Bairagipatteda stampede | తిరుపతి విషాదం: ప్రధాన కారణమిదే..!

ఓ మహిళ కింద పడింది. ఆమెను పైకి లేపడానికి చేసే ప్రయత్నంలో గేటు తెరుచుకుంది. అదే ఈ చిత్రం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-09 05:19 GMT
బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం పొరబాటుగా గేటు తెరుచుకోవడమే. టోకెన్ల కోసం బైరాగిపట్టెడ వద్ద పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు. అయితే, టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థత గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఆ పోలీసు అధికారి క్యూలైన్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాటకు దారితీసింది. బైరాగిపట్టెడ ఎంజిఎం హైస్కూల్ ప్రాంతంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అధికారులు పరిశీలించారు.


కేంద్రాలు ఇవి..

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఐదేళ్లుగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పది రోజుల పాటు టోకెన్లు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి బైరాగిపట్టెడలోని రామానాయడు జెడ్పీ హైస్కూల్ తో పాటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, రామచంద్రపుష్కరిణి, విష్ణునివాసం, శ్రీనివాసం యాత్రికుల సముదాయం, తుడా కార్యాలయం సమీపంలోని ఇందిరామైదానం.
ఇక్కడ రద్దీ అనీ..
తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రాల్లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గత అనుభవంతో పరిగంట్లకు తీసుకున్న కొందరు యాత్రికులు బైరాగి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్దకు చేరుకున్నారు. కాగా..
గురువారం వేకువ జామున అంటే 9వ తేదీ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. దీంతో టోకెన్లు తీసుకోవడానికి
బుధవారం ఉదయం 10 గంటలకే బైరాగిపట్టెడ ఉన్నత పాఠశాల కౌంటర్ వద్దకు భారీగా యాత్రికులు చేరుకున్నారు. విశాలమైన పాఠశాల ఆవరణలోని మైదానంలో బార్కెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల వెలుపల క్యూ కోసం బారికేడు లేదు. మిగతా ఎనిమిది కేంద్రాలతో పోలిస్తే ఇక్కడ ఆ వసతి తక్కువగానే ఉన్నది. ఇదే పరిస్థితి తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు అంచనా వేశారు.టోకెన్లు తీసుకునే సమయం ఎక్కువగా ఉండడంతో సమీపంలోని పార్కులోకి యాత్రికులను పంపించారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు.
బుధవారం రాత్రి 7 గంటలకు పార్కు మొత్తం జనంతో నిండిపోయింది. అన్ని వైపులా దిగ్బంధనం చేయడంతో ఎటు కదలలేని పరిస్థితి. అయితే వారికి పోలీసులు, టీటీడీ యంత్రాంగం మంచినీరు ఇతర కనీస వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నారు.
రాత్రి 8:30 సమయంలో బైరాగి పట్టెడ వద్ద ఇనుపకంచ వద్ద ఓ మహిళ కింద పడిపోయింది. ఆమెను పక్కకు తప్పించే యత్నంలో గేటు తెరుచుకుంది. అంతే, పాఠశాల సమీపంలోని పార్కు, రోడ్డుపై ఉదయం నుంచి నిరీక్షిస్తున్న యాత్రికులు ఒక్కసారిగా తోపులాటతో మీద పడిపోవడంతో తొక్కిసలాటకు దారి తీసినట్లు తెలుస్తోంది.
ఓ అధికారిపై నెపం..?
బైరాగి పట్టణ హైస్కూల్ వద్ద ఏర్పాటుచేసిన కేంద్రం వద్ద పోలీసు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కూడా అక్కడ కల్పించారు. ఈ కేంద్రం వద్ద డిఎస్పి రమణకుమార్ సారధ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షణకు నియమించారు.
ఎడతెరపిలేని పరిశీాలన.. సమీక్షలు
తిరుపతిలోని మిగతా కేంద్రాల మాదిరే బైరాగి పట్టడం వద్ద కూడా బార్కెట్లు ఏర్పాటు చేయాలని ఉన్నత అధికారులు సూచించినట్లు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది విడ్డూరమే. తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నెలరోజుల నుంచి ఈ ఏర్పాట్లు పరిశీలించి పర్యవేక్షించడానికి టిటిడి ఈఓ శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ సీవిఎస్ఓ శ్రీధర్, తిరుపతి ఎస్పి ఎల్. సుబ్బారాయుడు తోపాటు పోలీస్, రెవిన్యూ, టీటీడీ యంత్రాంగం మొత్తం పరిశీలించింది. ఎడతెరిపి లేకుండా తిరుపతి, తిరుమలలో నిత్యం సమీక్షలతో అధికారులు సిబ్బందిని సమన్వయం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు..
ఆకోవలోనే బైరాగి పట్టడం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కూడా అధికార బృందం అనేక దఫాలు సందర్శించింది. మిగతా కేంద్రాల మాదిరే ఇక్కడ కూడా ప్రత్యేక బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేయడంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేదనేది సమాధానం లభించని ప్రశ్నగా మిగిలిపోయింది.
తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద జరిగిన తొక్కేసేలాట దుర్ఘటనలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు, 43 మంది గాయపడి తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గతంలో ఎన్నడూ జరగని దుర్ఘటన తిరుపతి వాసులను తీవ్రంగా కలచివేసింది. ఈ విషయాన్ని పక్కకు ఉంచితే, టీటీడీ అధికారులు కానీ పోలీసు ఉన్నతాధికారులు కూడా కిందిస్థాయి సిబ్బందిని ఘటనకు బాధ్యులు చేసి, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
టిడిపి కూటమికి దన్నుగా నిలిచే ఓ పత్రిక కూడా అదే తరహా కథనాన్ని ప్రచురించింది. టికెట్లు జారీ చేసే కేంద్రం వద్ద సిబ్బంది, అధికారులు వారికి కేటాయించిన విధులను నిర్వహించడంలో నిర్లక్ష్యం జరిగితే ఖచ్చితంగా క్షమించరాని నేరమే. తప్పిదమే. తిరుపతిలోని మిగతా కేంద్రాలతో పాటు వద్ద కూడా పగడ్బందీ ఏర్పాటు చేయడంలో బాధ్యులు ఎవరనేది విచారణలో తేలే అవకాశం ఉంది.
చేతులు దులుపుకునే యత్నం..
జరిగిన దుర్ఘటన వెనక తమ బాధ్యత ఏమీ లేదనే విధంగా టీటీడీ పాలకమండలి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
"ఇంటెలిజెన్సీ వైఫల్యమే దీనికి కారణం" అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా వద్ద వ్యాఖ్యానించారు. ఇంకొన్ని గంటల్లో ( గురువారం తెల్లవారుజామున) తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో టీటీడీ, పోలీస్, ఉన్నతాధికారులతో పాటు పాలకమండలి చైర్మన్ సభ్యులు కూడా బుధవారం రాత్రి తిరుమల లోనే ఉన్నారు. ఆ సమయంలో కూడా "తిరుపతిలో టోకెన్లు జారీ చేసే కౌంటర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోమని ఎస్పీ సుబ్బారాయుడును హెచ్చరించాను" అని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గుర్తు చేశారు. "ఇది ఊహించని విషాద ఘటన. బాధాకరం" అని బీ. నాయుడు మృతులకు నివాళులు అర్పించడంతోపాటు బాధితులకు అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో ఏ శాఖ అధికారులపై చర్యలు ఉంటాయనేది వేచి చూడాల్సిందే.

 

Tags:    

Similar News