‘ఓటును ఆయుధంగా వాడండి’- మాజీ హోంశాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య

ఓటుతో ప్రభుత్వాల తలరాత మారుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు, వైద్యులు కోరారు.

Update: 2024-02-04 10:34 GMT

ఓటును ఆయుధంగా వాడి ఆదర్శ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య పేర్కొన్నారు. విజయవాడలోని ది వెన్యూ హాలులో ఈరోజు జరిగిన ‘ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం’ అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు.

ఓటు ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేయడం బాధ్యతగా భావించాలని కే. పద్మనాభయ్య పిలుపునిచ్చారు. గత పాలకులు సమాజ సేవకులుగా ప్రవర్తిస్తే, నేడు రాజకీయాల్లోకి క్రిమినల్స్, అవినీతిపరులు అధిక సంఖ్యలో వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లోక్ సభ అభ్యర్థి రూ. 100 కోట్లకు పైగా వెచ్చించే స్థితికి రాజకీయాలు చేరాయని, రాజకీయాలు లాభాపేక్షతో కూడిన వృత్తిగా మారిందన్నారు. ఓటును సక్రమంగా వినియోగించడం ద్వారా రాజకీయాలలో సమూల మార్పులు తేవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఎన్నికల అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగిస్తూ.. ఓటర్ల క్రియాశీలత, భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి అన్నారు. ఓటర్ల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం ప్రతిష్ట మారుతుందన్నారు.

పట్టణ ప్రాంతాలలో, విద్యాధికుల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఐక్యంగా కృషి జరగాలని ఆకాంక్షించారు. ఓటింగ్ శాతాన్ని పెంచుకొని పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ , సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్ . వీ. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ధ్వంసం అయిన వ్యవస్థలను పునర్ నిర్మాణం చేసుకోగలమన్నారు. రాబోవు ఎన్నికలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు అర్హులైన వారు ఓటును దరఖాస్తు చేసుకొని పొందవచ్చని సూచించారు. ఓటును సద్వినియోగం చేసుకోకపోతే సుపరిపాలన కావాలని అడిగే నైతిక హక్కు ఓటర్లకు లేదన్నారు. ఓటర్ల ఉదాసీనత ప్రజాస్వామ్యానికి శుభ సూచకం కాదని హెచ్చరించారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్ ప్రసంగిస్తూ కులం, మతం, విద్య , ఆర్థిక , లింగ వివక్షతల కు అవకాశం లేకుండా మన రాజ్యాంగం 1950లోనే 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. ఓటుకు ప్రభుత్వాలను మార్చే శక్తి గలదని అనేకసార్లు రుజువు చేసిందన్నారు.

సభకు అధ్యక్షత వహించిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ.. భారతదేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్లను జాగృతులను చేయడానికి రాష్ట్రస్థాయిలో కళాజాతను ఫిబ్రవరి 25 నుంచి అన్ని జిల్లాలలో నిర్వహిస్తామని, అలాగే చైతన్య సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం ప్రసంగిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు , సేవా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలన్నారు. విజయవాడ డిక్లరేషన్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరియు సేవా సంస్థల ఉమ్మడి విజ్ఞప్తి కరపత్రాన్ని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 35 సేవా సంస్థలు , విద్యాసంస్థలు , పారిశ్రామిక , వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పూర్వ మేయర్ జంధ్యాల శంకర్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.సీ.దాస్, విద్యారంగ సేవకులు దేవినేని జయశ్రీ , దక్షిణ భారత మాజీ సైనిక సంఘం కార్యదర్శి ఎం. శంకర్ రావు, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి. భాస్కరరావు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ వై .వి ఈశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ కార్యదర్శి రావి శారద , ఏపీ గాంధీ స్మారక నిధి కార్యదర్శి వై .రామచంద్రరావు , రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ పట్టాభి రామయ్య , లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

Tags:    

Similar News