పిచ్చి పీక్ కు పోయిందంటే ఇదే కావొచ్చు.
అభిమానం అంచులు దాటుతోంది. పిచ్చి పీక్ కు పోయిందంటే ఇదే కావొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికలు పోరు బాటను తలపించాయి. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత వైఎస్సార్సీపీ తరపున నిలబడితే ఎడిఏ కూటమి తరుపున జనసేన అభ్యర్థిగా కె పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇరువురు కాపు ఓట్లపై ఆధారపడి పోటీకి దిగారు. పవన్ కళ్యాణ్ సినీ హీరో కావడంతో యువతీ యువకులు ఎక్కువ మంది పవన్ ను అనుసరించారని చెప్పొచ్చు. గీతకు కూడా అభిమానులు ఎక్కువే. పెద్దవారిని ఎవరిని పిఠాపురంలో కదిలించినా మా ఓటు గీతకేనంటున్నారు. గెలుపు ఓటములు అలా ఉంచితే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ కొందరు యువకులు బైకుల నెంబర్ ప్లేట్లపై బైక్ వెనుక వైపున రాయించుకుని చక్కర్లు కొడుతున్నారు. మరో వైపు హేచరీ వాళ్లు, హోటళ్ల వాళ్లు డిప్యూటీ సీఎం వంగా గీత అని బోర్డులు రాయించి పెట్టకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్ ప్లేట్లపై రాసుకుని ప్లేట్ పై జనసేన లోగో వేయించుకుని తిరుగుతుంటే చూసే వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెల్లడవుతాయి. తాను తప్పకుండా గెలిచి చూపిస్తానని పవన్ అంటుంటే తన గెలుపు ఖాయమని గీత అంటున్నారు. పైగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల తరపు వారు ఎవరికి వారు తాము తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటూ ప్రకటించడం చర్చగా మారింది. నేతల తీరు ఎలా ఉందో కార్యకర్తల తీరు కూడా అలాగే ఉంది. పిఠాపురంలో ఈ పరిస్థితులు ఉంటే..
విశాఖపట్నంలో 9వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇప్పటికే హోటళ్లు పూర్తిగా నిండిపోయాయని పది రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. చివరకు హోటళ్లలో పలువురు విచారిస్తే ఎన్ని రూములు కావాలంటే అన్ని రూములు ఉన్నాయని, బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ కడితే సరిపోతుందని హోటల్స్ యజమానులు చెప్పటం విశేషం. నేతల కంటే కార్యకర్తలు అత్యుత్సాహం చూపుతున్నారు. ఇది ఏపరిణామాలకు దారి తీస్తుందోననే చర్చ సాగుతున్నది.