదలు కావడానికి అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్‌ కారణమని పైకి రాజకీయ వర్గాలు మాట్లాడుతున్నా.. ఎప్పటి నుంచో రాజకీయ ఆధిపత్యం కోసం ఒకరికి తెలియకుండా ఒకరు మనసుల్లో కత్తులు పెట్టుకొని పోరాటం చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఇప్పుడది పదవుల రూపంలో బయట పడింది. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది.
విడిపోయిన యనమల రామకృష్ణుడు, కృష్ణుడు
రాజకీయాల్లో తనకు తానే సాటి అనిపించుకున్న టీడీపీ నేత మాజీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడు తమ్ముడుతో బంధాన్ని తెంచుకున్నాడు. తన కుమార్తె కోసం తమ్ముడిని పక్కన పెట్టడంతో మనస్సు నొచ్చుకున్న యనమల కృష్ణుడు వైఎస్‌ఆర్‌సీపీలో చేరి తునిలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు కంకణం కట్టుకున్నాడు. తన అన్న కుమార్తెకే సీటొచ్చిందనే ఆలోచన ఆయన వదిలేశారు. 42ఏళ్లు రాజకీయంగా నన్ను వాడుకొని అన్న రామకృష్ణుడు కరివేపాకులా పక్కన పడాశాడని, నా భవిష్యత్‌ కోసం నేను వైఎస్‌ఆర్‌సీపీలో చేరి పోరాటం మొదలు పెట్టానని కృష్ణుడు ప్రకటించడం విశేషం. ఎన్నో ఏళ్ల బంధాన్ని రాజకీయం అడ్డు గోడగా నిలిచి ఇరువురిని విడదీసింది.
కుటుంబంలో రాజకీయ చదరంగం
బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిచితులు. ఆయనకు రాజకీయం కష్టాలను తెచ్చి పెట్టింది. కొడుకు కూతురు బద్ద శత్రువులయ్యారు. ఇరువురూ తండ్రిగా ముత్యాల నాయుడిని ద్వేషిస్తున్నారు. ముత్యాలనాయుడు అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ తరపున రంగంలోకి దిగగా మొదటి భార్య కుమారుడు రవికుమార్‌కు మాడుగుల టికెట్‌ ఇప్పించలేదనే బాధ ఉంది. రెండో భార్య కుమార్తె అనురాధకు ఆ టికెట్‌ ఇప్పించాడు. తనకు కాకుండా తన తండ్రి తన అక్కకు టికెట్‌ ఇప్పించడాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు ఆమెను ఎన్నికల్లో ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు. ఇద్దరిని సముదాయించడం చేత కాక తండ్రి సతమతమవుతున్నాడు. అలాగని రాజకీయాల నుంచి వైదొలగ లేడు. రాజ్యాధికారం కోసం జరిగే పోరులో తండ్రి కూతురు, కొడుకు శత్రువులుగా మారారు. బాంధవ్యాలు మరిచి పోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇలా అనేక చోట్ల అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారం కోసం జరిగే పోరులో బంధువులు, బంధాలు అనే మాటలకు తావే లేదని రాజకీయాలు నిరూపిస్తున్నాయి.
Tags:    

Similar News