వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాజీనామా ఆమోదం- బీజేపీ వైపు చూపు
ఆంధ్రప్రదేశ్ తో ఏమాత్రం సంబంధం లేని ఆర్.కృష్ణయ్యను బీసీ నేతగా భావించి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చి ఆ వర్గాల ఆదరణ పొందాలని చూస్తే ఇప్పుడాయన రాజీనామా చేశారు.;
By : The Federal
Update: 2024-09-24 16:31 GMT
పిలిచి పిల్లనిస్తే ఎత్తి కుదవేశారన్న మోటు సామెత ఒకటుంది. బహుశా ఆర్.కృష్ణయ్య అనే బీసీ నాయకుడికి ఇది సరిగ్గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ఇది మరో విఘాతమే. ఆంధ్రప్రదేశ్ తో ఏమాత్రం సంబంధం లేని ఆర్.కృష్ణయ్య బలహీనవర్గాల ప్రతినిధిగా భావించి ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇచ్చి బీసీ వర్గాల ఆదరణ పొందాలని చూస్తే ఇప్పుడాయన రాజీనామా చేసి బీజేపీ లేదా తెలుగుదేశం వైపు చూస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అసలే అస్తవ్యస్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నిజంగా ఎదురుదెబ్బే. వైసీపీ నుంచి ఎంపికైన రాజ్యసభ సభ్యుడు ర్యాగ కృష్ణయ్య తన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య చేసిన రాజీనామాను చైర్మన్ జగదీప్ ధంఖడ్ ఆమోదించారు. సెప్టెంబర్ 23 నుంచే ఆయన రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంటరీ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం సాయంత్రం తెలిపింది. దీంతో గత నెల రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య మూడుకు చేరింది. ఆగస్టు 29న ఇద్దరు సీనియర్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఎంపీ స్థానాలతో పాటు వైసీపీ ప్రాధమిక సభ్యత్వాలకూ రాజీనామా చేశారు.
ఇప్పుడు ఆర్. కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేశారు. పార్టీకి ఇంకా చేయలేదు. వందకు పైగా బీసీ సంఘాల ప్రతినిధులతో చర్చించి రాజ్యసభకు రాజీనామా చేసినట్టు చెబుతున్న కృష్ణయ్య పార్టీ నుంచి ఫిరాయించే విషయమై ఇంకా చర్చించాల్సి ఉందని న్యూఢిల్లీలో విలేకరులకు తెలిపారు.
అయితే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. మరో ఇద్దరు ఎంపీలు వెంకటరమణ, మస్తాన్‌రావు అధికార తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రకటించారు.
బీజేపీలో చేరే యోచన
కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. కృష్ణయ్య జూన్ 2022లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన పదవీకాలం 2028లో ముగుస్తుంది. జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్య 2014లో ఎన్నికల రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2022లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జగన్ తరఫున ఏలూరులో పెట్టిన బీసీల మహాసభకు హాజరై వైసీపీని పొగిడారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు చెబుతున్నారు.