నాగబాబుకు ఏ శాఖ ఇద్దాం..ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయిద్దాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రథ సారథులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు తాజాగా భేటీ అయ్యారు.;
By : The Federal
Update: 2024-12-16 12:42 GMT
జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం లేక పోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆ తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఇది వరకే నిర్ణయించారు. నారా లోకేష్‌ను కూడా ఇది వరకు అలానే తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అదే విధంగా ఈ సారి నాగబాబుకు కూడా అవకాశం కల్పించారు.
సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోకి నాగబాబు ఎంట్రీ ఈజీగానే అయిపోయినా.. నాగబాబుకు మంత్రిత్వ శాఖ కేటాయింపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు నాగబాబుకు మైనింగ్ శాఖ ఇస్తారనే టాక్ మాత్రం కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు శాఖ కేటాయింపుతో పాటు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఎప్పుడు అనే దానిపైన కూటమి వర్గాల్లోను ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి సచివాలయంలో సోమవారం సాయంత్రం కలిశారు. దాదాపు 40 నిముషాల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. ప్రత్యేకించి నాగబాబు అంశంపైనే చర్చించినట్లు సమాచారం. నాగబాబుకు ఏ శాఖను కేటాయించాలి, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయించాలనే దానిపైనే ప్రముఖంగా చర్చించినట్లు తెలిసింది. తర్వాత జెమిలీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించినట్లు సమాచారం. దీంతో పాటుగా కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో నెలకొంటున్న విభేదాలు, గొడవలు, వారిని ఎలా సమన్వయం చేయాలనే దానిపైన కూడా ఇరువురు చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీ అంశపైన చర్చించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నామినేటెడ్ పదవుల మలి జాబితాపైన, ఎవరికి ఎన్ని ఇవ్వాలనే దానిపైన చర్చించి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.