అధికారుల రాకపోకల్లో ట్విస్ట్‌లు!

ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పనిచేయడం అధికారులకు సవాలుగా మారింది. ఎందుకు ఇలా జరగుతోంది?

Update: 2024-06-08 09:11 GMT

ప్రభుత్వం మారింది. అధికారులు మారనున్నారు. అయితే కొందరు అధికారులు తనకు సమాధానం చెప్పిన తరువాత మాత్రమే వెళ్లాలని చంద్రబాబు చెప్పడంతో వారికి సెలవులు ఇవ్వటం కానీ, డిప్యుటేషన్‌లు క్యాన్సిల్‌ చేయడం కానీ జరగలేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొందరు అధికారులు రావడం, మరికొందరు పోవడం సహజంగా జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అందుకు కాస్త భిన్నంగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉండి చక్రం తిప్పిన అధికారులను వెంటనే టీడీపీ ప్రభుత్వం పంపించేందుకు అంగీకరించడం లేదు. కొంత మూల్యం చెల్లించిన తరువాత వెళ్లాల్సి ఉంటుందని, అప్పటి వరకు కాస్త వెయిట్‌ చెయ్యాలని ప్రభుత్వ పెద్దలు నిలుపుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు రెచ్చిపోయారని, అటువంటి వారికి కాస్త చురకలు అంటించాల్సి ఉందనే భావలో నూతన టీడీపీ ప్రభుత్వం ఉంది. టీడీపీ గెలవగానే పలువురు, ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చాలా మందికి సెలవు ప్రభుత్వం ఇవ్వలేదు. సెలవులు ఇవ్వొంద్దంటూ సాధారణ పరిపాలన శాఖను తెలుగుదేశం పార్టీ నేతలు ఆదేశించారు. దీంతో సెలవుల మంజూరు ఆగిపోయింది. కొందరు ఐపీఎస్‌లు చంద్రబాబునాయుడును కలిసేందుకు గురువారం ప్రయత్నించారు. అయితే వారికి అవకాశం ఇవ్వలేదు. అపాయింట్‌ మెంట్‌ లేనందును లోపలికి వెళ్లేందుకు వీలు లేదని పలువురు ఐపీఎస్‌లను సెక్యూరిటీ వారు వెనక్కి పంపించారు. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన వారిలో ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజిలెన్స్‌ కమిషనర్‌ డాక్టర్‌ కొల్లి రఘురామిరెడ్డి, గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. సిఐడీ చీఫ్‌ సంజయ్, మాజీ చీఫ్‌ పివి సునీల్, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్‌ ఐజి రామకృష్ణ, గనుల శాఖ ఎండీ జివి వెంకటరెడ్డి, సమాచార పౌర సంబందాల శాఖ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, ఎపిఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండి మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్‌ చిలకల రాజేశ్వర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, టిటిడీ ఈవో ధర్మారెడ్డిలు సెలవులు కావాలని కోరితే ఇవ్వలేదు. వీరిలో చాలా మంది వేరే డిపార్టుమెంట్ల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు. డిప్యుటేషన్‌ క్యాన్సిల్‌ చేయాల్సిందిగా కోరినా నూతన పాలకులు అంగీకరించలేదు.
సీఎంలోలో అధికారులుగా ఉన్న పూనం మాలకొండయ్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తాలను బదిలీ చేస్తూ జిఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు. గురువారం వరకు సిఎస్‌గా ఉన్న డాక్టర్‌ జవహర్‌రెడ్డి సెలవు కోరినా ముందుగా ఇవ్వలేదు. శుక్రవారం 21 రోజులు సెలవు మంజూరు చేస్తూ నూతన సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్‌ అధికారులు రిషాంత్‌రెడ్డి, జాషువాలు కూడా సందిగ్ధంలో ఉన్నారు. వీరికి కూడా సెవలు ఇవ్వొద్దని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ కూడా ఇస్టానుసారం వ్యవహరించాడని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
కాగా ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్‌ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్రను ఇప్పటికే విధుల్లోకి తీసుకున్నారు. ఐఏఎస్‌ అధికారులు యువరాజ్, రాజమౌళిలను సీఎంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టగానే ఐపీఎస్‌ అధికారులైన ఐజీ ఎన్‌ బాలసుబ్రమణ్యం, డిజీ ర్యాంకులో ఉన్న మహేచంద్ర లడ్హాలు ఏపీ నుంచి బయటకు వెళ్లారు. బాలసుబ్రమణ్యం చదువుకునే నిమిత్తం విదేశాలకు వెళ్లారు. లడ్హా కేంద్ర సర్వీసులకు వెళ్లారు. వీరిద్దరూ తిరిగి ఏపీలో బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలపైనా దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు వీరిలో చాలా మంది మారే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News