AP POLITICS| నన్ను అరెస్ట్ చేసి జగన్ సర్కార్ తప్పుచేసిందన్న చంద్రబాబు?

త్వరలో వాట్సాస్ పాలన తీసుకువస్తాం. ఎక్కువ మంది పిల్లల్ని కన్నవాళ్లకు ప్రోత్సాహకాలు ఇస్తాం అంటున్నారు చంద్రబాబు.

Update: 2024-11-16 14:22 GMT
Chandrababu Naidu (file Photo)
"నన్ను అరెస్ట్ చేసి గత ప్రభుత్వం పెద్ద తప్పిదమే చేసిందనుకుంటున్నా. 2023 సెప్టెంబర్ లో జరిగిన నా అరెస్ట్ కేవలం రాజకీయమే. అయితే నేను ఆ అరెస్ట్ ను బలంగా తిప్పికొట్టా. బయటపడ్డా" అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వానికి కీలకమైన మద్దతుదారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆంధ్రా సిఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ఓ మిషన్ మోడ్ లో పని చేస్తుంటారన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్లాన్ చేశారని చంద్రబాబు నవంబర్ 16న ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ (హెచ్.టీ) నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో అన్నారు.
మోదీ ఎప్పుడూ తదుపరి ఎన్నికల కోసం పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 2029ఎన్నికలకు ప్లాన్ చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తన మిత్రులతో కలిసి పని చేస్తున్నారని ప్రశంసించిన చంద్రబాబు మోదీ పని తీరు ఎలా ఉంటుందంటే అదో మిషన్ మోడ్ లో ఉంటుందన్నారు.
మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి కీలకమైన మద్దతుదారు చంద్రబాబు. ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామంటే దాన్ని "ప్రభావం" చేయడం కాదు, దానితో కలిసి పని చేయడమే తన విధానం అన్నారు. "ప్రధానమంత్రి తన మిత్రపక్షాలతో గొప్ప ఆలోచనలను పంచుకున్నప్పుడు మేము కలిసి పనిచేయడమే కాదు, వాటిని బలోపేతం చేస్తాం" అన్నారు చంద్రబాబు.
మిత్రపక్షాల అభిప్రాయాలను ప్రధాని గౌరవిస్తున్నారని నాయుడు ప్రశంసించారు. "ఆయన బలమైన నాయకుడు. ఆధునిక, ప్రగతిశీల దృక్పథంలో ఉన్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన (మోదీ) ఎన్డీయే ముఖ్యమంత్రులందరినీ కలుస్తారని మాకు సమాచారం అందింది. తర్వాత నాలుగు గంటలపాటు నిరంతరాయంగా సమావేశం నిర్వహించారు.
అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నప్పుడే పాలన, పరిపాలనా విధానాలపై దృష్టి కేంద్రీకరించారని మోదీని కీర్తించారు. ఇవి ఉంటేనే సరిపోదని, ప్రజలకు మరింత చేరువ కావడం కూడా అవసరమని మోదీ నుంచి నేర్చుకున్నానన్నారు. “ఆయన (మోదీ) చేస్తున్నది అదే. మోదీ ప్రజలను తన వెంట తీసుకువెళుతున్నారు. మీరు ప్రజలను మీతో తీసుకెళ్లాలి” అని ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలకు చెప్పారు.
వాట్సాప్ పాలన చేయబోతున్నాం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1995 ముఖ్యమంత్రి అయినపుడు 1991లోనే దేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణలను అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించినట్టు చెప్పారు.
మోదీ హయాంలో అధికారంలో ఉన్న సంకీర్ణంలో భాగం కావడం ఏమిటని అడిగిన ప్రశ్నకు, ప్రధాని ప్రతి ఒక్కరి మాట వింటారని టీడీపీ నేత చెప్పారు. "అది ఆయన అందించిన నాయకత్వం" అన్నారు.
TDP జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. 1996 సాధారణ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన 13-పార్టీల ఏర్పాటులోనూ కీలకంగా ఉంది. 1996, 1998 మధ్య కూటమి రెండు సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. నాయుడు ఆ కూటమికి కన్వీనర్‌గా పనిచేశారు.
నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నాయుడు 2000వ దశకంలో టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించే విధానాలను అమలు చేశారు. సమాచార-సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. దేశానికి ముందస్తు ప్రయోజనాన్ని అందించారు. చంద్రబాబు పేరు చెప్పడంతోనే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. పబ్లిక్ పాలసీలో సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఆయన దిట్ట అంటుంటారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన ప్రభుత్వం WhatsApp పాలనను ప్రారంభించేందుకు కృషి చేస్తోందని అన్నారు. "టెక్నాలజీని మేము బాగా ఉపయోగించాలి. ప్రస్తుతం డేటాయే సంపద. ఆ దిశగా దృష్టి సారించాం. వ్యవసాయం, పశువైద్యం, ఆరోగ్యం వంటి అంశాలలో నిజమైన పరిష్కారాలను సాధించడంలో AI మాకు సహాయపడుతుంది అన్నారు చంద్రబాబు.
2023లో రాజకీయ కారణాల వల్లే తనను జైలులో పెట్టారన్నారు. అయితే తాను బలంగా తిప్పికొట్టి బయటపడ్డానని టీడీపీ నేత అన్నారు. “నేను చాలా ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్న విధానాలను అమలు చేశాను. నా కెరీర్ లో నన్నెవరూ వేలెత్తి చూపలేకపోయారు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణం లేకుండానే నన్ను అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. నా అరెస్ట్ అక్రమమన్నదే నా వాదన. అందుకే ధైర్యంగా ఉన్నాను అన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.3,300 కోట్ల కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేశారు.
దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తరుగుదల గురించి మాట్లాడుతూ జనాభా తరుగుదల చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనివల్ల ప్రమాదకరమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉందన్నారు.
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపిచ్చారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
“భారతదేశంలో చాలా ప్రధానమైంది జనాభా. ఈ జనాభాను సరిగా ఉపయోగించుకునేలా అడుగులు వేయాలి. దక్షిణ భారతదేశంలో వృద్ధాప్య సమస్య ఉంది. 1991లో భారతదేశ సంతానోత్పత్తి రేటు 5.2 లేదా 5.4., ఇప్పుడు మేము 2.5 వద్ద ఉన్నాం. అంతకన్నా దిగువకు వెళితే చాలా ప్రమాదం. మేము సరిహద్దులో ఉన్నాం. 2.5 దిగువకు వెళితే జనాభా పెరగదు. అది మానవాళికి పెను ప్రమాదం” అని నాయుడు అన్నారు.
తన ప్రభుత్వం కూడా గతంలో కుటుంబ నియంత్రణ కోసం ప్రోత్సాహకాలను అందించిన సమయం ఉందన్నారు.
భారతదేశం ఇప్పటికైతే సాపేక్షంగా యువ దేశంగానే ఉందని, ఇది దేశానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నారు చంద్రబాబు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆ ప్రయోజనం 2035-40 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దక్షిణాదిలో జనభా తరగడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. పెరుగుతున్న జీవితకాలం, అధిక ఆదాయాలు కూడా కారణమేనన్నారు.
సంకీర్ణ రాజకీయాల యుగంలో విభేదాలు సహజమేనని నాయుడు అన్నారు. “ఒక కుటుంబంలోని తండ్రి, కొడుకు, భార్యాభర్తల మధ్యే విభేదాలు ఉంటాయి. మన ఇంటికి ఎటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తామో రాజకీయాల్లోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది అన్నారు చంద్రబాబు.
Tags:    

Similar News