నోరు పారేసుకున్న మాజీలు ఎక్కడ?
నాడు అధికారంలో ఉండగా నోరు పారేసుకున్నారు. అధికారం చేజారగానే కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
Byline : The Federal
Update: 2024-06-15 05:32 GMT
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అడ్డూ అదుపు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభుత్వం పోవడంతో వారిప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారి పోయాయి. 2019లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రజల చేతిలో ఘోర పరాజయం పాలైంది. వైఎస్‌ఆర్‌సీపీకి 2019లో 151 స్థానాలు వస్తే.. 2024లో తెలుగుదేశం కూటమికి 164 సీట్లు వచ్చాయి. గతంలో వైఎస్‌సీపీకి తిరుగులేని మెజారిటీ ఎలా ఇచ్చారో.. అంతకంటే ఎక్కువ మెజారిటీని ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఇచ్చి వైఎస్‌ఆర్‌సీపీని ఘోరంగా ఓడించింది.
నేతల నోటి దురుసే కారణమా?
జగన్ ప్రభుత్వంలోని కొందరి మంత్రులు బూతు మంత్రులుగా పేరు సంపాదించుకున్నారు. బూతుల మంత్రులు ఎవరు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది గుడివాడ కొడాలి నాని. తర్వాత ఆర్కే రోజా, అనిల్‌కుమార్ యాదవ్, అంబటి రాంబాబు. జోగి రమేష్‌లు. గుడివాడ అమర్నాథ్ కూడా అదే వరుసలోకి వస్తారు. ఇక ఎమ్మెల్యేల విషయానికొస్తే ప్రధానంగా గన్నవరం వల్లభనేని వంశీ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని వంటి నేతలు ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా ప్రతిపక్ష నేతలపై విరుచుకు పడేందుకు జగన్ కొందరిని ఎంపిక చేస్తారు. ఉదాహరణకు పవన్ కల్యాణ్‌ను విమర్శించాలన్నా.. రాజకీయంగా మాటాలతో ప్రతి దాడులు చేయాలన్నా అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌లను వదులుతారు. వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పెషల్ డైరెక్షన్స్ ఇవ్వడంతో పాటుగా అక్కడే తయారు చేసిన ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ ఒకటి ముందుగానే చేరుతుంది. ఆ స్క్రిప్ట్‌లోని పదాలు ఉపయోగించడంతో పాటు వీరి సొంత పైత్యం ఉపయోగించి ఇష్టాను సారం తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ సినిమా నటుడు కావడం వల్ల అప్పుడప్పుడు ఆర్కే రోజాతో కూడా మాటల దాడి చేయిస్తారు.
ఇక బీసీ నేతలను విమర్శించాలనుకున్నప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలోని బీసీ మంత్రులు, నాయకులను వదులుతారు. ఎస్సీ నాయకులను ఉపయోగించి ఎస్సీలపై, ఎస్టీ నాయకులతో టీడీపీలోని ఎస్టీ నాయకులపై మాటల దాడి చేయిండం వైఎస్‌ఆర్‌సీపీ ప్రత్యేకత.
2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలు కావడంతో వీరంతా నోరు మెదపడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కాని పరిస్థితులు ఆ పార్టీలో ఏర్పడ్డాయి. బయట కనిపిస్తే.. సాధారణ కార్యకర్తల కంటే ఘోరంగా దాడులు జరిగే అవకాశం ఉందని, సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఈ నేతలు కొంత కాలం ముఖం చాటేయడం మంచిదని భావించినట్లు సమాచారం.
కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైకి టీడీపీ కార్యకర్తలు దాడులు చేసేందుకు వందల సంఖ్యలో వెళ్లినప్పుడు వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. తర్వాత బయటకు కనిపించకుండా వారికి అనుకూలమైన మీడియాతో మేము తలచుకుంటే వీళ్లో లెక్కా.. అంటూ ప్రగల్బాలు పలికారు. పైగా మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, తమపై, తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు.
సద్విమర్శకు ఎందుకు ప్రాధాన్య మివ్వలేదు
వైఎస్‌ర్‌సీపీలో బూతు పురాణాలు, మాటల దాడులు చేసిన నాయకులు ప్రతిపక్షంలోని నాయకులను విమర్శిలు చేసేటప్పుడు సద్విమర్శలు ఎందుకు చేయలేదు? బూతులు తిట్టడమే ఎందుకు పనిగా పెట్టుకున్నారు? రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అలా అని బూతులు మాట్లాడాన్ని ప్రతిపక్షం ఎలా స్వాగతిస్తుందనేది పెద్దలైన ఈ నేతలకు తెలియంది కాదు. తెలిసి కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వంటి నేతలను ఇష్టాను సారంగా తిట్టడం, మహిళల గురించి అవమానకరంగా మాట్లాడటం, వారి విజ్ఞతను తెలియజేస్తుంది. ఒక దశలో చంద్రబాబు నాయుడు తన సతీమణి గురించి అవమానకరంగా మాట్లాడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కన్నీరు పెట్టుకోవలసి వచ్చింది. ఇవన్నీ చూసిన ఓటర్లు ఇలాంటి నోరు పారేసుకునే నేతలు మనకు అవసరం లేదంటూ నేలకేసి కొట్టినట్లు తీర్పునిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో తప్ప గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి బూతులతో కూడుకున్న విమర్శల దాడులు జరగ లేదు. ఇవన్నీ జగన్ మెప్పు కోసం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి.
బూతుల మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మంచి బుద్ది చెప్పారు. రాజకీయాలంటే బూతులు కాదని, రాజకీయాలంటే సద్విమర్ళలతో కూడిన అభివృద్ధిని కాంక్షించేలా ఉండాలనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. తమకు తిరుగు లేదని విర్రవీగిన నాని, వంశీ, అనిల్‌కుమార్ యాదవ్, రోజా, అంబటి, విడదల రజిని వంటి వారు మట్టి కరవక తప్ప లేదు. అందుకే నేటి నేతలు నాటి రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలే తప్ప నేడు నోరు పారేసుకునే నాయకులను ఆదర్శంగా తీసుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఓటర్ల తీర్పు స్పష్టం చేసింది.