మూడు దశాబ్దాలు ఉమ్మడి విశాఖ జిల్లాను ఏలిన తంగేడు రాజులు

ఉమ్మడి విశాఖను మూడు దశాబ్దాల పాటు అనధికారికంగా పాలించిన తంగేడు రాజులు ఇప్పుడేమయ్యారు. వారు కనుమరుగవడానికి జిల్లాల పునర్విభజనే కారణమా..

Update: 2024-04-16 07:49 GMT
Source: Twitter

(శివరామ్)

విజయనగరం కూడా కలిసి ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు దశాబ్దాల పాటు వారు చెప్పిందే వేదం. వారు చేసిందే రాజకీయం. వారు చెప్పిన వారికే ఎన్నికల్లో బీఫారంలు. ఎంపిక చేసిన వారే దాదాపుగా అభ్యర్దులు. నర్సీపట్నానికి ఆనుకొని ఉన్న కోటవురట్ల మండలంలోని తంగేడు అనే గ్రామ జమీందార్లు అయిన రాజుల హవా ఇది. విజయగనరం పీసపాటి రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం వైరిచర్ల రాజులు మాదిరిగా వీరికి సంస్ధానాలు లేవు, కోటలు అంతకన్నా లేవు . అయినా ఉత్తరాంధ్రాలో ముప్పై సంవత్సరాల పాటు హవా నడిపించారు.

జిల్లా పరిషత్ వీరి చేతుల్లోనే

జిల్లా పరిషత్ చైర్మన్ అంటే విపరీతమైన గౌరవం, చేతినిండా అధికారం, ఖర్చు చేసేందుకు నిధులు ఉన్న ఆ రోజుల్లో తంగేడుకు చెందిన రాజా సాగి సూర్యనారాయణ రాజు, ఆయన సోదరుడు రాజా సాగి సీతారామరాజు మూడు దశాబ్దాలు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఒక వెలుగు వెలిగారు. జిల్లా పరిషత్‌లు ఏర్పడిన తరువాత 1957-1962 వరకు సూర్యనారాయణ రాజు , 1962-1977 వరకు రాజ సాగి సీతారామరాజు చైర్మన్లుగా పనిచేశారు. 1967‌-1977 సంవత్సరాల మధ్య సూర్యనారాయణ రాజు రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరి వారసుడిగా 1983లో రామచంద్రరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి 800 ఓట్ల తేడాతో ఓడిపాగా, ఆ తరువాత 1889 ఎన్నికలలో రాజాసాగి కృష్ణమూర్తి రాజు నర్సీపట్నం నుంచి శానసభ్యుడిగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2004 వరకు పాయకరావుపేట, నర్సీపట్నం టికెట్లు వీరిని కాదని కేటాయించే పరిస్థితులు లేవు. 2004 ఎన్నికల్లో తంగేడు రాజులకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సూర్యనారాయణ రాజు మనవడైన డీవీ సూర్యనారాయణ రాజు స్వతంత్ర అభ్యర్థిగా పోలీ చేసి రెండవ స్దానంలో నిలచారు. 2008లో ఆయనకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆయన వైసీపీలో మినరల్ కార్పోరేషన్ చైర్మన్‌గా కొనసాగుతుండగా, తంగేడు కుటుంబానికే చెందిన రాజా సాగి సీతారామరాజు కోటవురట్ల మండల వైస్ ఎంపీపీగా ఉన్నారు.

ద్రోణంరాజును తెచ్చారు... తెన్నేటి విశ్వనాథంను ఓడించారు.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా, లోక్‌సభ, రాజ్య సభ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా చక్రం తిప్పిన ద్రోణంరాజు సత్యనారాయణను తంగేడు రాజులే రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రోత్సహించారు. 1972లో ద్రోణంరాజు.. తంగేడు రాజుల ద్వారా విశాఖ కాంగ్రెస్ టికెట్‌కు ప్రయత్నించారు. అయితే తెన్నేటి విశ్వనాథం పోటీ చేస్తున్నారని తెలిసి వెనక్కి తగ్గారు. చివరకు ఆయన పోటీ చేయకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ధ్రోణంరాజును బరిలోకి దించారు. 1200 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1977లో విశాఖ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు సత్యనారాయణను బరిలోకి దింపి జనతా పార్టీ అభ్యర్థి తెన్నేటి విశ్వనాథంను ఓడించారు.

బీఫారాలు తంగేడు నుంచే ఆ రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేసే కాంగ్రెస్ పార్టీ బి ఫారం.. తంగేడు రాజుల నుంచే ఉత్తరాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థులకు అందేది. ఢిల్లీ ,హైదరాబాద్‌లకు తరచుగా వెళ్లే వీరు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు . ఆ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ బీఫారాలను వీరే తీసుకువచ్చి అభ్యర్దులకు అందజేసేవారు.

పునర్విభజనతో హవా కు గండి..

సామాజిక సమీకరణాల నేపథ్యంలో నర్సీపట్నం కొప్పల వెలమలకు పరిమితం కావడం, తాముండే తంగేడు 2009 నాటి పునర్విభజనలో ఎస్‌సీలకు రిజర్వు అయిన పాయకరావు పేటలోకి వెళ్లిపోవడంతో తంగేడు రాజులకు సొంత నియోజకవర్గం అంటూ ఏమీ లేకుండా పోయింది. గతంలో తమ పెద్దలు ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు దూరమయ్యాయి. అనకాపల్లి పార్లమెంటు కూడా క్షత్రియులకు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒక రేంజ్‌లో హవా నడిపిన తంగేడు రాజులు నామినేటెడ్ పదవులకే పరిమితం కావాల్సవచ్చింది.

Tags:    

Similar News