కోడిపందాల్లో ఎన్ని కోట్లు చేతులు మారతాయో తెలుసా? విస్తరించడానికి కారణమదేనా?
కోడిపందాలంటే ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు, వందల కోట్ల వ్యాపారం. ఆరు నెలల ముందు నుంచే సన్నాహాలు, క్రికెట్ స్టేడియాలను తలపించే బరులు.;
By : The Federal
Update: 2025-01-11 10:19 GMT
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, బోగి మంటలే కాకుండా కోడిపందాలు కూడా అని చెప్పేస్తుంటారు. అంతగా కోడిపందాలు ఇప్పుడు సంక్రాంతిలో భాగమయిపోయాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన కోడిపందాలంటే ఒకనాడు సంప్రదాయం. ఆ తర్వాత సంస్కృతిలో భాగం. కానీ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యవహారం. వందల కోట్లు చేతులు మారే సందర్భం. మూడు రోజుల్లోనే 300 కోట్ల పందాలకు కేంద్రం. సామాన్యులు కలిసిమెలిసి సరాదాగా నిర్వహించుకునే కోడిపందాలు ఇప్పుడెందుకింత ఆర్భాటపు వ్యవహరంలా మారాయి.
కార్పోరేట్ జూదంగా మారిందన్నది కీలకమైన ప్రశ్న.సుదీర్ఘ చరిత్రకోడిపందాలు ఈనాటివి కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ పందాల నిర్వహణ ఉంది. 6వేల ఏళ్ల క్రితమే పర్షియన్ సంస్కృతిలో కోడి పందాల ప్రస్తావన ఉంది. తెలుగునాట కూడా పల్నాటి యుద్ధంలోనూ కోడిపందాల గురించి ఉంది. అంతటి చరిత్ర ఉన్న కోడిపందాలు అప్పట్లో పంతాలకు, పౌరుషాలకు కేంద్రంగా సాగేవి. వివిధ కాలాల్లో కోడిపందాలు పరువు, ప్రతిష్టకు చిహ్నాలుగా మారుతూ వచ్చాయి. కానీ కాల క్రమేణా అన్నీ మారిపోయినట్టుగానే కోడిపందాల్లో కూడా అనేక మార్పులు వచ్చేశాయి. ఇప్పుడవి కోట్ల రూపాయల జూదంగా పరిణమించాయి. తెలుగు సంస్కృతిలో కోడిపందాల ప్రస్తావన ఉంది. కానీ ఇప్పుడు సంస్కృతిని మించిపోయి కోట్లు కురిపించే వ్యాపారంగా మారిపోయాయి. రాజకీయ నేతల ఆధిపత్యం చాటుకునే సందర్భంగా తయారయ్యాయి. యంత్రాంగం చేతులు కట్టేసి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు కేంద్రంగా మలిచేశారు.
వెయ్యి కోట్ల వ్యాపారం!
కోడిపందాలంటే సంక్రాంతికి మూడు రోజుల పాటు సరదాగా జరుపుకునే విషయం కాదిప్పుడు. ఏడాది పొడవునా ఏదో మూల పందాలు జరుగుతూనే ఉంటున్నాయి. అరకొరగా పోలీసులు దాడులు చేసి అడ్డుకుని, అరెస్టుల వరకూ వెళుతున్న తీరు అందుకు అద్దంపడుతోంది. అయితే సంక్రాంతి కోడిపందాల కేంద్రాలు కేవలం కోడితో పందాలకే పరిమితం కాకుండా అన్ని రకాల జూద క్రీడలకు కేంద్రంగా మార్చేస్తున్నారు. కోడి పందాల పేరుతో కోళ్ళ మీద పందాలు కాయడం ఓ భాగమైతే, పేకాట, కోతాట, గుండాట వంటి జుదాలు యధేశ్ఛగా సాగుతున్నాయి.కోడి పందాలకు పుంజులను సిద్ధం చేయడం ఇప్పుడో కుటీర పరిశ్రమ. విదేశీ జాతుల కోళ్లను కూడా దిగుమతి చేసుకుని పందాలను సన్నద్ధం చేయడంలో వందల మంది ఉపాధి పొందుతున్న దశ వచ్చేసింది. వివిధ రకాల కోళ్లను పెంచుతూ, పందాలకు తగ్గట్టుగా వాటికి తర్ఫీదునిచ్చే నిపుణులు తయారయ్యారు. కోడి కత్తుల తయారీ నుంచి వాటిని కోడి కాళ్లకు కట్టడం వరకూ అంతా ఇప్పుడు అనేక మందికి స్వయం ఉపాధి కార్యక్రమంగా మారింది.
ఆంధ్రా, తెలంగాణా నుంచే కాకుండా దేశ, విదేశాల్లో స్థిరపడిన వేల మంది ఈ కోడిపందాల కోసం గోదావరి జిల్లాలకు తరలివస్తుంటారు. మూడు రోజుల్లో పందాల కారణంగా దాదాపు రూ. 600 కోట్ల వరకూ చేతులు మారినట్టు గత ఏడాది లెక్కలు. ఈసారి అవి మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కోడిపందాలు జరిపే ప్రాంతాన్ని బరులు అంటారు. అలాంటి బరులు గత ఏడాది కన్నా ఈసారి వందల సంఖ్యలో పెరుగుతున్నాయి. బరులు కూడా భారీ హంగామాతో ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్ స్టేడియాలను తలపించే ప్రాంగణాలు, ఫ్లడ్ లైట్లు, వేలమంది చూసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు, ఫెన్సింగ్ సహా పెద్ద మొత్తంలో వెచ్చించి వాటిని సిద్ధం చేస్తున్నారు.
రాజకీయ పట్టు చాటిచెప్పే బరులు
ఏ పార్టీ నాయకుడు అధికారంలో ఆపార్టీ శ్రేణులే ఈ కోడిపందాల బరి నిర్వహణలో ముందుంటారు. వారి పెత్తనమే చెల్లుతుంది. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఏర్పాటు చేసే బరుల మీద పోలీసులను ఉసిగొల్పిన సందర్భాలున్నాయి. దాంతో ఇప్పుడు కోడిపందాల బరుల్లో కూడా అధికారపార్టీ హవానే ఉంటుంది. లక్షల రూపాయలు వెచ్చించి బరులు సిద్ధం చేసిన వాళ్లకు ప్రతీ పందెంలోనూ చేతులు మారే మొత్తంలో కొంత పర్సంటేజ్ చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని కేవులు(తీతలు) అని పిలుస్తుంటారు. తద్వారా 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసి బరులు ఏర్పాటు చేసిన వారు మూడు రోజుల్లో అరకోటి వరకూ సంపాదించే మార్గం ఉంటుందని అంచనా. బరుల నిర్వాహకులు వసూలు చేసే మొత్తంలో కొంత మొత్తం స్థానిక రాజకీయ నేతలకు, పోలీసులకు, కొన్ని సందర్భాల్లో మీడియా వాళ్లకు కూడా అందుతాయి. దాంతో కోడిపందాల పేరుతో జరిగే జూద క్రీడల గురించి, ఆ పందాల కారణంగా చితికిపోతున్న కుటుంబాల గురించి పెద్దగా ప్రస్తావన ఉండడం లేదని రాజమండ్రికి చెందిన అడ్వకేట్ ఉమా మహేశ్వరి అన్నారు.
"ఈసారి ఏపీలో కూటమి అధికారంలో ఉండడం వల్ల టీడీపీ వాళ్ల హవా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ వాళ్లు సైలెంట్ అయిపోయారు. జనసేన కూడా సందడి చేస్తుంది. ఇలా బరుల నిర్వాహణ ద్వారా కొంత మంది పాలకపార్టీ నేతలకు ఉపాధి మార్గంగా తయారయ్యింది. కానీ కోడిపందాల కారణంగా వందల కుటుంబాలు చితికిపోతున్నాయి. అనేక మంది జూదమనే వ్యసనంలో కుటుంబాలను నాశనం చేస్తున్నారు. కోడిపందాలు ముగిసిన తర్వాత రెండు మూడు నెలలకు ఆర్థికంగా దివాళా తీసిన వారి కేసులు అనేకం మా దగ్గరకి వస్తుంటాయి" అంటూ ఆమె ది ఫెడరల్ కి వివరించారు.
న్యాయస్థానాల ఆదేశాలున్నప్పటికీ రాజకీయ నేతలు, పోలీస్ యంత్రాంగం అంతా ఒక్కటయ్యి సంస్కృతి, సంప్రదాయం అంటూ జూదాలకు బరితెగించి ప్రోత్సహించినట్టు కనిపిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరి జిల్లాలకే పరిమితం కాలేదు..
గడిచిన రెండు దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోడిపందాలకు మరింత ప్రచారం దక్కింది. రియల్ ఎస్టేట్ వంటివి విస్తరించిన తర్వాత పందాల్లో పాల్గొనే వారి సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. సెలబ్రిటీల సందడి కూడా మొదలయ్యింది. ఇవన్నీ కలిసి కోడిపందాలకు గ్లామర్ అద్దడం వల్ల మరింత మంది వాటివైపు మళ్లుతున్నారు. అదే సమయంలో గ్రామీణ సంప్రదాయ క్రీడలన్నీ పడకేశాయి. పల్లెల్లో ఇప్పుడు సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలన్నట్టుగా మారినట్టు గోదావరి వాసులు చెబుతుంటారు.ఇటీవల ఈ కోడిపందాలు కేవలం గోదావరి జిల్లాలకే పరిమతం కాకుండా, కృష్ణా-గుంటూరు, విశాఖ జిల్లాలకు విస్తరించాయి. ఈసారి విజయనగరం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల కోడిపందాల బరులు ఏర్పాటు చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అంటే ఈ వ్యవహారం మరింత విస్తరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
"కోడిపందాల దగ్గరే బెల్ట్ షాపులు నడుపుతారు. ఇతర అన్ని రకాల వ్యసనాలకు కేంద్రంగా బరులుంటాయి. ఇప్పుడది మరింత విస్తరిస్తోంది. ప్రతీ చిన్న గ్రామంలోనూ ఆ ఊరి స్థాయిని బట్టి కోడిపందాల బరులు సిద్ధం చేసేశారు. గోదావరి జిల్లాలకు తోడుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల వాళ్లు కూడా మొదలెడుతున్నారు. క్రమంగా ఇది మరింత విస్తరిస్తోంది. నిలుపుదల చేయాలి. లేదంటే చాలా కుటుంబాలు చిక్కుల్లో పడతాయి. నిర్వాహకులు పోలీసులు, కొందరు రాజకీయ నేతలు బాగుపడతారు. సామాన్యులు చితికిపోతారు" అంటూ సామాజిక వేత్త బేతాళ వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.
జూదాలకు దిగి, జేబు గుల్లచేసుకున్న వాళ్లు నోరు మెదపలేకపోతున్నారు గానీ ఇదో పెద్ద సమస్యగా మారిపోతోందంటూ ఆయన తెలిపారు. నియంత్రణ చర్యలు అత్యవసరమని అంటున్నారు.